endoment department
-
గిరిజన మహిళను కాబట్టే నన్ను టార్గెట్ చేశారు: అసిస్టెంట్ కమిషనర్ శాంతి
సాక్షి, విశాఖ: తనపై వస్తున్న ఆరోపణలపై దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి స్పందించారు. తాను గిరిజన మహిళను కాబట్టే తనను టార్గెట్ చేశారని కన్నీరు పెట్టుకున్నారు. కక్ష గట్టి తనను సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.కాగా, అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘2013లో మదన్‌మోహన్‌తో నాకు వివాహం జరిగింది. లా చదువుతుండగానే మా ఇద్దరి పెళ్లి జరిగింది. 2015లో మాకు కవల పిల్లలు పుట్టారు. మదన్ మోహన్ నన్ను చాలా హింసించాడు. 2016లో ఇద్దరం విడాకులు తీసుకుని విడిపోయాం. 2019లో మదన్మోహన్ యూఎస్ వెళ్లిపోయాడు. నేను న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ ప్రభుత్వ ఉద్యోగంలో చేరాను.గిరిజన మహిళను కాబట్టే నన్ను టార్గెట్ చేశారు. నేను రూ.100కోట్లు సంపాదించానని ఆంధ్రజ్యోతిలో రాశారు. రూ.75కోట్లు ఇవ్వాలని మదన్మోహన్ అడుగుతున్నాడు. నేను గిరిజన మహిళని కక్ష గట్టి నన్ను సస్పెండ్ చేశారు. తప్పుడు వార్తలు రాసేటప్పుడు పెద్దాయన వయసు గుర్తు రాలేదా?. సమాజంలో మర్యాద ఉన్న వ్యక్తిపై ఆరోపణలు ఎలా చేస్తారు. నా వివరణ కూడా తీసుకోకుండా ఇష్టానుసారం రాసేశారు. ఇది ఖచ్చితంగా వ్యక్తిత్వ హననమే’ అంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. -
కొత్తగా వెబ్ పోర్టల్ ను అందుబాటులోకి తీసుకొచ్చిన ఏపీ దేవాదాయశాఖ
-
లాక్డౌన్ వేళ.. ఆన్లైన్ అర్చన
సాక్షి, హైదరాబాద్: దైవికమైన శుభసందర్భాలు, పుట్టినరోజు, పెళ్లిరోజు వేడుకలు.. ఇలాంటి సందర్భాల్లో దేవాలయాలకు వెళ్లాలని భక్తులు భావిస్తారు. ప్రస్తుతం లాక్డౌన్ అమల్లో ఉన్నందున ఇది కుదరటం లేదు. దీంతో చాలామంది మానసిక ఆవేదనకు గురవుతున్నారు. దీన్ని గుర్తించిన దేవాదాయశాఖ.. భక్తులకు ఆలయ ప్రవేశం లేకున్నా, వారిపేరుతో పూజలు నిర్వహించాలని నిర్ణయించింది. ఆన్లైన్ ద్వారా పేర్లు నమోదు చేసుకుంటే, నిర్ధారిత జాబితాలోని కోరుకున్న దేవాలయంలో పూజలు నిర్వహించే ఏర్పాటు చేస్తోంది. తెలంగాణ ఐటీ శాఖ రూపొందించిన యాప్ ద్వారా ఈ వెసులుబాటు కల్పిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ప్లేస్టోర్‌లో యాప్‌ను రూపొందించింది. తొలుత ప్రయోగాత్మకంగా సికింద్రాబాద్‌లోని ఉజ్జయినీ మహంకాళి దేవాలయం, కర్మన్‌ఘాట్‌లోని ధ్యానాంజనేయస్వామి దేవాలయంలో బుధవారం నుంచీ ప్రారంభిస్తున్నారు. ఆపై రాష్ట్రంలోని ఇతర ముఖ్య ఆలయాల్లో ప్రారంభిస్తారు. ప్లేస్టోర్ ద్వారా ఈ వెసులుబాటు కల్పించేందుకు గూగుల్ మంగళవారం సమ్మతి తెలిపింది. భద్రాద్రి రామయ్య తలంబ్రాలు సిద్ధం భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణాన్ని భక్తకోటి నేరుగా తిలకించలేకపోయింది. టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాన్ని చూసి ఆనందపడింది. కానీ స్వామి తలంబ్రాల అక్షింతల కోసం వారు తపన పడుతున్నారు. ఇప్పుడు టీఎస్ యాప్ ఫోలియో ద్వారా కోరుకున్న వారికి వాటిని అందించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఐదు వేల తలంబ్రాల పొట్లాలను దేవాదాయశాఖ సిద్ధం చేసింది. యాప్ ద్వారా బుక్ చేసుకున్నవారికి తపాలా ద్వారా ఇంటికి అందిస్తారు. ఇందుకోసం తపాలాశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని అందులో భద్రాచలం దేవాలయం తలంబ్రాల వివరాలు ఉన్న విండో ఓపెన్ చేసి వివరాలు నమోదు చేసుకోవటం ద్వారా బుక్ చేసుకోవచ్చు. తలంబ్రాలకు గాను రూ.20, పోస్టల్ చార్జీ రూ.30, ఐటీ సర్వీస్ చార్జీ చెల్లించి వివరాలు నమోదు చేసుకోవాలి. ప్రత్యేకంగా ఈ తలంబ్రాలను భక్తుల ఇంటికి చేర్చేందుకు తపాలాశాఖ సిబ్బంది, వాహనాలను సిద్ధం చేసింది. ఎలా బుక్ చేసుకోవాలి? గూగుల్ ప్లేస్టోర్ నుంచి టీఎస్ యాప్ ఫోలియోను డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో దేవాలయాల వివరాలు ఉంటాయి. వాటిల్లో కావాల్సిన ఆలయంలో ఆర్జిత సేవను ఓపెన్ చేసి వివరాలు నమోదు చేయాలి. దాని ఆధారంగా ఆయా దేవాలయాల్లో భక్తుల పేర్లతో, వారు కోరుకున్న రోజున ఆర్జిత సేవలు నిర్వహిస్తారు. ఆ వివరాలను తిరిగి వారి మొబైల్ ఫోన్‌కు సమాచారం రూపంలో అందిస్తారు. కుదిరితే పూజ అక్షింతలు, పసుపు కుంకుమ, డ్రైఫ్రూట్స్, మిశ్రీతో కూడిన ప్రసాదాన్ని కూడా అందించాలని తొలుత భావించారు. కానీ ప్రస్తుతం తపాలా, కొరియర్ సేవలు పరిమితంగానే ఉన్నందున ఇది సాధ్యం కాదని అనుకుంటున్నారు. -
