ముంబై సెంట్రల్: మహారాష్ట్రలో గత 6 నెలల్లో 22 పులులు మృతి చెందాయి. ఈ సంఘటన కొంత ఆందోళన రేకేత్తించేలా చేసింది. కంజర్వేషన్ లెన్సెస్ అండ్ వైల్డ్ లైఫ్ (ఎల్‌ఎడబ్ల్యూ) అనే సంస్థ అటవీ శాఖకు చెందిన పలు సర్వేలు పరిశోధనల్లో పాలు పంచుకుంటోంది. ఏడాదిన్నర నుంచి దేశంలో కరోనా ప్రకోపం పెరిగి పోవడంతో మొదటి వేవ్ కంటే రెండవ వేవ్‌లో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు.
అయితే ప్రత్యక్షంగా పులుల మరణాలకు, కరోనా వ్యాప్తికి సంబంధం లేకపోయినప్పటికీ, అటవీ ప్రాంతాలలో, సరిహద్దు గ్రామీణ ప్రాంతాలలో పులుల సంరక్షణలో విధులు నిర్వహించే సిబ్బంది కూడా కరోనా బారిన పడటంతో పులుల రక్షణపై ఆ ప్రభావం పడిందని సీఎల్‌ఎడబ్ల్యూ ప్రతినిధి ఒకరు తెలిపారు. పులుల సంరక్షణ విషయంలో జనజాగృతి కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నామని, సంవత్సర కాలం ప్రయత్నించడంతో ఈ గణాంకాలు తెలిశాయన్నారు. పులుల మరణాల వెనక ఉన్న కారణాలను పరిశోధించేందుకు ప్రయత్నిస్తున్నామని ఇందుకోసం సమయం, సంయమనం రెండూ అవసరమని కంజర్వేషన్ లెన్సెస్ అండ్ వైల్డ్ లైఫ్ వ్యవస్థాపక సభ్యుడు సారోశ్ లోధి పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా 86 పులుల మృతి..
దేశ వ్యాప్తంగా గత ఆరు నెలల్లో 86 పులులు మత్యువాత పడ్డాయి. గత రెండు సంవత్సరాల నుంచి పులుల మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. పులుల మరణాల్లో మహారాష్ట్ర రెండవ స్థానంలో ఉంది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పులుల మరణాల్లో 153 శాతం పెరుగుదల కనిపించింది. గతంలో రెండు సార్లు చేపట్టిన పులుల గణనలో పులుల సంఖ్య పెరుగుతున్నట్లుగా తేలినప్పటికీ, మరోవైపు పులుల మరణాలు ఎక్కువగా సంభవించడం అటవీ శాఖ అధికారుల్లో ఆందోళన మొదలైంది. పులుల మరణాల్లో మొదటి స్థానంలో మధ్యప్రదేశ్(26) ఉండగా 2వ స్థానంలో మహారాష్ట్ర ఉంది. కర్ణాటక(11) మూడో స్థానంలో నిలిచింది.
30 జూన్ 2021 వరకు దేశలో 86 పులులు మత్యువాత పడ్డట్లుగా అటవీ శాఖ ప్రకటించింది. జూలైలో కూడా మూడు పులులు మరణించాయి. 2020లో 98 పులులు మృత్యువాత పడ్డాయి. ఇందులో 56 పులులు మొదటి 6 నెలలు అంటే జూన్ 2020లోపే మరణించాయి. 2019 సంవత్సరంలో కేవలం 84 పులులు మాత్రమే చనిపోయాయి. 3 సంవత్సరాలుగా పులుల మృత్యురేటు పెరుగుతున్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. ఈ సంవత్సరం మొదటి 3 నెలల్లో దేశవ్యాప్తంగా 39 పులులు, ఆరు నెలల్లో 86 పులులు మరణించాయి.
Comments
Please login to add a commentAdd a comment