భువనేశ్వర్: అర్చనా నాగ్.. ఒడిషాలో కలకలం రేపిన పేరు. వీవీఐపీలకు వలపు వల విసిరి ముగ్గులోకి దించి.. ఆపై బ్లాక్‌మెయిలింగ్‌తో కోట్లు దన్నుకున్న వగలాడి. ఓ నిర్మాత ఫిర్యాదుతో కదిలిన ఈ తేనెతుట్టు(హనీట్రాప్) ఒడిషాలో రాజకీయ ప్రముఖులకు మాత్రమే కాదు.. బెంగాల్‌కు చెందిన సెలబ్రిటీలకు సైతం వణుకు పుట్టిస్తోంది.
కలహంది జిల్లా ఒకప్పుడు ఆకలి కేకలతో అల్లలాడిపోయిన ప్రాంతం. ఆ ప్రాంతంలో ఓ పేద కుటుంబంలో పుట్టిన అర్చనా నాగ్.. కట్ చేస్తే కోట్లు విలువ చేసే బ్యాంక్ బ్యాలెన్స్‌తో, ఇంటి నిండా విదేశాల నుంచి వచ్చిన ఫర్నీచర్‌తో, లగ్జరీ కార్లతో, హైబ్రీడ్ కుక్కలు, ఓ తెల్ల గుర్రం పెంచుకుంటూ విలాసవంతమైన జీవితం గడపాలనుకుంది. అందుకు తగ్గట్లే 26 ఏళ్ల అర్చన పెద్ద పెద్ద స్కెచ్‌లే వేసింది. ప్రముఖులను హనీట్రాప్ ద్వారా బ్లాక్‌మెయిల్ చేసి కోట్లు దండుకుంది.
► లంజిగర్‌లో ఓ పేద కుటుంబంలో పుట్టిన అర్చనా.. తల్లి వృత్తిరిత్యా కేసింగలో పెరిగింది. ఆపై 2015లో భువనేశ్వర్‌లో అడుగుపెట్టింది. తొలుత ఓ ప్రైవేట్ సెక్యూరిటీ కంపెనీలో పని చేసి.. ఆపై ఓ బ్యూటీపార్లర్‌లో పనికి కుదిరింది. అక్కడే బాలాసోర్ జిల్లాకు చెందిన జగబంధు చంద్‌తో పరిచయం ఏర్పడింది. ఈ ఇద్దరూ 2018లో వివాహం చేసుకున్నారు. అక్కడి నుంచి ఈ భార్యాభర్తల మోసాలు మొదలయ్యాయి. బ్యూటీపార్లర్‌లో పని చేసే టైంలోనే సెక్స్‌రాకెట్ నడిపినట్లు ఆమెపై ఆరోపణలు కూడా వచ్చాయి.
► జగబంధు ఓ కార్ల షోరూం తెరిచి.. బిల్డర్లు, వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు, ఇతరులతో పరిచయం పెంచుకున్నాడు. వాళ్లతో ఆ భార్యాభర్తలు ఫొటోలు కూడా దిగారు. ఒక అర్చన వీవీఐపీలతో పరిచయం పెంచుకుని.. వాళ్లకు అమ్మాయిలను సప్లై చేయడం ప్రారంభించింది. ఆ సమయంలోనే వాళ్ల ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు తీసి.. డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించిందని పోలీసులు వెల్లడించారు.
► అర్చనా బ్యాంక్ స్టేట్‌మెంట్‌లను పరిశీలించిన పోలీసులు నోళ్లు వెళ్లబెట్టారు. 2018 నుంచి 2022 మధ్య.. కేవలం నాలుగేళ్లలో అర్చనా-జగబంధుల ఆసక్తి రూ.30 కోట్లకు చేరుకుందని చెప్తున్నారు. ఆమె ఏయే విలాసాలు కోరుకుందో.. అవన్నీ నెరవేర్చుకుందామె. అంటే.. ఆ భార్యభర్తల బ్లాక్‌మెయిలింగ్ ఏ రేంజ్‌లో ఉండేదో అర్థం చేసుకోవచ్చు. చివరకు ఓ నిర్మాతను మూడు కోట్ల రూపాయలు డిమాండ్ చేయడంతో.. ఆయన నాయపల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. అక్టోబర్ 6న అర్చనా అరెస్ట్ కాగా.. అప్పటి నుంచి రోజుకో రోజుకో సంచలనం బయటపడుతూనే వస్తోంది. జగబంధు డ్రగ్స్ కార్యకలాపాలు సైతం వెలగపెట్టేవాడని తేలింది. ఇక ఈ వ్యవహారంలో ఆర్థిక దర్యాప్తు విభాగాలను సైతం దర్యాప్తు చేపట్టాలని ఒడిషా పోలీసులు కోరుతున్నారు.
► ఇక ఇప్పటివరకు ఇద్దరు మాత్రమే అర్చనపై ఫిర్యాదుకు ముందుకు వచ్చారని, మరికొందరు బాధితులు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావాలని భువనేశ్వర్ డీసీపీ ప్రతీక్ సింగ్ కోరుతున్నారు. మరోవైపు ఒడియా ఫిల్మ్ మేకర్ శ్రీధర్ మార్థా.. అర్చనా చేసిన డర్టీ పనుల ఆధారంగా ఓ సినిమా తీయబోతున్నట్లు ప్రకటించారు కూడా. సెక్స్, డబ్బు, మోసంతో పాటు అర్చనా నాగ్ వ్యవహారంలో ఇప్పుడు రాజకీయమూ కీలకంగా మారింది.
ప్రతిపక్ష కాంగ్రెస్ ఈ వ్యవహారంలో అధికార బీజేడీ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఉన్నారని ఆరోపిస్తోంది. ఒకవేళ అదే గనుక బయటపడితే 22 ఏళ్ల నవీన్ పట్నాయక్ ప్రభుత్వం పతనం కాకతప్పదని అంటోంది. మరోవైపు బీజేపీ కూడా బీజేడీకి చెందిన 18 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు అర్చనా వలలో ఉన్నట్లు ఆరోపిస్తోంది. బీజేడీ మాత్రం ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయొద్దంటూ బీజేపీ, కాంగ్రెస్‌లకు సూచిస్తోంది. సుమారు 25 మంది రాజకీయ ప్రముఖులు ఆమె ఉచ్చులో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: ప్రేమను కాదందనే రైలు కిందకు తోసేశాడు
Comments
Please login to add a commentAdd a comment