తాత - మనవరాళ్లు | today children's day | Sakshi
Sakshi News home page

తాత - మనవరాళ్లు

Published Thu, Nov 13 2014 11:22 PM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM

తాత - మనవరాళ్లు - Sakshi

తాత - మనవరాళ్లు

మాసాయిపేట ట్రైన్‌యాక్సిడెంట్ విషాదం ఇంకా ఎవరి మనసుల్ని మరిపించలేదు. ఆ సంఘటనలో ఎనిమిదేళ్ల చిన్నారి ఐదేళ్ల పిల్లలిద్దరినీ కాపాడి తనూ బయటపడింది! ఆ సాహసం పేరే రుచిత.. ఊరు.. వెంకటాయపాలెం!
 
 సామాన్యుడి కోసం ఓ వేయింగ్ మెషీన్‌ను తయారు చేసి జాతీయస్థాయి సైన్స్‌ఫేర్‌లో దుబ్బాక జెండా రెపరెపలాడించింది.. అబ్దుల్‌కలాం చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఆ తెలుగు వెలుగు.. పదమూడేళ్ల అర్చన!
 
 పచ్చని పంటపొలాలు నేర్పిన జీవన పాఠాల్ని షార్ట్ సినిమాలుగా చూపింది! ఈ ప్రతిభకు ఇండోనేషియా పురస్కారం అందింది! ఆ బాల దర్శకురాలు జహీరాబాద్ వాసి మయూర!
 ఖోఖోలో నల్లగొండ వ్యూహాన్ని నేషనల్‌వైడ్‌గా చాటుతున్న క్రీడారత్నం వైజయంతి!
 
 ఈ నాలుగు వజ్రాలు చిల్డ్రన్స్ డే సందర్భంగా హైదరాబాద్‌లో జిగేల్‌మన్నాయి.. సిటీప్లస్‌కే కాదు సీనియర్ మోస్ట్ సినిమా పర్సనాలిటీ.. నేడు విడుదలైన ఎర్రబస్ డెరైక్టర్ డాక్టర్ దాసరి నారాయణరావుకీ ఆత్మీయ అతిథులయ్యారు. ఆయన ఇంటికి వెళ్లారు. తాతయ్యా అంటూ మురిపించారు.. ఆయన బిజీ షెడ్యూల్‌ని కాసేపు మరిపించారు!

 జూబ్లీహిల్స్.. మధ్యాహ్నం 12.30
 ఎర్రబస్ సినిమా ప్రమోషన్ కోసం ప్రెస్‌మీట్ హడావిడిలో ఉన్నారు డాక్టర్ దాసరి నారాయణరావు. రుచిత, అర్చన, మయూర, వైజయంతి తనను కలవడానికి వచ్చారని తెలియగానే అంతటి బిజీని కాసేపు పక్కన పెట్టి పిల్లల్ని లోనికి ఆహ్వానించారు. వారి ప్రత్యేకతలను విని అబ్బురపడ్డారు. రుచిత చూపిన తెగువను తెలుసుకొని మనసారా ఆశీర్వదించారు. ఆ అమ్మాయి ‘మిమ్మల్ని తాతయ్యా అని పిలవచ్చా’ అంటే, ‘తాతయ్యా అనే పిలుమ్మా’ అంటూ ఒళ్లో కూర్చోబెట్టుకున్నారు.

ఎనిమిదేళ్లప్పుడే ‘నా చేను.. నా చదువు’ అనే షార్ట్ సినిమా తీశానని మయూర చెప్పగానే ‘ఆ వయసులో నేనూ నా తొలి నాటకాన్ని రాశాను. పదమూడేళ్లప్పుడు నా తోటివాళ్లకు నాటకాల్లో యాక్ట్ చేయడానికి ట్రైన్ చేసేవాడిని’ అని తన బాల్యాన్ని నెమరువేసుకున్నారు దాసరి. ‘సైన్స్‌ఫేర్‌లో అబ్దుల్‌కలాం చేతుల మీదుగా అవార్డు తీసుకున్నాను’ అని చెప్పిన అర్చనను ‘గ్రేట్ మ్యాన్ చేతులమీదుగా అవార్డ్ అందుకున్న గ్రేట్ గర్ల్..’ అంటూ అభినందించారు. ఖోఖోలో జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటుతున్న వైజయంతిని ‘అంతర్జాతీయస్థాయిలో పేరు తెచ్చుకోవాలని ఆశీర్వదించారు.
 
 డైనమిక్‌గా ఉండాలి..
 ఎర్రబస్ సినిమాలో మీ క్యారెక్టర్  ఏంటీ తాతయ్య అని అడిగిన పిల్లల ప్రశ్నలకు ‘పిల్లలంటే బాగా ఇష్టపడే తాతయ్య క్యారెక్టరే’ అని చెప్పారు. ‘మీరు తీసిన ఒసేయ్ రాములమ్మా.. సమ్మక్క సారక్క’ సినిమాలంటే మాకు చాలా ఇష్టమ’ని పిల్లలు ఆయన సినిమాలను గుర్తుచేశారు. పల్లెటూళ్లంటే ఇష్టమా సిటీ అంటే ఇష్టమా అని పిల్లలడిగిన ప్రశ్నకు జవాబిస్తూ ‘నా చిన్నప్పుడు పల్లెటూర్లో చాలా ఎంజాయ్ చేశాను.

ఈతలు, కొబ్బరిబొండాలు, కోతికొమ్మచ్చిలు, తాటికాయలు.. ఇలా అన్నీ ఇష్టమే’అని చెప్పారు. హైదరాబాద్‌తో తనకున్న జ్ఞాపకాలను పిల్లలతో పంచుకున్నారు దాసరి. ‘ఈతరం ఆడపిల్లలు ఎలా ఉండాలనుకుంటున్నారు తాతయ్యా’ అని వైజయంతి అడిగితే ‘మీలాగే ధైర్యంగా.. డైనమిక్‌గా.. డాషింగ్‌గా ఉండాలి’ అంటూ వాళ్ల భుజం తట్టారు.

 ‘ఇంతకీ పెద్దాయ్యాక మీరెమవ్వాలనుకుంటున్నారు’ అని నలుగురినీ అడిగితే ‘జడ్జి అవుతాను’ అని రుచిత, ‘పోలీస్ ఆఫీసర్’ అని వైజయంతి, ‘అగ్రికల్చర్ జర్నలిస్ట్’ అని మయూర, ‘సైటింస్ట్’ అని అర్చన జవాబు చెప్పారు. ‘శభాష్.. తప్పక కావాలి. ఇప్పటి నుంచే బాగా కష్టపడి చదవాలమ్మా’ అంటూ ప్రోత్సహించారు. వాళ్ల  ప్రతిభాపాటవాలకు ముచ్చటపడి ‘ఈ తాతయ్య చిన్న గిఫ్ట్ ఇస్తున్నాడు తీసుకోండర్రా’ అంటూ తలా పదివేలు క్యాష్‌ప్రైజ్ ఇచ్చారు డాక్టర్ దాసరి నారాయణరావు. ‘ఈ బాలల దినోత్సం నాకిచ్చిన కానుక వీళ్లే. చిల్డ్రన్స్‌డే సందర్భంగా ఈ బాల మేధావులను కలసుకోవడం సంతోషంగా ఉంది’ అన్నారు దాసరి.

 ప్రెజెంటర్: సరస్వతి రమ ఎవరెవరు ఏం కావాలనుకుంటున్నారంటే?
     మాసాయిపేట మానసపుత్రి రుచిత జడ్జి ఎందుకు కావాలనుకుంటుందంటే..
     ‘పేదవాళ్లకు న్యాయం చేయడానికి. అన్యాయం చేసినవాళ్లను కఠినంగా శిక్షించడానికి’
     నల్లగొండ ఖేల్త్న్ర వైజయంతి పోలీస్ ఆఫీసర్ ఎందుకు కావాలనుకుంటుందంటే..
     ‘ఆడవాళ్ల తరఫున నిలబడడానికి. వాళ్ల మీద జరుగుతున్న దాడులకు చెక్ పెట్టేందుకు’
     మయూర అగ్రికల్చర్ జర్నలిస్ట్ ఎందుకవ్వాలనుకుంటుందంటే..
     ‘దేశానికి వెన్నుముక రైతన్న. ఆయన ఏలే వ్యవసాయరంగాన్ని కలంతో ప్రపంచానికి పరిచయం చేయాలని’

 అర్చన సైంటిస్ట్ ఎందుక్కావాలనుకుంటుందంటే..
 
 ‘ఇంకెన్నో కొత్త విషయాలను కనిపెట్టాలి... ప్రపంచ శాస్త్రీ పరిశోధనలకు మనం కొత్తమార్గం చూపించేందుకు’
 ఇంత చిన్న వయసులో అంత గొప్ప ఆలోచనలున్న ఈ పిల్లలు నిజంగా మణిమాణిక్యాలే. వాళ్ల ఊళ్లకు వెళ్లడానికి వెహికిల్ ఎక్కిన బాలల్ని ఈ హైదరాబాద్ ట్రిప్ ఎలా అనిపించింది అని అడిగితే ‘సూపర్! దాసరి నారాయణరావు తాతయ్యను కలవడం.. ఆయనతో మాట్లాడటం ఇంకా హ్యాపీ. కేథరీన్ మా ఫేవరేట్ హీరోయిన్. అనుకోకుండా ఆమెను కలవడమూ మరీ ఆనందంగా ఉంది’ అని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement