ఎండుతున్న ఏటి వరిపల్లెలు
ప్రొద్దుటూరు మండలం శంకరాపురం గ్రామానికి చెందిన రైతు సిద్ధా రాఘవరెడ్డి తనకున్న నాలుగు ఎకరాల పొలంలో రెండు నెలల క్రితం వరి సాగు చేశాడు. ఎకరాకు రూ.20వేల వరకు ఖర్చు పెట్టాడు. పంట పండి ఉంటే 160 బస్తాల దిగుబడి వచ్చి రైతు కుటుంబానికి రూ.1.60 లక్షలు దక్కేది. కానీ, సాగునీరందలేదు. ఎన్ని బోర్లు వేసినా నీరు పడలేదు. పంట ఎండిపోయింది. ఫలితం.. ఎండిన వరి పైరును పశుగ్రాసంగా వినియోగించేందుకు రాఘవరెడ్డి సతీమణి రమాదేవి రోజు ఇలా కోసుకుని వెళ్తున్నారు.
ప్రొద్దుటూరు: కరువు పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం పెన్నానది పరీవాహక ప్రాంతంలో ఉన్న గ్రామాల పరిస్థితి దయనీయంగా ఉంది. నది పరీవాహక ప్రాంతంలోని బోర్లన్నీ ఎడిపోతున్నాయి. తాగు,సాగు నీటికి అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారు. శంకరాపురంలో పెన్నానది ఒడ్డున సుమారు 500 ఎకరాల పొలం ఉంది. కొంత మంది ఆరుతడి పంటలను, మరికొంత మంది వరి పంటను సాగు చేశారు. అయితే వర్షం లేక బోర్ల కింద పెన్నానది ఆధారంగా సాగు చేసిన పంటలు నిట్టనిలువునా ఎండిపోతున్నాయి. అన్ని గ్రామాల పరిస్థితి ఇలానే ఉంది.
బాధిత గ్రామాలు: మైలవరం జలాశయం నుంచి పెన్నానది పరివాహక ప్రాంతంలో వరుసగా వేపరాల, దొమ్మరనంద్యాల, జమ్మలమడుగు, కన్నెలూరు, గొరిగెనూరు, ధర్మాపురం, చలివెందుల, దేవగుడి, సున్నపురాళ్లపల్లె, పెద్దదండ్లూరు, చిన్నదండ్లూరు, సుగుమంచిపల్లె, చౌడూరు, నంగనూరుపల్లె, కాకిరేనిపల్లె, శంకరాపురం, పెద్దశెట్టిపల్లె, నరసింహాపురం, ఇల్లూరు, రామాపురం, చౌటపల్లె, కొత్తపేట, దొరసానిపల్లె, దానవులపాడు, సోములవారిపల్లె, నీలాపురం, రేగుళ్లపల్లె, సగిలిగొడ్డుపల్లె, కల్లూరు, తాళ్లమాపురం, వెదురూరు, తిప్పిరెడ్డిపల్లె ఇలా చాపాడు మండలం వరకు అనేక గ్రామాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా పెన్నానదిపై ఆధారపడి జీవిస్తున్నాయి.
జిల్లాలోని భారీ పరిశ్రమలకూ ఈ నది నుంచే నీరు సరఫరా అవుతోంది. పూర్వం 15 అడుగుల్లో నదిలో నీరు లభించేది. అయితే ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు, ఇసుక అక్రమ రవాణా కారణంగా ఎక్కడా నీటి చుక్క కనిపించడం లేదు. నాలుగు రోజులుగా పెన్నానది ఒడ్డున ఉన్న రైతులంతా మైలవరం నుంచి కృష్ణా జలాలు విడుదల చేయాలని అధికారులను సంప్రదిస్తున్నా ఎవరూ స్పందించడంలేదు.
తాగునీటికీ కటకట: శంకరాపురంలో తాగునీటికి కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఓ ఇంటిలో మోటారు వేస్తే దిగువనున్న వారికి నీరందడం లేదు. కొంత కాలంగా వీరు వ్యవసాయ బోరుకు వెళ్లి తాగునీటిని తెచ్చుకుంటున్నారు.
పెన్నానదికి నీరు వదలాలి: ప్రభుత్వం వెంటనే స్పందించి మైలవరం జలాశయం ద్వారా పెన్నానదికి నీరు విడుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకుంటే గ్రామాల్లో కరువు వచ్చి రైతులు మరింత దుర్భర పరిస్థితులు ఎదుర్కోక తప్పదు.