దేవదాయశాఖ ఈవో అనిత ఆత్మహత్య
సాక్షి, దాచేపల్లి (గురజాల): రెండు రోజుల కిందట సస్పెండైన దేవదాయశాఖ గురజాల మండల ఈవో డి.అనిత (32) కృష్ణానదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగలలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. నీటిలో తేలియాడుతున్న మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని బయటికి తీయించిన ఎస్ఐ ఇ.బాలనాగిరెడ్డి.. మృతురాలు అనితగా గుర్తించి, పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనిత భర్త రమేష్ గుంటూరులో ఉంటూ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అనిత గురజాలలో విధులు నిర్వర్తిస్తూ దాచేపల్లి మండలం శ్రీనగర్‌లో తల్లిదండ్రుల వద్ద ఉంటున్నారు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఆదివారం ఉదయం భర్త వద్ద నుంచి ఇంటికి బయలుదేరినట్టు తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. బస్సులో ఉన్నప్పుడు పలుమార్లు భర్తతో కూడా మాట్లాడారు. దాచేపల్లి బస్టాండ్‌లో దిగానని 9 గంటలకు ఫోన్ చేసి.. మధ్యాహ్నం 12 గంటలైనా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు బస్టాండ్, రైల్వేస్టేషన్ ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకపోయింది. అంతలోనే అనిత ఆత్మహత్యకు పాల్పడినట్టు వారికి సమాచారం అందింది. 2016లో కృష్ణా పుష్కరాల సందర్భంగా గురజాల మండలం దైద, సత్రశాల ఘాట్ల నిర్వహణ బాధ్యతలను అనిత చూశారు. ఈ క్రమంలో టీడీపీ నేతల అండదండలతో నిధుల దుర్వినియోగం జరిగిందని.. త్రిసభ్య కమిటీ విచారణలో అది వాస్తవమని తేలడంతో ఉన్నతాధికారులు ఆమెను సస్పెండ్ చేశారు. దీంతో మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్టు స్థానికులు చెప్పుకొంటున్నారు. భార్యాభర్తల మధ్య వివాదాలున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. -
శ్రీశైలంలో అన్యమత ఉద్యోగులు
సాక్షి, అమరావతి: చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే శ్రీశైలం దేవస్థానంలో అన్యమతస్తులకు ఉద్యోగాలు ఇచ్చారని ప్రభుత్వ పరిశీలనలో తేలింది. శ్రీశైలం ఆలయంలో పనిచేసే ఉద్యోగుల్లో ఎవరు ఎప్పుడు నియమితులయ్యారనే వివరాలతో ఆలయ ఈవో కేఎస్ రామారావు.. దేవదాయ శాఖ కమిషనర్ పద్మకు శనివారం నివేదికను అందజేశారు. ఆలయంలో పనిచేసే రెగ్యులర్ ఉద్యోగుల్లో ముగ్గురు, మరో 14 మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు అన్యమతస్తులేనని తెలుస్తోంది. ఈ 14 మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల్లో తొమ్మిది మంది చంద్రబాబు సీఎంగా ఉన్న 1998–2003 మధ్య నియమితులైనవారేనని శ్రీశైలం దేవస్థానం ఈవో నివేదికలో పేర్కొన్నారు. మరో ఐదుగురు 2010–11లో ఉద్యోగాలు పొందారని వివరించారు. ముగ్గురు రెగ్యులర్ ఉద్యోగుల్లో ఒకరు చంద్రబాబు సీఎంగా ఉన్న 2001లోనూ, మిగిలిన ఇద్దరు 1982, 1993లో నియమితులయ్యారని తెలిపారు. 1993లో చేరిన రెగ్యులర్ ఉద్యోగిని దేవదాయ శాఖ తొలగించినప్పటికీ.. అతడు కోర్టు నుంచి అనుమతి తెచ్చుకున్నాడని.. 2014లో చంద్రబాబు సర్కారే తిరిగి అతడిని ఆలయంలో ఉద్యోగిగా నియమించింది. -
ప్రమాదాల కొండ
నెల్లిమర్ల రూరల్: ఉత్తరాంధ్రలోనే రామతీర్థానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది.. ఏడాదికి దాదాపు రెండు కోట్ల రూపాయలకు పైగానే ఆదాయం వస్తోంది.. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రా భద్రాద్రిగా కూడా చరిత్రకు ఎక్కాల్సిన సమయంలో వివిధ కారణాలతో ఒంటిమిట్టకు ఆ అవకాశం వెళ్లిపోయింది. అయినప్పటికీ రామతీర్థంలో కూడా అధికార లాంచనాలతో శ్రీరామనవమి వేడుకలను అత్యంత వేడుకగా జరిపిస్తున్నారు... కార్తీకమాసం, తిరుక్కల్యాణం, రథయాత్ర, మహా శివరాత్రి పర్వదినాల్లో లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. క్షేత్రం పక్కనే ఉన్న బోడికొండ వల్లే రామతీర్థానికి ఇంతటి పేరు వచ్చిందంటే అతిశయోక్తి కాదు. అయితే అంతటి ప్రాశస్త్యం ఉన్న బోడికొండ నిర్లక్ష్యపు నీడలో ఉంది. ప్రమాదాలకు కేరాఫ్‌గా మారింది. బోడికొండపై హెచ్చరికబోర్డులు లేకపోవడంతో భక్తులు తికమకపడుతున్నారు. అలనాటి చిహ్నాలను చూసేందుకు.... క్షేత్రానికి ఉత్తర దిక్కున నీలాచలం పేరుతో రెండు కిలోమీటర్ల పొడవు గల ఏకశిలా పర్వతమే బోడికొండ. ఈ పర్వతంపై సీతారాములు, పాండవులు సంచరించిన చిహ్నములున్నాయి. అలాగే పర్వతాగ్రమున కోదండరాముని ఆలయం కూడా ఉంది. ఆలయం