తల్లిప్రేమ ముందు పులి ఎంత! | Madhya Pradesh Mother Fights Off Tiger | Sakshi
Sakshi News home page

తల్లిప్రేమ ముందు పులి ఎంత!

Published Sat, Sep 10 2022 1:17 AM | Last Updated on Sat, Sep 10 2022 1:17 AM

Madhya Pradesh Mother Fights Off Tiger - Sakshi

పులి అనగానే అమ్మో అనుకుంటాం. కాని అమ్మ ముందు పులి బలమెంత! ఒక తల్లి తన బిడ్డను రక్షించుకోవడానికి పులితో పోరాడిన సాహసం సోషల్‌మీడియాలో వైరల్‌ అయింది...

మధ్యప్రదేశ్‌లోని ఉమేరియా జిల్లాలోని బందవ్‌ఘర్‌ టైగర్‌ రిజర్వ్‌కు సమీపంలో రోహనియా అనే గ్రామం ఉంది. ఈ గ్రామానికి చెందిన అర్చన చౌదరికి పదిహేను నెలల కొడుకు రవిరాజ్‌. కొడుకు నవ్వితే నవ్వేంత, ఏడిస్తే ఏడ్చేంత ప్రేమ తనకు!

కొన్ని నెలల క్రితం చీమ కుట్టి కొడుకు ఏడుస్తుంటే తాను కూడా ఏడ్చేసింది.
ఈసారి మాత్రం చీమ కుట్టలేదు.

పులి ఎదురైంది! బిడ్డను నోట కరుచుకుపోవడానికి రెడీ అయిపోయింది.
అయితే ఇప్పుడు మాత్రం అర్చన ఏడ్వలేదు. వణికిపోలేదు. ఏం జరిగిందంటే...

ఆరోజు రాత్రి బిడ్డ రవిరాజ్‌ను తీసుకొని ఇంటి నుంచి బయటికి వచ్చింది అర్చన. అక్కడి పొదల్లో ఒక పులి కాచుకొని కూర్చుంది. వీరిని చూడగానే బయటికి వచ్చింది. పిల్లాడిని దూరంగా ఎత్తుకుపోవడానికి ప్రయత్నించింది. అంతే... అర్చన తన శక్తినంతా కూడదీసుకొని పెద్దగా అరుస్తూ ఎదురుదాడి ప్రారంభించింది.
అర్చన కేకలు విన్న గ్రామస్థులందరూ మెరుపు వేగంతో పరుగెత్తుకు వచ్చారు. వారిని చూసి పులి తోకముడిచి సమీపంలోని అడవిలోకి పారిపోయింది!

తల, వీపు వెనుక గాయాలైన బిడ్డను, ఒళ్లంతా గాయాలైన తల్లిని గ్రామస్థులు వెంటనే హాస్పిటల్‌లో చేర్చడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు.
‘ఒక పులి టైగర్‌ రిజర్వ్‌ దాటి జనావాసాలలోకి వచ్చింది అని ప్రచారం చేస్తున్నాం. ఈ విషయం చాలామందికి తెలుసు’ అని అటవీశాఖ అధికారులు చెబుతున్నారుగానీ అదెంత వరకు నిజమో తెలియదు.

‘మాకు అలాంటి వార్త గురించి ఏమీ తెలియదు’ అని చెబుతున్నాడు అర్చన భర్త బోలా చౌదరి. అరుదుగా మాత్రమే ఊరు దాటేది అర్చన. అలాంటి అర్చన పేరు ఇప్పుడు ఊళ్లు, జిల్లాలు, రాష్ట్రాలు దాటింది.
‘తల్లి శక్తి ఏమిటో నిరూపించావు’ అని వేనోళ్ల కొనియాడుతున్నారు నెటిజనులు.

‘మా ఊళ్లోనే కాదు, ఇంకా చాలా ఊళ్లలో అర్చన పేరు గొప్పగా చెప్పుకుంటున్నారు. ఆమె సాహసం అద్భుతం. పులిని చూడగానే వణికిపోయి, భయపడి ఉంటే ఏం జరిగి ఉండేదో ఊహించడానికి కూడా భయంగా ఉంది. ఎంతోమంది తల్లులకు స్ఫూర్తిని ఇచ్చే సాహసం ఆమెది’ అంటుంది రోహనియ గ్రామానికి చెందిన కులుమతి.
ఆరోజు అర్చన అరుపులు విని పరుగెత్తుకు వచ్చిన వారిలో కుష్వా అనే రైతు ఉన్నాడు.

‘అరుపులు వినగానే ప్రమాదాన్ని ఊహించి కట్టె తీసుకొని పరుగెత్తుకు వచ్చాను. అక్కడికి వెళ్లగానే విషయం అర్థమైంది. అందరం గట్టిగా అరుస్తూ ముందుకు వెళుతుంటే పులి భయపడి పారిపోయింది. తల్లీబిడ్డలను ఆ దేవుడే రక్షించాడు’ అంటున్నాడు కుష్వా.
చాలామందికి మాత్రం అర్చన తన బిడ్డను రక్షించుకున్న దేవత. ఊరి జనాల నుంచి నెటిజనుల వరకు అర్చనా చౌదరి సాహసానికి అందరూ జై కొడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement