కయ్యం పెట్టిన కరువు రక్కసి
కయ్యం పెట్టిన కరువు రక్కసి
Published Wed, Aug 31 2016 11:46 PM | Last Updated on Tue, Oct 2 2018 6:46 PM
ఎల్లారెడ్డి :
నిన్న మొన్నటి వరకు కలసిమెలసి ఉన్న పక్కపక్క గ్రామాల రైతుల మధ్య కరువు రక్కసి చిచ్చుపెట్టింది. శిఖం భూమిలో సేద్యం హక్కుల విషయమై పోట్లాడుకునే స్థాయికి విభేదాలు చేరాయి.
మూడేళ్లుగా సరైన వర్షాలు కురియకపోవడంతో పంటల సాగు కష్టంగా మారింది. బోరుబావులు సరిగా నీటిని అందించడం లేదు. దీతో నిజాంసాగర్ క్యాచ్‌మెంట్ ఏరియా పరిధిలో ఉన్న గ్రామాల రైతులు ప్రాజెక్ట్ శిఖం భూమిలో పంటలు వేసుకోవడానికి పోటీ పడుతున్నారు. శిఖం భూమిలో సేద్యపు హక్కులు మావంటే మావంటూ గొడవలకు దిగుతున్నారు. గతేడాది చిన్నగా ప్రారంభమైన వివాదాలు ఈసారి ముదిరాయి. పార్టీలకు అతీతంగా చిన్నాపెద్దా ఏకమై శిఖం భూమి హక్కు కోసం పక్క గ్రామాల వారితో కయ్యానికి కాలు దువ్వుతున్నారు. రెవెన్యూ అధికారులకే కాకుండా పోలీసులకూ ఫిర్యాదులు చేసుకుంటున్నారు.
నిజాంసాగర్ క్యాచ్‌మెంట్ ఏరియా పరిధిలోని శిఖం భూమిలో సేద్యపు హక్కుల కోసం గతేడాది సాతెల్లి –జంగమాయిపల్లి గ్రామాల రైతుల మధ్య గొడవలు జరిగాయి. ఈ ఏడాది వేరే గ్రామాలకూ ఈ గొడవలు విస్తరించాయి. మండలంలోని తిమ్మారెడ్డి –మౌలాన్‌ఖేడ్, సోమార్‌పేట్ –హసన్‌పల్లి, రుద్రారం –మల్కాపూర్, మాదాపల్లి –ఆరేడు గ్రామాల రైతుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి.
నిజాంసాగర్ ప్రాజెక్ట్ శిఖం భూమి ప్రాంతంలో తమ గ్రామాలు ఉండేవని, ప్రాజెక్ట్ నిర్మాణం కారణంగా ఉన్నదంతా కోల్పోయిన తమకే ఆ భూమిలో పంటలు వేసుకోవడానికి హక్కు ఉంటుందని ముంపునకు గురై.. పునరావాస గ్రామంలో ఉంటున్న ప్రజలు పేర్కొంటున్నారు. అయితే తమ గ్రామాల శివారులో ఉన్న శిఖం భూములపై తమకే పూర్తి హక్కులు ఉంటాయని పాత గ్రామాల రైతులు అంటున్నారు. ప్రాజెక్ట్ నిర్మాణం అనంతరం శిఖం భూమిలో గ్రామాల మధ్య ఏర్పాటు చేసుకున్న సరిహద్దులను కొందరు చెరిపి వేస్తుండడంతో గొడవలు పెద్దవవుతున్నాయి. శిఖం భూమిలో సేద్యపు హక్కుల కోసం గ్రామాల మధ్య గొడవలు పెరుగుతుండడంతో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు సర్ది చెప్పేందుకు ప్రయత్నిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. రెవెన్యూ ఉన్నతాధికారులు శిఖం భూమి వద్దకు వెళ్లి సరిహద్దులను నిర్ణయించినా.. గొడవలు ఆగడం లేదు. ఈ విషయమై గొడవలు ఇలాగే కొనసాగితే శిఖం భూమిలో సేద్యానికి ఎవరికీ అనుమతి ఇచ్చేది లేదని రెవెన్యూ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. రైతాంగం కూర్చున్న కొమ్మను నరుక్కునే ధోరణితో పోకుండా సామరస్యంగా వ్యవహరించి, సమస్యలను పరిష్కరించుకోవాలని సూచిస్తున్నారు.
Advertisement