పక్కనే ఎప్పటికీ ఎండిపోని పాతాళగంగ (నీటి కొలను) ఉంది. ఈ నీటి మడు గు నుంచి పడమర దిశగా ఇరుకురాయి ఉంటుం ది. దాని మధ్యగుండా వెళితే.. అలనాడు భీముడు వంట చేసిన ప్రదేశం కనిపిస్తుంది. దీనికి సమీపంలో ఉన్న గుహలో బుద్ధ విగ్రహం, పలుకురాయి ఉంది. అలాగే పాండవులు ధరించిన పంచెలు, సీతమ్మవారి పురిటి మంచం, తదితర చిహ్నా లు నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఈ కొండ పక్కనే దుర్గాభైరవ కొండ, బౌద్ధుల నివాస గుహాలు కూడా ఉన్నాయి. ఈ చారిత్రక గుర్తులను చూసేందుకు భక్తులు, సందర్శకులు ప్రతినిత్యం అధిక సంఖ్యలో పర్వతంపైకి వెళ్తుంటారు. అయి తే కొండ ప్రమాదకరంగా ఉండడంతో ఎటు నుం చి ఎటు వెళ్లాలి...ఎక్కడ ప్రమాదకరం... ఎక్క డ జాగ్రత్తగా ఉండాలో తెలియజేసే బోర్డులు లేవు. పొంచి ఉన్న ప్రమాదం.. కోదండరామస్వామి ఆలయం పక్కనే ఉన్న నీటికొలను లోతు ఎంత ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. ఈ ప్రాంతం వద్ద దేవదాయ శాఖాధికారులు హెచ్చరిక బోర్డులు సైతం ఏర్పాటు చేయలేదు. గతంలో ఇక్కడ బోర్డులుండేవి. గాలులకు పడిపోయిన తర్వాత ఎవ్వరూ మళ్లీ ఏర్పాటు చేయలేదు. భీముని గుడికి వెళ్లే మెట్ల మార్గం వద్ద.. సీతమ్మ పురిటి మంచం వద్ద మెట్లు దిగే ప్రాంతంలో సందర్శకులు తీవ్ర ఇబ్బంది పడుతుంటారు. ఇక్కడే అదుపు తప్పి ఎంతోమంది పడిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ దేవస్థాన సిబ్బంది పట్టించుకోకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారుల దృష్టికి .. బోడికొండపై హెచ్చరికబోర్డులు, సూచిక చిహ్నాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. రెయిలింగ్ ఏర్పాటు చేస్తే మంచిందే కానీ ఈ విషయంపై ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. భక్తులు కూడా సహకరించాలి. బోడికొండపైకి చేరుకుంటున్న భక్తులు జాగ్రత్తలు తీసుకోవాలి. దారి తప్పితే సాహసాలు చేయకుండా వచ్చిన రహదారినే తిరిగి ఆశ్రయించాలి.. ఎన్వీఎస్ఎన్ మూర్తి, డిప్యూటీ కమీషనర్, దేవదాయశాఖ. -
ఆర్జిత సేవలు బంద్
సాక్షి, హైదరాబాద్: దేవాదాయ శాఖ అధీనంలో ఉన్న దేవాలయాల్లో శుక్రవారం నుంచి ఆర్జిత సేవలు నిలిచిపోనున్నాయి. దేవాదాయ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నామని, దేవాలయాల్లో అర్చనాభిషేకాలు నిలిపివేస్తామని తెలంగాణ అర్చక, ఉద్యోగ జేఏసీ కన్వీనర్ గంగు భానుమూర్తి వెల్లడించారు. గురువారం హైదరాబాద్ న్యూనల్లకుంటలోని రామాలయంలో అన్ని జిల్లాల నుంచి హాజరైన ప్రతినిధుల సమావేశం జరిగిందని, ఈ సమావేశంలో ఆర్జిత సేవలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు. దేవాలయాలు తెరిచే ఉంటాయని, నిత్యపూజలు, మహానైవేద్యం సమర్పిస్తామని, అయితే, భక్తులు ఫీజు చెల్లించి జరిపించుకునే అర్చనాభిషేకాలను మాత్రం నిలిపివేస్తామని చెప్పారు. తాము సీఎం కేసీఆర్‌కు, దేవాదాయ మంత్రి, కమిషనర్లకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం చేయడం లేదని, కేవలం దేవాదాయ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగానే ఆందోళన చేస్తున్నామని ఆయన చెప్పారు. అర్చక, ఉద్యోగుల వేతనాలను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఇవ్వాలని గత ఏడాది సెప్టెంబర్‌లో జీవోనెం.577 విడుదల చేశారని, మళ్లీ సెప్టెంబర్ వస్తున్నా అధికారులు ఈ జీవోను అమలు చేయడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జీవోను వెంటనే విడుదల చేయాలని, గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలని, కేడర్ ఫిక్సేషన్లో జరిగిన అవకతవకలు సరిచేయాలనే ప్రధాన డిమాండ్లతో ఆందోళనకు దిగుతున్నామని చెప్పారు. గత మూడు రోజుల నుంచి ఈ విషయమై నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్నామని, అయినా అధికారులు స్పందించకపోవడంతో ఆర్జిత సేవలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంటున్నట్టు భానుమూర్తి చెప్పారు. -
‘రాజన్నా.. ఇదేం లెక్క!
సాక్షి, సారంగాపూర్(జగిత్యాల) : జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రమైన దుబ్బరాజన్న ఆలయానికి ఈ ఏడాది భారీగా ఆదాయం సమకూరింది. అయితే అదేస్థాయిలో ఖర్చులూ పెరిగిపోయాయి. ఈ వ్యవహారం ఆలయంలో ఇటీవల జరిగిన సమావేశంలో చర్చనీయాంశంగా మారింది. గతంలో ఆదాయం భారీగానే వచ్చినా.. ఎప్పుడూ చిల్లిగవ్వ మిగలేదికాదని, ఏయేడు ఖర్చును బాగా తగ్గించి స్వామివారి పేరున రూ.8 లక్షలు బ్యాంక్‌లో డిపాజిట్ చేశామని ఆలయ అధికారులు చెబుతున్నా.. ఆలయ ఆదాయ, వ్యయాలపై వారం క్రితం జరిగిన సమావేశంలో విడుదల చేసిన కాపీలను భక్తులు జిరాక్స్తీసి.. ప్రజలకు పంచుతూ.. ఖర్చులు ఇలా ఉంటే.. ఆలయం ఎలా అభివృద్ధి సాధిస్తుందంటూ ప్రచారం చేస్తుండడం విమర్శలకు తావిస్తోంది. ఇదీ ఆలయ చరిత్ర జిల్లా కేంద్రానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో.. సారంగాపూర్ మండలం పెంబట్ల–కోనాపూర్ గ్రామ సరిహద్దుల్లో ఉంటుందీ ఆలయం. 1982లో ఈ ఆలయం దేవాదాయశాఖ పరిధిలోకి చేరింది. ఇసుకదిబ్బపై స్వయంభూగా వెలిసిన ఆలయం కావడంతో అనతికాలంలో ప్రసిద్ధి చెందింది. రూ.40 వేల ఆదాయంతో ప్రారంభమైన ఆలయ ప్రస్థానం.. ఇప్పుడు రూ.కోటికి చేరింది. 2017–18 ఆదాయ, వ్యయాలు స్వామివారికి భక్తుల ద్వారా మొత్తం ఆదాయం రూ. 84,87,887గా వచ్చింది. ఇందులో నికర ఆదాయం రూ.74,75,191. ప్రారంభ బ్యాంక్ నిలువ రూ.10,12,696. స్వామివారి హుండీ ద్వారా రూ.27,48,953, కోడెమొక్కు ద్వారా రూ. 11,47,650, అభిషేకం ద్వారా రూ.3,34,000, అన్నపూజ ద్వారా 84వేలు, కుంపటి 46,620, గజశూలం 13,860, గదుల కిరాయిద్వారా రూ.20,500 వచ్చింది. ప్రత్యేకాభిషేకం 80,800, కేశఖండనం ద్వారా రూ.35,010, పెద్ద వాహనపూజ రూ.17,800, ద్విచక్రవాహన పూజ రూ.27,100, వివాహాల ద్వారా రూ.8,848, ఆంజనేయ, నవగ్రహపూజల ద్వారా రూ.3 వేలు, గండదీపంతో రూ.98,740, ప్రత్యేక దర్శనం ద్వారా రూ.3,40,350, శావతో రూ.10వేలు, లడ్డూప్రసాదంతో రూ.6,58,805, పులిహోరతో రూ.4,54,560, నిజకోడే మొక్కు రూ.2,232, స్వామివారి కల్యాణం రూ.1,37,500, కొబ్బరికాయలు, పూజసామగ్రి వేలం ద్వారా రూ.5.50లక్షలు, తలనీలాలు రూ.2,05,555, కొబ్బరిముక్క ల వేలం రూ.1.75లక్షలు, కోడెల వేలం రూ. 1,31,378, కల్యాణకట్నాలు రూ.33, 940, బ్యాం క్ వడ్డీలు రూ.55,637, విదేశీ కరెనీ రూ.12,150, ఇతర ఆదాయం రూ.41,203గా సమకూరింది. ఖర్చులు ఇలా.. స్వామివారి ఆదాయం నుంచి మొత్తం రూ. 84,87,887 ఖర్చు చేశారు. ఇందులో వ్యయం రూ.76,29,139, ముగింపు నగదు నిలువ రూ. 1,57,650, ముగింపు బ్యాంక్ నిలువ రూ. 7,01, 103గా పేర్కొన్నారు. పద్దుల వారీగా పరిశీలిస్తే .. అర్చక, సిబ్బంది వేతనాలు రూ.14,28,633, నివేదనకు రూ.98,870, ప్రింటింగ్, స్టేషనరీ, పోస్టేజీ రూ.79,727, కరెంటు బిల్లు, సామగ్రి, మరమ్మతు రూ.1,75,069, మహాశివరాత్రి జాతరకు రూ.9,46,198, ఇతరాలు రూ.11,09,868, కంట్రిబూషన్ కింద రూ.11,08,414, ఆరోగ్యం, పారిశుధ్యం రూ.87,385, మైనర్ రిపేర్స్ రూ. 1,80,542, ఫర్నిచర్ రూ.26,400, నాయీబ్రాహ్మణ వారి ప్రతిఫలం రూ.4,500, ప్రసాదం తయారీ రూ.6,90,180, రుద్రాభిషేకం రూ.12,055, ఏడా ది పండగల ఖర్చు రూ.2,24, 023, అధికారుల టీఏ, డిఏ రూ.12,410, రంగులకు రూ. 1,21,337, అన్నదానం రూ. 2,92,146, ప్రచార ఖర్చు రూ.1,66,679, వీఐపీలు రూ.29,710, ఎఫ్డీఆర్ రూ.8లక్షలు, కోర్టు ఖర్చులు రూ.10వేలు, కోనేరురిపేర్, నిర్వహణకు రూ.38,450, ధర్మకర్తల అలవెన్స్ రూ.1.10లక్షలు, లాకర్కిరాయి రూ.8,576, చౌల్ట్రీ రిపేర్స్ రూ.40వేలు, చలవ పందిళ్లు, టెంట్లు రూ.1,98,020, పూజ సామగ్రి రూ.79,738, కొడెల నిర్వహణ రూ.39,940, బ్యాంక్ చార్జీలు రూ.3,169, లేబర్ చార్జీలు రూ.56,230, ధార్మిక కార్యక్రమాలు రూ.29,275, గ్రాట్యూటీ రూ.2 లక్షలు ఖర్చు చేశారు. -
మఠాన్నే మడతెట్టేయాలని..!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : నగరంలోని కొత్త వెంకోజిపాలెంలో ఉన్న సాధు మఠం భూములపై కొన్నేళ్లుగా పెద్దల కన్నుపడింది. నగరంలో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో హైవేకు ఆనుకుని కీలక ప్రాంతంలో ఉన్న ఈ మఠంపై పట్టు సాధించడానికి ధార్మికవేత్తలు మొదలు టీడీపీ, బీజేపీ నేతలు ప్రయత్నించారు. ఆధ్యాత్మిక సేవ తప్ప రాజకీయంగా, ఆర్ధికంగా పెద్దగా ప్రాబల్యం లేని మఠం స్వాములపై ప్రలోభాల వల విసిరారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ ఆధ్యాత్మిక వేత్త సాధు మఠం స్వాములను కలిసి.. ‘ఇంత విలువైన స్థలాలను ఖాళీగా ఉంచేస్తే ఎలా.. చుట్టూ ప్రహరీ కట్టి వాణిజ్య సముదాయం నిర్మిస్తే ఆదాయం వస్తుంది. మా పీఠం, మీ మఠం కలిసి అలా వాణిజ్య అవసరాలకు కొంత స్థలం వినియోగిద్దాం’.. అని సూచించారు. మఠం స్వాములు స్పందిస్తూ ‘వద్దు స్వామీ.. గురుపరంపరలో భాగంగా వచ్చిన భూములను ఆథ్యాత్మిక అవసరాల కోసమే వినియోగిస్తామని’ చెప్పి ఆయనకో నమస్కారం పెట్టేశారు. కొన్నాళ్ల కిందట జిల్లా తెలుగుదేశం పార్టీ కీలక ప్రజాప్రతినిధి