పల్లె ప్రగతికి పాటుపడతాం
పల్లె ప్రగతికి పాటుపడతాం
Published Sat, Dec 24 2016 10:13 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
- తానా బృంద సభ్యుల ప్రకటన
- కప్పట్రాళ్లలో రైతు కోసం - తానా కార్యక్రమం
- పాఠశాలలో డిజిటల్ క్లాసులు ప్రారంభం
- జిల్లా ఎస్పీ, తానా బృందాన్ని సత్కరించిన కప్పట్రాళ్ల వాసులు
కప్పట్రాళ్ల(దేవనకొండ) : తెలుగు రాష్ట్రాల్లోని గ్రామాలను అన్ని విధాలా అభివృద్ధి పరిచేందుకు తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని తానా (ఉత్తర అమెరికా తెలుగుసంఘం) అధ్యక్షులు జంపాల చౌదరి, జాయింట్ సెక్రటరీ పొట్లూరి రవి, బృంద సభ్యులు ప్రకటించారు. ఎస్పీ దత్తత గ్రామం కప్పట్రాళ్లలో శనివారం ముప్ఫా ఫౌండేషన్ ప్రోగ్రాం కన్వీనర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో రైతుకోసం-తానా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన తానా బృందం సభ్యులు, జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణను గ్రామస్తులు తెలుగు సంప్రదాయం ప్రకారం ఎద్దులబండిపై ఊరేగించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సభలో జంపాల చౌదరి, పొట్లూరి రవి మాట్లాడుతూ విద్యతోనే సమాజంలో ఏదైనా సాధించవచ్చన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని పిల్లలను బాగా చదివించాలని పిలుపునిచ్చారు. తమ సంస్థ 40 సంవత్సరాల నుంచి గ్రామాల్లో విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తోందన్నారు. ఇందుకోసం ఇప్పటివరకు రూ.300 కోట్లను ఖర్చు చేసినట్లు చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పాఠశాలల్లో డిజిటల్ క్లాసుల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగానే గ్రామంలోని జెడ్పీ పాఠశాలలో డిజిటల్ క్లాసులు, గ్రంథాలయాన్ని ప్రారంభించారు. తానా ఆధ్వర్యంలో అంగన్‌వాడీ భవన నిర్మాణాలు, శ్మశానవాటిక ప్రహరీల ఏర్పాటును కూడా చేపడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రైతుల్లో సరైన అవగాహన లేకపోవడంతో ఇష్టానుసారంగా మందులను పిచికారి చేస్తూ ఆర్థికంగా నష్టపోవడంతోపాటు అనారోగ్యాలకు గురవుతున్నారన్నారు. అనంతరం రైతులకు రక్షణ కిట్లను అందజేశారు. జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ మాట్లాడుతూ కన్నతల్లిని, పుట్టిన ఊరుని ఎప్పటికీ మరిచిపోరాదన్నారు. చైతన్యస్రవంతి కార్యక్రమం ద్వారా గ్రామాల్లో తానా సంస్థ వారు అభివృద్ధి పనులు చేపట్టడం సంతోషించదగ్గ విషయమన్నారు. గ్రామంలో పొదుపు మహిళల కోసం స్త్రీశక్తిభవాన్ని నిర్మించాలని కోరగా అందుకు అంగీకరించడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో తానా సంఘంసభ్యులు ఉపాధ్యక్షులు సతీష్, వేమన, ఏపీ అధికార ప్రతినిధి కోమాటి జయరాం, గోగినేని శ్రీనివాసులు, అంజయ్యచౌదరి, గరికపాటి ప్రసాద్, జానయ్య, లోకేష్‌నాయుడు, గోవర్దన్‌రెడ్డి, డీఈఓ రవీంద్రారెడ్డి, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, డీఎస్పీలు బాబాఫకృద్దీన్, సీఐలు విక్రమ్‌సింహ, డేగల ప్రభాకర్, ఎంపీపీ రామచంద్రనాయుడు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొజ్జమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు హైమావతి, రిటైర్డ్ హెచ్‌ఎం రామరాజు, ఏఓ అక్బర్‌బాషా, గ్రామజ్యోతి కో-ఆర్డినేటర్ నారాయణ, దేవనకొండ ఎస్‌ఐ గంగయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement