లాక్‌డౌన్‌ వేళ.. ఆన్‌లైన్‌ అర్చన | Department Of Divinity Focused On Online Archana In Telangana | Sakshi
Sakshi News home page

లాక్‌డౌన్‌ వేళ.. ఆన్‌లైన్‌ అర్చన

Published Wed, Apr 8 2020 1:36 AM | Last Updated on Wed, Apr 8 2020 1:36 AM

Department Of Divinity Focused On Online Archana In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దైవికమైన శుభసందర్భాలు, పుట్టినరోజు, పెళ్లిరోజు వేడుకలు.. ఇలాంటి సందర్భాల్లో దేవాలయాలకు వెళ్లాలని భక్తులు భావిస్తారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నందున ఇది కుదరటం లేదు. దీంతో చాలామంది మానసిక ఆవేదనకు గురవుతున్నారు. దీన్ని గుర్తించిన దేవాదాయశాఖ.. భక్తులకు ఆలయ ప్రవేశం లేకున్నా, వారిపేరుతో పూజలు నిర్వహించాలని నిర్ణయించింది. ఆన్‌లైన్‌ ద్వారా పేర్లు నమోదు చేసుకుంటే, నిర్ధారిత జాబితాలోని కోరుకున్న దేవాలయంలో పూజలు నిర్వహించే ఏర్పాటు చేస్తోంది. తెలంగాణ ఐటీ శాఖ రూపొందించిన యాప్‌ ద్వారా ఈ వెసులుబాటు కల్పిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ప్లేస్టోర్‌లో యాప్‌ను రూపొందించింది. తొలుత ప్రయోగాత్మకంగా సికింద్రాబాద్‌లోని ఉజ్జయినీ మహంకాళి దేవాలయం, కర్మన్‌ఘాట్‌లోని ధ్యానాంజనేయస్వామి దేవాలయంలో బుధవారం నుంచీ ప్రారంభిస్తున్నారు. ఆపై రాష్ట్రంలోని ఇతర ముఖ్య ఆలయాల్లో ప్రారంభిస్తారు. ప్లేస్టోర్‌ ద్వారా ఈ వెసులుబాటు కల్పించేందుకు గూగుల్‌ మంగళవారం సమ్మతి తెలిపింది.

భద్రాద్రి రామయ్య తలంబ్రాలు సిద్ధం
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణాన్ని భక్తకోటి నేరుగా తిలకించలేకపోయింది. టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాన్ని చూసి ఆనందపడింది. కానీ స్వామి తలంబ్రాల అక్షింతల కోసం వారు తపన పడుతున్నారు. ఇప్పుడు టీఎస్‌ యాప్‌ ఫోలియో ద్వారా కోరుకున్న వారికి వాటిని అందించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఐదు వేల తలంబ్రాల పొట్లాలను దేవాదాయశాఖ సిద్ధం చేసింది. యాప్‌ ద్వారా బుక్‌ చేసుకున్నవారికి తపాలా ద్వారా ఇంటికి అందిస్తారు. ఇందుకోసం తపాలాశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని అందులో భద్రాచలం   దేవాలయం తలంబ్రాల వివరాలు ఉన్న విండో ఓపెన్‌ చేసి వివరాలు నమోదు చేసుకోవటం ద్వారా బుక్‌ చేసుకోవచ్చు. తలంబ్రాలకు గాను రూ.20, పోస్టల్‌ చార్జీ రూ.30, ఐటీ సర్వీస్‌ చార్జీ చెల్లించి వివరాలు నమోదు చేసుకోవాలి. ప్రత్యేకంగా ఈ తలంబ్రాలను భక్తుల ఇంటికి చేర్చేందుకు తపాలాశాఖ సిబ్బంది,   వాహనాలను సిద్ధం చేసింది.

ఎలా బుక్‌ చేసుకోవాలి?
గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి టీఎస్‌ యాప్‌ ఫోలియోను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అందులో దేవాలయాల వివరాలు ఉంటాయి. వాటిల్లో కావాల్సిన ఆలయంలో ఆర్జిత సేవను ఓపెన్‌ చేసి వివరాలు నమోదు చేయాలి. దాని ఆధారంగా ఆయా దేవాలయాల్లో భక్తుల పేర్లతో, వారు కోరుకున్న రోజున ఆర్జిత సేవలు నిర్వహిస్తారు. ఆ వివరాలను తిరిగి వారి మొబైల్‌ ఫోన్‌కు సమాచారం రూపంలో అందిస్తారు. కుదిరితే పూజ అక్షింతలు, పసుపు కుంకుమ, డ్రైఫ్రూట్స్, మిశ్రీతో కూడిన ప్రసాదాన్ని కూడా అందించాలని తొలుత భావించారు. కానీ ప్రస్తుతం తపాలా, కొరియర్‌ సేవలు పరిమితంగానే ఉన్నందున ఇది సాధ్యం కాదని అనుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement