Dr. Dasari Narayana Rao
-
భారతీయ సినిమా చరిత్రలో ఆ గ్రాఫ్ మోహన్‌బాబుదే!
- దాసరి ‘‘ఏ దర్శకుడైనా ఒక నటుణ్ణి పరిచయం చేసి వదిలేస్తాడు. కానీ, మోహన్‌బాబుని నేనలా వదల్లేదు. సంపూర్ణమైన నటుడిగా తీర్చిదిద్ది, పరిశ్రమకు అందించాను. మోహన్‌బాబు కూడా 40 ఏళ్లుగా నాతోనే ఉన్నాడు. ఎన్టీఆర్, ఎస్వీ రంగారావు, సావిత్రిలా వంద శాతం నటన కనబర్చగల నటుడు నా తరంలో మోహన్‌బాబు మాత్రమే. పరిపూర్ణమైన నటుడు అనిపించుకోవడంతో పాటు కష్టపడి తన పిల్లలను పైకి తీసుకొచ్చాడు. ఈ కుటుంబాన్ని చూస్తుంటే ఆనందంగా ఉంది’’ అని డా. దాసరి నారాయణరావు అన్నారు. మోహన్‌బాబుని నటుడిగా పరిచయం చేస్తూ, దాసరి దర్శకత్వం వహించిన ‘స్వర్గం-నరకం’ విడుదలై ఆదివారంతో 40ఏళ్లయ్యింది. నటుడిగా మోహన్‌బాబు నాలుగు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన వేడుకలో దాసరి, కళాబంధు టి. సుబ్బరామిరెడ్డి, హీరో వెంకటేశ్ పాల్గొన్నారు. మళ్లీ మోహన్‌బాబుతో చరిత్రలో నిలిచిపోయే సినిమా తీస్తా దాసరి మాట్లాడుతూ - ‘‘భారతీయ సినిమా చరిత్రలో అమితాబ్, దిలీప్‌కుమార్, ఎన్టీఆర్.. ఇలా ఎవరికీ లేని కెరీర్ గ్రాఫ్ మోహన్‌బాబుకే ఉంది. ఏ నటుడైనా విలన్‌గా చేయడం మొదలుపెట్టాక దాదాపు అలానే కొనసాగుతాడు. ఒకవేళ హీరోగా చేయడం మొదలుపెడితే అదే చేస్తాడు. కానీ, మోహన్‌బాబు విలన్, హీరోగా, సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా చేస్తూ వచ్చాడు. హీరోగా కొనసాగుతున్న సమయంలో ఓసారి గ్యాప్ వస్తే, ‘గురువుగారూ.. మళ్లీ విలన్‌గా చేస్తా’ అంటే, ‘నువ్వు నటుడివి. చెయ్’ అన్నాను. అలా కొన్నాళ్లు విలన్‌గా చేసి మళ్లీ హీరోగా రాణించాడు. భారతీయ సినీ చరిత్రలో ఈ కెరీర్ గ్రాఫ్ మోహన్‌బాబుకే దక్కుతుంది. ఒక దర్శకుడికి శక్తి ఉండాలే కానీ, మోహన్‌బాబు నుంచి ఎంత నటనను అయినా రాబట్టుకోవచ్చు. మోహన్‌బాబు పడ్డవి సామాన్యమైన బాధలు కావు. అన్ని బాధలూ పడి, పిల్లల్ని పైకి తీసుకొచ్చాడు. ఇప్పుడు మంచి సినిమాలు రావడంలేదు. వెక్కిరింతలూ, వెటకారాలు, ఉంటున్నాయి. మళ్లీ మోహన్‌బాబుతో చరిత్రలో నిలిచిపోయే సినిమా తీస్తా’’ అన్నారు. ‘‘భారతీయ సినిమా చరిత్రలో ఒక నటుడు 60 సినిమాలకు పైగా నిర్మించిన దాఖలాలు లేవు. ఆ ఘనత మోహన్‌బాబుకే దక్కుతుంది’’ అని టీఎస్సార్ అన్నారు. వెంకటేశ్ మాట్లాడుతూ - ‘‘నలభై ఏళ్లల్లో ఎన్నో అద్భుతమైన పాత్రలు చేశారు. ఆ పాత్రలు చేయగల నటులు లేరు. ‘ఎంతో సాధించినా మోహన్‌బాబు మనస్తత్వం మారలేదనీ, పిల్లల మనస్తత్వాల్లా చాలా ప్యూర్‌గా ఉంటుంది’ అని నాన్నగారు అనేవారు. అలా ఉండటం గ్రేట్’’ అని చెప్పారు. రెండు జతల బట్టలతో ప్రయాణం మోహన్‌బాబు మాట్లాడుతూ - ‘‘చెన్నయ్‌లో సినిమా అవకాశాల కోసం తిరుగు తున్నప్పుడు రెండు జతల బట్టలతో ఒక షెడ్లో ఉండేవాణ్ణి. నెలకు అద్దె 25 రూపా యలు. ఓసారి మూడు నెలలు చెల్లించలేదు. నేను బయటికి వెళ్లి గదికి తిరిగి వచ్చే లోపు వంట చేసుకునే గిన్నెలో ఓనర్ చేయకూడని పని చేశాడు. వండుకుందామని గిన్నె తీసిన నేను వాసన భరించలేకపోయాను. గిన్నె కడిగి, ఆ రోజు పస్తు ఉన్నాను. ఆ రోజులు గుర్తొస్తున్నాయి. నా గురువుగారు (దాసరి) నాకు సినీజీవితాన్ని ప్రసాదించారు. ఇంకా ఎంతోమంది దర్శక, నిర్మాతలు నన్ను ప్రోత్సహించారు. కష్టాలకోర్చి నిలబడ్డాను కాబట్టే, డైలాగ్స్ చెప్పడంలో ఎన్టీఆర్ తర్వాత మోహన్‌బాబు అనిపించుకోగలిగాను. నా తల్లిదండ్రుల ఆశీస్సులే నన్ను ఇంతటివాణ్ణి చేశాయి. మా నాన్నగారు టీచర్ కాబట్టి, విద్యాలయాలు ఆరంభించాను. 25 శాతం మందికి ఉచిత విద్య అందిస్తున్నాను. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు నా పట్ల కనబరుస్తున్న ప్రేమాభిమానాలు మర్చిపోలేనివి’’ అన్నారు. ఏడాది పాటు 40 వసంతాల వేడుకలు మోహన్‌బాబు వంటి తండ్రికి బిడ్డలు కావడం తమ అదృష్టం అని మంచు విష్ఱు, మంచు మనోజ్, లక్ష్మీప్రసన్న తెలిపారు. ఏడాదిపాటు 40 వసంతాల వేడుకలు జరపనున్నామని చెప్పారు. బెస్ట్ టీచర్ అవార్డ్‌కి సంబంధించిన వేడుక, ‘పెదరాయుడు’, ‘రాయలసీమ రామన్న చౌదరి’ స్క్రిప్ట్, తెరవెనక విశేషాలతో పుస్తకావిష్కరణ, పాపులర్ డెలాగ్స్‌తో పుస్తకం, విష్ణు ఆర్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మోహన్‌బాబు సినిమా, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫొటోల ప్రదర్శన, ఎవర్గ్రీన్ సాంగ్స్‌తో సీడీ, డీవీడీ, ‘పెదరాయుడు’ చిత్రాన్ని డిజిటలైట్ చేసి మళ్లీ విడుదల చేయడం... ఇలా భారీ ఎత్తున ప్లాన్ చేశారు. మోహన్‌బాబుతో సినిమాలు తీసిన దర్శక-నిర్మాతలు, నటించిన నటీనటులతో విష్ణు, మనోజ్, లక్ష్మీప్రసన్న ఓ టాక్ షో చేయనున్నారు. -
తాత - మనవరాళ్లు
