మేఘసందేశం అంత గొప్ప సినిమా కావాలి : దాసరి
మేఘసందేశం అంత గొప్ప సినిమా కావాలి : దాసరి
Published Sun, Jan 26 2014 11:40 PM | Last Updated on Sat, Sep 2 2017 3:02 AM
‘‘ఈ సినిమా ట్రైలర్స్, పాటలు చూడగానే నాకు పోలవరం గుర్తొచ్చింది. ‘మేఘసందేశం’ అక్కడే తీశాం. ఈ సినిమా కూడా ‘మేఘసందేశం’ అంత గొప్ప సినిమా కావాలి’’ అని దాసరి నారాయణరావు అన్నారు. శివాజీ, అర్చన జంటగా నరసింహ నంది దర్శకత్వంలో ఇసనాక సునీల్‌రెడ్డి, బాగో సిద్దార్థ్ నిర్మించిన చిత్రం ‘కమలతో నా ప్రయాణం’. కిషన్ కవాడియా స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. దాసరి ఆడియో సీడీని ఆవిష్కరించి మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డికి అందించారు. ‘‘ప్రతి చిన్న సినిమాల ఫంక్షన్లకీ వెళ్తుంటారెందుకు? అని నన్ను పరిశ్రమలో చాలామంది అడుగుతుంటారు. ‘మీరు వెళ్లరు. కాబట్టే నేను వెళుతున్నా’ అని చెబుతాను.
స్టార్ అనేవాడి కెరీర్ మొదలయ్యేది చిన్న సినిమాల నుంచే. అందుకే చిన్న సినిమా బాగుండాలని కోరుకుంటా. ఇక ఈ సినిమా విషయానికొస్తే... బూతు సినిమాలు రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో సంస్కారవంతమైన చిత్రాన్ని నిర్మించిన నిర్మాతను అభినందిస్తున్నా’’ అని దాసరి చెప్పారు. తన కెరీర్‌లోనే ఇది చెప్పుకోదగ్గ సినిమా అవుతుందని, అర్చన నటన ‘మేఘసందేశం’లో జయప్రదను గుర్తు చేస్తుందని దర్శకుడు అన్నారు. ‘‘కమలతో నా ప్రయాణం చక్కని సినిమా. టీం అంతా కష్టపడి చేసిన సినిమా. ఎంత గొప్ప సినిమా అయినా ప్రజల్లోకి వెళ్లకపోతే ఆడదు. ఈ సినిమాకు ప్రమోషన్ చాలా అవసరం’’ అని శివాజి చెప్పారు. త్వరలోనే సినిమాను విడుదల చేస్తామని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: మురళీమోహన్‌రెడ్డి, కూర్పు: వి.నాగిరెడ్డి.
Advertisement