సతీమణి.. సాధు మఠం స్వాములను పిలిపించుకున్నారు. ‘ఏడెకరాలకు పైగా స్థలముంది కదా.. అందులో రెండు ఎకరాలను మా ట్రస్ట్‌కు ఇవ్వండి.. మేం కూడా సర్వీస్ చేస్తాం. రాజకీయంగా, ఆర్ధికంగా మీకు అండగా ఉంటాం.. ఇక మీ జోలికి ఎవ్రూ రారు’.. అని ఓ ప్రతిపాదన చేశారు. దానికి కూడా స్వాములు అంగీకరించలేదు. ఓ దండం పెట్టి బయటకొచ్చేశారు. ఇక ఇటీవల బీజేపీ ప్రతినిధి, పార్టీ నేతలు కలిసి.. ‘మీపై రాజకీయ ఒత్తిళ్లు వస్తున్నాయి కదా.. మేం అండగా ఉంటాం.. ఓ కమిటీ వేయండి.. అందులో మమ్మల్ని సభ్యులుగా చేయండి.. మీ జోలికి ఎవరైనా వస్తే మేం చూసుకుంటాం’.. అని సలహా ఇచ్చారు. మఠంలో రాజకీయ జోక్యం వద్దంటూ స్వాములు దీన్ని కూడా తిరస్కరించారు. ఇలా చాలామంది అడిగారు.. కాదంటే ఊరకున్నారు.. దాంతో ఎవరికీ ఇబ్బంది లేదు. కానీ టీడీపీకి చెందిన విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు స్టైలే వేరు. తన ఇలాకాలో విలువైన స్థలం సాధువులపరమైతే ఎలా.. తనకేమీ ఉపయోగం లేకుంటే ఎందుకు.. అని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా సామాజికవర్గ కోణంలో స్థానికులను రెచ్చగొట్టారు. ఇందుకు తన అనుచరుడు కాళ్ల శంకర్‌ను పావుగా వాడుకున్నారు. శ్మశానానికి దారి పేరిట వివాదం రేపారు. అధికారులు జోక్యం చేసుకుని సరిదిద్దలేని ప్రత్యేక పరిస్థితి సృష్టించారు. మరోవైపు దేవాదాయ శాఖ అధికారులపై ఒత్తిడి తెచ్చి మఠం ప్రాంగణంలోని దేవాలయాలు సాధువులపరం కాకుండా ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నారు. వెలగపూడి ఓకే అంటేనే.. భూములను సాధు మఠానికి అప్పగించే సమయంలో దాతలు ఆ భూముల్లో దేవాలయాలు నిర్మించి ప్రజలకు జ్ఞానతత్వాన్ని అందించాలని ఆకాంక్షించారు. ఆ మేరకు అక్కడ దేవాలయాలు నిర్మించి వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆశ్రమ నిర్వహణకు వినియోగిస్తున్నారు. కానీ కొన్నేళ్ల కిందట మఠం ప్రాంగణంలోని ఆలయాలను దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకోవడంతో మఠం ప్రతినిధులు ఎండోమెంట్ ట్రిబ్యునల్‌కు వెళ్లారు. సాధుమఠంలో దేవాదాయ శాఖ జోక్యం వద్దని ట్రిబ్యునల్ స్పష్టంగా పేర్కొంది. ఈ తీర్పుపై దేవాదాయ అధికారులు హైకోర్టుకు వెళ్లారు. అక్కడా మఠానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఆ తీర్పు అమలుకాకపోవడంతో స్వాములు కోర్టు ధిక్కార పిటిషన్ వేశారు. ప్రస్తుతం అది పెండింగ్‌లో ఉంది. కాగా 2017లో దేవాదాయ శాఖ అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్ మఠాన్ని సందర్శించారు. ఆశ్రమ నిర్వహణను పరిశీలించి ఆలయాల ఆదాయం మఠానికే చెందాలని భావించారు. ఆ మేరకు జీవో ఎంఎస్ నెంబర్ 66 విడుదల చేశారు. కానీ నేటికీ ఆ జీవో అమలు కాలేదు. దీనిపై ఇప్పటికీ మఠం ప్రతినిధులు, పీఠాధిపతి స్వామి పూర్ణానంద సరస్వతి పోరాటం చేస్తూనే ఉన్నారు. ఆ క్రమంలో అమరావతి వెళ్లి దేవాదాయశాఖ ఉన్నతాధికారులను కలిస్తే.. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు నుంచి ఎన్వోసీ(నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) తెచ్చుకోండి.. అని వారు సూచించడంతో బిత్తరపోవడం స్వాముల వంతైంది. భూములు కొట్టేయాలనే వెలగపూడి కుట్ర –పీఠాధిపతి స్వామి పూర్ణానంద ఆరోపణ అమాయకులైన స్థానికులను రెచ్చగొట్టి మఠం భూములు కొట్టేయాలని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు కుట్ర పన్నారని సాధుమఠం పీఠాధిపతి స్వామి పూర్ణానంద ఆరోపించారు. అందుకు ఆయన సామదానభేద దండోపాయాలు ప్రయోగిస్తున్నారని విమర్శించారు. ఆ భూములపై తమకు ఎటువంటి ఆపేక్ష లేదని, గురుపరంపర పరిరక్షణలో భాగంగానే పోరాడుతున్నామని వివరించారు. జిల్లా అధికారులు వెలగపూడిని చూసి భయపడిపోతున్నారని, చివరికి ఆయనపై ఫిర్యాదు చేసిన తమనే దోషులుగా చూపించే యత్నం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు జోక్యం చేసుకుని మఠం భూములు పరిరక్షించాలని స్వామి పూర్ణానంద కోరారు. వివాదమేమిటో పరిశీలిస్తాం కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ సాధుమఠం భూముల వివాదమేమిటో క్షుణ్ణంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ స్పష్టం చేశారు. వాస్తవానికి ఆ వివాదమేమిటో సోమవారం సాక్షి కథనం చూసే వరకు తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. నిబంధనల మేరకు ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తామని చెప్పారు. -
పెద్దమ్మ గుడికి ధర్మకర్తల మండలి?
సాక్షి, హైదరాబాద్: చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న జూబ్లీహిల్స్ శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ ధర్మకర్తల మండలి ఏర్పాటుకు దేవాదాయ శాఖ నోటిఫికేషన్ విడుదలకు జీవో జారీ చేసింది. మాజీ ఎమ్మెల్యే పి. విష్ణువర్ధన్‌రెడ్డి ఫౌండర్ ట్రస్టీగా కొనసాగుతున్న ఈ ఆలయానికి ధర్మకర్తలి మండలి వేయడం తొలిసారిగా జరుగుతుండటం గమనార్హం. దివంగత మాజీ సీఎల్పీ నేత పి.జనార్ధన్‌రెడ్డి 1993లో స్థాపించిన ఈ దేవాలయానికి దేవాదాయ శాఖ ధర్మకర్తల మండలి ఏర్పాటుకు ఇప్పుడు నోటిఫికేషన్ జారీ చేయడానికి ప్రయత్నిస్తుండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పీజేఆర్ హయాం నుంచి ప్రస్తుత విష్ణువర్ధన్‌రెడ్డి వరకు ఆలయం క్రమశిక్షణకు, శుచి, శుభ్రతకు, పటిష్టమైన కార్యనిర్వహణకు కేరాఫ్‌గా నిలుస్తున్నది. ఒకే వ్యక్తి పాలనలో ఉండటంతో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా వివాదాలకు దూరంగా ఉంది. ఇప్పుడు ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేస్తే ఏ మేరకు భక్తులు హర్షిస్తారో వేచి చూడాల్సి ఉంది. జూబ్లీహిల్స్ శ్రీ పెద్దమ్మ దేవాలయానికి ధర్మకర్తల మండలి నియామకాన్ని వ్యతిరేకిస్తూ ఆలయ యాజమాన్యం ఎప్పటికప్పుడు మినహాయింపు కోరుతూ వచ్చింది. అయితే 2018 మార్చి 5వ తేదీన మినహాయింపు గడువు ముగిసింది. మరోసారి ట్రస్ట్ బోర్డు వేయకుండా మినహాయింపునివ్వాలంటూ కోరినా ఫలితం దక్కలేదు. వీరి లేఖను మంత్రి తిరస్కరించారు. దీంతో ట్రస్ట్ బోర్డు ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు అయింది. 14 మంది ధర్మకర్తలు... ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం త్వరలో ట్రస్ట్ బోర్డు ఏర్పాటుకు నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో చైర్మన్ సహా 14 మంది సభ్యులను నియమించేందుకు ఎండోమెంట్ చట్టం వర్తిస్తుంది. ఆలయ ప్రధాన అర్చకులు ఎక్స్ అఫీషియో సభ్యులుగా వ్యవహరిస్తారు. ఎండోమెంట్ చట్టం ప్రకారం ఆలయ ఫౌండర్ ట్రస్టీ చైర్మన్‌గా వ్యవహరించే అవకాశం ఉంటుంది. 6(ఏ) కేటగిరిలో ఆలయం... జూబ్లీహిల్స్ శ్రీ పెద్దమ్మ దేవాలయాన్ని దేవాదాయ శాఖ 6(ఏ) కేటగిరిలో నమోదు చేసింది. ‘25 లక్షల నుంచి’ రూ.1 కోటి వరకు వార్షిక నికర ఆదాయం ఉన్న ఆలయాలకు ఫస్ట్ గ్రేడ్ ఈవోను, రూ.1 కోటి పైబడి వార్షిక ఆదాయం ఉంటే అసిస్టెంట్ కమిషనర్ పరిధిలోకి, రూ.1 కోటి నుంచి 3 కోట్లలోపు ఆదాయం ఉంటే అసిస్టెంట్ కమిషనర్ హోదా ఈవోను నియమిస్తారు. రూ.3 కోట్లు దాటితే డిప్యూటీ కమిషనర్, రూ.5 కోట్లు పైబడిన ఆలయాలకు జాయింట్ కమిషనర్‌ను నియమిస్తారు. జూబ్లీహిల్స్ శ్రీ పెద్దమ్మ దేవాలయం వార్షిక ఆదాయం రూ.7 కోట్ల వరకు ఉంటుందని అంచనా. హుండీ ఆదాయం నెలకు రూ.37 లక్షల వరకు ఉంటుంది. ఈ ఆలయం ఫస్ట్ గ్రేడ్ ఈవో పరిధిలో ఉంది. నగరంలోనే పెద్దమ్మ.... జంట నగరాల్లోనే అత్యంత ఆదాయం కలిగిన ఆలయాల్లో జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి ఒకటి. ప్రతి మంగళ, శుక్ర, ఆదివారాల్లో వేలాదిగా భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఆ స్థాయిలోనే హుండీ ఆదాయం కూడా ఉంటుంది. వారానికి రెండుసార్లు ఉచిత అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటారు. ఆభరణాల్లోనే అమ్మవారు పెద్దమ్మలా నిలుస్తున్నారు. సుమారు ఏడెకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయం ఇతర రాష్ట్రాల్లోని భక్తులను కూడా ఆకర్షిస్తుంటుంది. అమ్మవారి ఆశీస్సుల కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు విశేషంగా తరలి వస్తుంటారు. నిత్య బోనం... ఎక్కడా లేని విధంగా పెద్దమ్మ దేవాలయం నిత్య బోనాలతో కళకళలాడుతుంటుంది. ముఖ్యంగా మంగళ, శుక్ర, ఆదివారాల్లో అమ్మవారికి బోనం సమర్పించే వారు బారులు తీరుతుంటారు. భక్తులకు చక్కటి వసతులు కూడా ఏర్పాటు చేశారు. -
ఆ భూములెవరివో తేల్చండి
-
ఆ భూములెవరివో తేల్చండి
సాక్షి, న్యూఢిల్లీ: సదావర్తి భూముల వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. వందల కోట్ల విలువైన భూములను కారు చౌకగా కట్టబెట్టేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టడం, కోర్టుల జోక్యం, రెండుసార్లు వేలం వంటి పరిణామాల నేపథ్యంలో.. తమిళనాడు తెరపైకి రావడంతో అసలు భూములెవరివో తేల్చాలంటూ సుప్రీంకోర్టు పరోక్షంగా స్పష్టం చేసింది. ఈ భూములు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖవి కావని, తమకు చెందినవని, అందువల్ల వేలం నిర్వహిం చరాదంటూ తమిళనాడు చేసిన వాదనలను పరిగణనలోకి తీసుకున్న సర్వోన్నత న్యాయస్థానం దీన్ని మళ్లీ విచారించి పరిష్కరించాలని హైకోర్టుకు సూచించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు ఎ.ఎం.ఖన్విల్కర్, డీవై చంద్రచూడ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. భూముల వేలం కేసును ఇంతటితో ముగిస్తున్నట్టు పేర్కొంది. తమిళనాడులోని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖకు చెందిన వందల కోట్ల విలువ చేసే సదావర్తి సత్రం భూముల (ఇవి తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి)ను నిబంధనలు ఉల్లంఘించి, ఒక పథకం ప్రకారం అధికార పార్టీ నేతలకు రూ.22 కోట్ల నామమాత్రపు ధరకు దక్కేలా వ్యవహరించారని ఆరోపిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గతంలో హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో రూ.27 కోట్లను కనీస ధరగా నిర్ణయించి తిరిగి వేలం పాట నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆదేశాలను సవాలు చేస్తూ తాము నిబంధనల ప్రకారమే రూ.22 కోట్లకు వేలం పాడామని, తమకే చెందేలా ఆదేశాలు ఇవ్వాలని తొలి వేలంలో భూము లను దక్కించుకున్న ఎం.సంజీవరెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇందుకు నిరాకరిం చిన సుప్రీంకోర్టు రెండోసారి వేలానికి అనుమతించింది. దీనికి అనుగు ణంగా దేవాదాయ శాఖ వేలం నిర్వహించగా బహిరంగ వేలంలో మూడింతలు ధర పలికినా.. మొదటి బిడ్డర్ నగదు చెల్లించలేదు. దీంతో తదుపరి బిడ్డర్‌కు అవకాశం దక్కింది. ఈ నేపథ్యంలో శుక్రవారం సుప్రీంకోర్టులో జరిగిన తాజా విచారణలో తొలుత దేవాదాయ శాఖ తరఫు న్యాయవాది ప్రేరణా సింగ్ తాజా పరిణామాలను ధర్మాసనానికి నివేదించారు. మొదటి బిడ్డర్ నగదు చెల్లించ లేకపోయారని, తదుపరి బిడ్డర్ నగదు చెల్లించారని వివరించారు. దీంతో ఇక కేసు ముగించేద్దామని ధర్మాసనం పేర్కొనగా.. తమిళనాడు ప్రభుత్వం తరఫు న్యాయవాది సుబ్రమణ్యం ప్రసాద్ తమ వాదన వినాలని కోరారు. ఈ భూములు తమిళనాడు ప్రభు త్వానివని, అందువల్ల వేలం ప్రక్రియను అంగీకరించరాదని, ఈ మేరకు హైదరాబాద్ లోని హైకోర్టులో మధ్యంతర దరఖాస్తు దాఖలు చేశామని విన్నవించారు. 18 శాతం వడ్డీకి తెచ్చాం..: తొలివేలంలో భూములను కైవసం చేసుకున్న సంజీవరెడ్డి తరఫు న్యాయవాది రామకృష్ణప్రసాద్ వాద నలు వినిపిస్తూ తాము 18 శాతం వడ్డీకి డబ్బు తెచ్చి వేలం పాడి డిపాజిట్ చేశామని, నెలల తరబడి డిపాజిట్ ఉంచుకుని ఇప్పుడు కేవ లం 8 శాతం వడ్డీతో వెనక్కి తిరిగి ఇస్తే తాము నష్టపోతామని, న్యాయం చేయాలని అభ్యర్థిం చారు. సీపీఐ నారాయణ తరఫు న్యాయవాది కె.శ్రవణ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ సీబీఐ విచారణ జరిపించాలని, ఈ మేరకు మధ్యంతర దరఖాస్తు దాఖలు చేశామని చెప్పారు. అయితే ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించేందుకు నిరాకరించింది. పిటిషనర్‌కు వడ్డీతో చెల్లించండి అందరి వాదనలు విన్న తర్వాత ఈ కింది ఆదేశాలు జారీ చేయడం సముచితంగా ఉంటుందని భావిస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. ‘పిటిషనర్ సంజీవరెడ్డి డిపాజిట్ చేసిన మొత్తాన్ని 4 వారాల్లోగా వడ్డీతో సహా చెల్లించాలి. రెండో బిడ్డర్ చేసిన డిపాజిట్‌ను దేవాదాయ శాఖ కమిషనర్ తిరిగి చెల్లించాలి. తమిళనాడు తరపు న్యాయవాది సుబ్రమణ్యం ప్రసాద్ చేస్తున్న వాదనను పరిగణనలోకి తీసుకుని ఈ మొత్తం వ్యవహారాన్ని హైకోర్టు మళ్లీ విచారించి పరిష్కరించాలి. అందుకు అనుగుణంగా స్పెషల్ లీవ్ పిటిషన్‌ను, మధ్యంతర దరఖాస్తుల విచారణ ప్రక్రియను ముగిస్తున్నాం..’ అని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. -
ఉద్యోగం ఉంటుందా?!
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని వివిధ ఆలయాల్లో ఎన్‌ఎంఆర్‌లుగా చేరి ఆ తర్వాత రెగ్యులర్ ఉద్యోగిగా పదోన్నతి పొందిన వందలాది మంది ఉద్యోగులు ఇప్పుడు తమ ఉద్యోగం ఉంటుందో.. ఊడుతుందో అర్థంకాక ఆందోళన చెందుతున్నారు. దేవాదాయ శాఖలో ఏళ్ల తరబడి ఎన్‌ఎంఆర్‌గా పనిచేస్తున్న తమను రెగ్యులరైజు చేయాలంటూ ఇటీవల కాలంలో పెద్ద సంఖ్యలో హైకోర్టును ఆశ్రయించారు. అలాగే గతంలో ఎన్‌ఎంఆర్‌గా పనిచేసిన ఉద్యోగులను కొందరు అధికారులు ప్రభుత్వం అనుమతి లేకుండా రెగ్యులరైజు చేశారంటూ ఇటీవల రాష్ట్ర హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ పరిధిలో మొదట ఎన్‌ఎంఆర్‌గా చేరి ఆ తర్వాత రెగ్యులర్ ఉద్యోగిగా పదోన్నతి పొందిన వారి సర్వీసు రికార్డులను అత్యవసరంగా ప్రభుత్వానికి చేర్చాలంటూ మంగళవారం దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. రాజమండ్రి, తిరుపతిలోని దేవాదాయ శాఖ ఉప ప్రాంతీయ కమిషనర్లతో పాటు డిప్యూటీ కమిషనర్లు, అన్ని జిల్లాల అసిస్టెంట్ కమిషనర్లు తమ పరిధిలో ఉండే ఆలయాల్లో ఈ తరహా ఉద్యోగుల సర్వీసు రికార్డులను ప్రత్యేక సిబ్బంది ద్వారా అత్యవసరంగా అందజేయాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. దాదాపు 15 ఏళ్ల కిత్రం రెగ్యులరైజు అయిన ఉద్యోగాల గురించి ప్రభుత్వం అత్యవసరంగా సమీక్షించాలని నిర్ణయించడంతో ఎందుకో అర్థంకాక ఉద్యోగులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పటికీ ఎన్‌ఎంఆర్‌లుగా పనిచేస్తున్న వారిని రెగ్యులరైజ్ చేయాల్సి వస్తుందని ప్రభుత్వం కోర్టు కేసులు సాకు చూపి తమ ఉద్యోగాలకు ఎక్కడ ఎసరు పెడుతుందోమోనని భయాందోళన చెందుతున్నారు. ఆరువేల మంది ఎన్‌ఎంఆర్‌లు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఎన్‌ఎంఆర్‌లుగా పనిచేస్తూ ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగులను రెగ్యులరైజు చేయడానికి 1994 ఏప్రిల్‌లో అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ఆధారంగా 2000 సంవత్సరంలో దేవాదాయ శాఖ పరిధిలో ఉండే ఆలయాల్లో ఎన్‌ఎంఆర్‌లుగా పనిచేసే వారిని రెగ్యులరైజ్ చేయడానికి అనుమతి తెలుపుతూ అప్పటి దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో 2000–2004 మధ్య కాలంలో దాదాపు 800 మంది ఎన్ఎంఆర్ ఉద్యోగులను రెగ్యులరైజు చేసినట్టు దేవాదాయ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఇవి రాజకీయ పైరవీలతో కొనసాగాయని పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో 2005లో ఈ తరహా నియమకాలకు అప్పటి ప్రభుత్వం బ్రేక్‌లు వేసింది. అయితే తమనూ రెగ్యులరైజు చేయాలంటూ ఏళ్ల తరబడి ఎన్‌ఎంఆర్‌లుగా పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు ఇటీవల కోర్టును ఆశ్రయించారు. అందుకు ప్రభుత్వం ఆసక్తిగా లేకపోవడంతో, కోర్టు కేసులు సాకుగా చూపి గతంలో రెగ్యులరైజు చేసిన ఎన్ఎంఆర్ ఉద్యోగుల నియామకాలపై పునరాలోచన చేయాలని యోచిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో 20,839 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, అర్చకులు పోను 9,727 మంది కార్యనిర్వాహక ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో కేవలం 3,316 మంది మాత్రమే రెగ్యులర్ ఉద్యోగులుగా కొనసాగుతుండగా, వీరిలో 800 మంది ఎన్‌ఎంఆర్‌లుగా పనిచేస్తూ పదోన్నతి పొందిన వారని అధికారులు చెబుతున్నారు. మరో 6,411 మంది ఇప్పటికీ ఎన్ఎంఆర్లుగానూ, కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. -