మాసాయిపేట ట్రైన్యాక్సిడెంట్ విషాదం ఇంకా ఎవరి మనసుల్ని మరిపించలేదు. ఆ సంఘటనలో ఎనిమిదేళ్ల చిన్నారి ఐదేళ్ల పిల్లలిద్దరినీ కాపాడి తనూ బయటపడింది! ఆ సాహసం పేరే రుచిత.. ఊరు.. వెంకటాయపాలెం! సామాన్యుడి కోసం ఓ వేయింగ్ మెషీన్‌ను తయారు చేసి జాతీయస్థాయి సైన్స్‌ఫేర్‌లో దుబ్బాక జెండా రెపరెపలాడించింది.. అబ్దుల్‌కలాం చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఆ తెలుగు వెలుగు.. పదమూడేళ్ల అర్చన! పచ్చని పంటపొలాలు నేర్పిన జీవన పాఠాల్ని షార్ట్ సినిమాలుగా చూపింది! ఈ ప్రతిభకు ఇండోనేషియా పురస్కారం అందింది! ఆ బాల దర్శకురాలు జహీరాబాద్ వాసి మయూర! ఖోఖోలో నల్లగొండ వ్యూహాన్ని నేషనల్వైడ్గా చాటుతున్న క్రీడారత్నం వైజయంతి! ఈ నాలుగు వజ్రాలు చిల్డ్రన్స్ డే సందర్భంగా హైదరాబాద్‌లో జిగేల్మన్నాయి.. సిటీప్లస్కే కాదు సీనియర్ మోస్ట్ సినిమా పర్సనాలిటీ.. నేడు విడుదలైన ఎర్రబస్ డెరైక్టర్ డాక్టర్ దాసరి నారాయణరావుకీ ఆత్మీయ అతిథులయ్యారు. ఆయన ఇంటికి వెళ్లారు. తాతయ్యా అంటూ మురిపించారు.. ఆయన బిజీ షెడ్యూల్‌ని కాసేపు మరిపించారు! జూబ్లీహిల్స్.. మధ్యాహ్నం 12.30 ఎర్రబస్ సినిమా ప్రమోషన్ కోసం ప్రెస్‌మీట్ హడావిడిలో ఉన్నారు డాక్టర్ దాసరి నారాయణరావు. రుచిత, అర్చన, మయూర, వైజయంతి తనను కలవడానికి వచ్చారని తెలియగానే అంతటి బిజీని కాసేపు పక్కన పెట్టి పిల్లల్ని లోనికి ఆహ్వానించారు. వారి ప్రత్యేకతలను విని అబ్బురపడ్డారు. రుచిత చూపిన తెగువను తెలుసుకొని మనసారా ఆశీర్వదించారు. ఆ అమ్మాయి ‘మిమ్మల్ని తాతయ్యా అని పిలవచ్చా’ అంటే, ‘తాతయ్యా అనే పిలుమ్మా’ అంటూ ఒళ్లో కూర్చోబెట్టుకున్నారు. ఎనిమిదేళ్లప్పుడే ‘నా చేను.. నా చదువు’ అనే షార్ట్ సినిమా తీశానని మయూర చెప్పగానే ‘ఆ వయసులో నేనూ నా తొలి నాటకాన్ని రాశాను. పదమూడేళ్లప్పుడు నా తోటివాళ్లకు నాటకాల్లో యాక్ట్ చేయడానికి ట్రైన్ చేసేవాడిని’ అని తన బాల్యాన్ని నెమరువేసుకున్నారు దాసరి. ‘సైన్స్‌ఫేర్‌లో అబ్దుల్‌కలాం చేతుల మీదుగా అవార్డు తీసుకున్నాను’ అని చెప్పిన అర్చనను ‘గ్రేట్ మ్యాన్ చేతులమీదుగా అవార్డ్ అందుకున్న గ్రేట్ గర్ల్..’ అంటూ అభినందించారు. ఖోఖోలో జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటుతున్న వైజయంతిని ‘అంతర్జాతీయస్థాయిలో పేరు తెచ్చుకోవాలని ఆశీర్వదించారు. డైనమిక్‌గా ఉండాలి.. ఎర్రబస్ సినిమాలో మీ క్యారెక్టర్ ఏంటీ తాతయ్య అని అడిగిన పిల్లల ప్రశ్నలకు ‘పిల్లలంటే బాగా ఇష్టపడే తాతయ్య క్యారెక్టరే’ అని చెప్పారు. ‘మీరు తీసిన ఒసేయ్ రాములమ్మా.. సమ్మక్క సారక్క’ సినిమాలంటే మాకు చాలా