
‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపిన అర్చన
హైదరాబాద్ : ‘సాక్షి’ టీవీలో ప్రసారం అయిన ’కంటే కూతుర్నే కనాలి’ కథనానికి తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. తనను కన్నవాళ్లకే అమ్మగా మారి.. తల్లిదండ్రులను పిల్లలుగా భావించి సేవలందిస్తున్న అర్చన అనే యువతికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. నిర్మల్ జిల్లా మామడ మండలం దిమ్మదుర్తికి చెందిన అర్చన తల్లిదండ్రులు పద్మ, దుర్గారెడ్డిల దీనగాథపై ‘సాక్షి’లో ప్రసారం అయిన కథనానికి స్పందించిన మంత్రి కేటీఆర్... అర్చనకు అండగా నిలిచారు.
ఆమెకు డీఆర్‌డీఓ ఉద్యోగంతో పాటు డబుల్ బెడ్‌రూం ఇల్లు మంజూరు చేయడం, అలాగే ఆమె తల్లిదండ్రులకు నిమ్స్‌లో మెరుగైన చికిత్స చేయించనున్నట్లు కేటీఆర్ హామీ ఇచ్చారు. కాగా తన కుటుంబ దీనగాథను ప్రసారం చేసి, ఆదుకున్న ’సాక్షి’కి అర్చన కృతజ్ఞతలు తెలిపింది.
కాగా సాక్షి దినపత్రిక ఫ్యామిలీ పేజీలో ఈ నెల 18న మంగళవారం ‘కూతురమ్మ’ శీర్షికన ప్రచురించిన కథానానికి విశేష స్పందన వస్తోంది. ఆ కథనాన్ని చదివి మానవత్వానికి ఎల్లలు లేవు.. మనసుంటే మార్గముంటుంది.. అన్న మంచి మనసుతో అర్చనకు అండగా నిలిచేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. చదవండి.... (కూతురమ్మ!)