ట్రిబ్యునల్ తీర్పు బేఖాతర్
స్థలం స్వాధీనంలో దేవాదాయ శాఖ నిర్లక్ష్యం - టీడీపీ నేతల ఒత్తిళ్లే కారణం - నోటీసులతో సరిపెట్టే ప్రయత్నం కర్నూలు(అగ్రికల్చర్): ఓ స్థలాన్ని స్వాధీనం చేసుకునే విషయంలో ఎండోమెంట్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చిన నాలుగేళ్ల తర్వాత దేవాదాయ శాఖ స్పందించిన తీరు చర్చనీయాంశంగా మారింది. నేతల ఒత్తిళ్లే ఇందుకు కారణం కాగా.. ఆ శాఖ కమిషనర్ ఆగ్రహంతో ఎట్టకేలకు కదలిక వచ్చింది. అయితే టీడీపీ నేతల ఒత్తిళ్లతో ఇప్పుడు కూడా నోటీసులతో సరిపెట్టేందుకు రంగం సిద్ధమయింది.ఽ వివరాల్లోకి వెళితే.. కర్నూలు కిడ్స్ వరల్డ్ సమీపంలోని గోరక్షణ మహా సంఘానికి సర్వే నెంబర్ 171లో 330 చదరపు గజాల స్థలం ఉంది. ఇందులో వీఎస్ టెక్స్టైల్స్ వస్త్ర దుకాణం నిర్వహిస్తున్నారు. ఈ స్థలాన్ని దక్కించుకునేందుకు దేవాదాయ శాఖ అధికారులు ఎండోమెంట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. విచారణ అనంతరం 2012లో తీర్పు ఎండోమెంట్‌కు అనుకూలంగా వచ్చింది. తీర్పు కాపీ అందిన నెల రోజుల్లో స్థలం స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. అయితే దేవాదాయ శాఖ స్పందించని పరిస్థితి. ప్రస్తుతం అధికార టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న నేతల ఒత్తిళ్లతోనే ఈ పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. విషయం దేవాదాయ శాఖ కమిషనర్ దృష్టికి వెళ్లడంతో అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆ మేరకు తీర్పు వచ్చిన నాలుగేళ్ల తర్వాత దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ గాయత్రిదేవి కర్నూలు తహసీల్దార్ రమేష్, పోలీసు అధికారులతో శనివారం సర్వే నెంబర్ 171లోని స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు వెళ్లారు. వీఎస్ టెక్స్టైల్స్ పేరుతో నిర్వహిస్తున్న దుకాణాన్ని ఖాళీ చేయాలని కోరారు. ఈ విషయాన్ని యజమాని టీడీపీ నేతల దృష్టికి తీసుకెళ్లడం.. అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం.. అక్కడి నుంచి వెళ్లిపోవడం చకచకా జరిగిపోయాయి. అయితే 15 రోజుల్లో స్థలాన్ని ఖాళీ చేయాలని దుకాణం యజమానికి నోటీసులు ఇవ్వాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. -
ఆస్తుల రికవరీకి చర్యలు
రాజాం(సంతకవిటి): జిల్లాలోని దేవాదాయ శాఖ భూములు, ఆస్తుల రికవరీకి చర్యలు చేపడుతున్నామని జిల్లా దేవాదాయ శాఖ ఏసీ శ్యామలాదేవి అన్నారు. రాజాం నవదుర్గా మాత ఆలయంలో శనివారం ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తలు ఆమెను సత్కరించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. అమ్మవారు సరస్వతీ దేవి రూపంలో దర్శనమిచ్చిన సందర్భంగా సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించామని తెలిపారు. జిల్లాలో దేవాదాయశాఖ భూముల వివరాలు మొత్తం సేకరించడంతో పాటు వాటి నుంచి రావాల్సిన ఆదాయాన్ని తీసుకొచ్చే మార్గాలు అన్వేషించామని అన్నారు. ఈ భూములు ఆక్రమించి అనుభవిస్తున్న వారిపై న్యాయపరమైన చర్యలు చేపడతామని తెలిపారు. కౌలు రైతులు దేవదాయ శాఖ భూములను వెబ్ అడంగల్‌లో తమ పేరును నమోదు చేసుకునే ప్రయత్నం చేయరాదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త వానపల్లి నర్శింగరావు, ఈఓ వాసుదేవరావు, గురుభవాని వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. -
బడుగులందరికీ దివ్య దర్శనం
– దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ దుర్గాప్రసాద్ దెందులూరు : బడుగు, బలహీనవర్గాల్లో ఆధ్యాత్మిక అభివృద్ధి, శ్రీవారి సన్నిధి సులభతరమయ్యేలా రాష్ట్రప్రభుత్వం, దేవాదాయశాఖ చర్యలు తీసుకుందని జిల్లా దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ సీహెచ్.దుర్గాప్రసాద్ అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దివ్యదర్శనం పథకాన్ని జిల్లావ్యాప్తంగా అమలు చేస్తున్నామన్నారు. ఈ పథకంలో రామాలయాల ఆధునికీకరణ, నిర్మాణం, భజన మండళ్లకు శిక్షణ తరగతులు ప్రతి దేవాలయంలో దూప, దీప నైవేథ్యాల పర్యవేక్షణతో పాటు పేద బడుగు, బలహీనవర్గాల వారందరికీ కుటుంబంలో ఐదుగురికి వారానికి ఒకరోజు ఆర్టీసీ బస్సులో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్లడం జరుగుతుందన్నారు. ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి, విజయవాడ, నెల్లూరు, శ్రీకాళహస్తి, తిరుచానూరు, తిరుపతి, కాణిపాకం, రాయచోటి, అహోబిలం పుణ్యక్షేత్రాలకు దేవాదాయశాఖ నిధులతో తీసుకువెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఇందుకు గాను జిల్లాలోని దేవాదాయశాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, ఇన్స్పెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. జిల్లాలోని పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాలను సందర్శించి ఆధ్యాత్మిక సేవలను అందుకోవాలని ఆయన కోరారు.