ఇష్టమ’ని పిల్లలు ఆయన సినిమాలను గుర్తుచేశారు. పల్లెటూళ్లంటే ఇష్టమా సిటీ అంటే ఇష్టమా అని పిల్లలడిగిన ప్రశ్నకు జవాబిస్తూ ‘నా చిన్నప్పుడు పల్లెటూర్లో చాలా ఎంజాయ్ చేశాను. ఈతలు, కొబ్బరిబొండాలు, కోతికొమ్మచ్చిలు, తాటికాయలు.. ఇలా అన్నీ ఇష్టమే’అని చెప్పారు. హైదరాబాద్‌తో తనకున్న జ్ఞాపకాలను పిల్లలతో పంచుకున్నారు దాసరి. ‘ఈతరం ఆడపిల్లలు ఎలా ఉండాలనుకుంటున్నారు తాతయ్యా’ అని వైజయంతి అడిగితే ‘మీలాగే ధైర్యంగా.. డైనమిక్‌గా.. డాషింగ్‌గా ఉండాలి’ అంటూ వాళ్ల భుజం తట్టారు. ‘ఇంతకీ పెద్దాయ్యాక మీరెమవ్వాలనుకుంటున్నారు’ అని నలుగురినీ అడిగితే ‘జడ్జి అవుతాను’ అని రుచిత, ‘పోలీస్ ఆఫీసర్’ అని వైజయంతి, ‘అగ్రికల్చర్ జర్నలిస్ట్’ అని మయూర, ‘సైటింస్ట్’ అని అర్చన జవాబు చెప్పారు. ‘శభాష్.. తప్పక కావాలి. ఇప్పటి నుంచే బాగా కష్టపడి చదవాలమ్మా’ అంటూ ప్రోత్సహించారు. వాళ్ల ప్రతిభాపాటవాలకు ముచ్చటపడి ‘ఈ తాతయ్య చిన్న గిఫ్ట్ ఇస్తున్నాడు తీసుకోండర్రా’ అంటూ తలా పదివేలు క్యాష్‌ప్రైజ్ ఇచ్చారు డాక్టర్ దాసరి నారాయణరావు. ‘ఈ బాలల దినోత్సం నాకిచ్చిన కానుక వీళ్లే. చిల్డ్రన్స్‌డే సందర్భంగా ఈ బాల మేధావులను కలసుకోవడం సంతోషంగా ఉంది’ అన్నారు దాసరి. ప్రెజెంటర్: సరస్వతి రమ ఎవరెవరు ఏం కావాలనుకుంటున్నారంటే? మాసాయిపేట మానసపుత్రి రుచిత జడ్జి ఎందుకు కావాలనుకుంటుందంటే.. ‘పేదవాళ్లకు న్యాయం చేయడానికి. అన్యాయం చేసినవాళ్లను కఠినంగా శిక్షించడానికి’ నల్లగొండ ఖేల్త్న్ర వైజయంతి పోలీస్ ఆఫీసర్ ఎందుకు కావాలనుకుంటుందంటే.. ‘ఆడవాళ్ల తరఫున నిలబడడానికి. వాళ్ల మీద జరుగుతున్న దాడులకు చెక్ పెట్టేందుకు’ మయూర అగ్రికల్చర్ జర్నలిస్ట్ ఎందుకవ్వాలనుకుంటుందంటే.. ‘దేశానికి వెన్నుముక రైతన్న. ఆయన ఏలే వ్యవసాయరంగాన్ని కలంతో ప్రపంచానికి పరిచయం చేయాలని’ అర్చన సైంటిస్ట్ ఎందుక్కావాలనుకుంటుందంటే.. ‘ఇంకెన్నో కొత్త విషయాలను కనిపెట్టాలి... ప్రపంచ శాస్త్రీ పరిశోధనలకు మనం కొత్తమార్గం చూపించేందుకు’ ఇంత చిన్న వయసులో అంత గొప్ప ఆలోచనలున్న ఈ పిల్లలు నిజంగా మణిమాణిక్యాలే. వాళ్ల ఊళ్లకు వెళ్లడానికి వెహికిల్ ఎక్కిన బాలల్ని ఈ హైదరాబాద్ ట్రిప్ ఎలా అనిపించింది అని అడిగితే ‘సూపర్! దాసరి నారాయణరావు తాతయ్యను కలవడం.. ఆయనతో మాట్లాడటం ఇంకా హ్యాపీ. కేథరీన్ మా ఫేవరేట్ హీరోయిన్. అనుకోకుండా ఆమెను కలవడమూ మరీ ఆనందంగా ఉంది’ అని చెప్పారు.