నెల్లిమర్ల రూరల్: ఉత్తరాంధ్రలోనే రామతీర్థానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది.. ఏడాదికి దాదాపు రెండు కోట్ల రూపాయలకు పైగానే ఆదాయం వస్తోంది.. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రా భద్రాద్రిగా కూడా చరిత్రకు ఎక్కాల్సిన సమయంలో వివిధ కారణాలతో ఒంటిమిట్టకు ఆ అవకాశం వెళ్లిపోయింది. అయినప్పటికీ రామతీర్థంలో కూడా అధికార లాంచనాలతో శ్రీరామనవమి వేడుకలను అత్యంత వేడుకగా జరిపిస్తున్నారు... కార్తీకమాసం, తిరుక్కల్యాణం, రథయాత్ర, మహా శివరాత్రి పర్వదినాల్లో లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. క్షేత్రం పక్కనే ఉన్న బోడికొండ వల్లే రామతీర్థానికి ఇంతటి పేరు వచ్చిందంటే అతిశయోక్తి కాదు. అయితే అంతటి ప్రాశస్త్యం ఉన్న బోడికొండ నిర్లక్ష్యపు నీడలో ఉంది. ప్రమాదాలకు కేరాఫ్‌గా మారింది. బోడికొండపై హెచ్చరికబోర్డులు లేకపోవడంతో భక్తులు తికమకపడుతున్నారు.
అలనాటి చిహ్నాలను చూసేందుకు....
క్షేత్రానికి ఉత్తర దిక్కున నీలాచలం పేరుతో రెండు కిలోమీటర్ల పొడవు గల ఏకశిలా పర్వతమే బోడికొండ. ఈ పర్వతంపై సీతారాములు, పాండవులు సంచరించిన చిహ్నములున్నాయి. అలాగే పర్వతాగ్రమున కోదండరాముని ఆలయం కూడా ఉంది. ఆలయం పక్కనే ఎప్పటికీ ఎండిపోని పాతాళగంగ (నీటి కొలను) ఉంది. ఈ నీటి మడు గు నుంచి పడమర దిశగా ఇరుకురాయి ఉంటుం ది. దాని మధ్యగుండా వెళితే.. అలనాడు భీముడు వంట చేసిన ప్రదేశం కనిపిస్తుంది. దీనికి సమీపంలో ఉన్న గుహలో బుద్ధ విగ్రహం, పలుకురాయి ఉంది.
అలాగే పాండవులు ధరించిన పంచెలు, సీతమ్మవారి పురిటి మంచం, తదితర చిహ్నా లు నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఈ కొండ పక్కనే దుర్గాభైరవ కొండ, బౌద్ధుల నివాస గుహాలు కూడా ఉన్నాయి. ఈ చారిత్రక గుర్తులను చూసేందుకు భక్తులు, సందర్శకులు ప్రతినిత్యం అధిక సంఖ్యలో పర్వతంపైకి వెళ్తుంటారు. అయి తే కొండ ప్రమాదకరంగా ఉండడంతో ఎటు నుం చి ఎటు వెళ్లాలి...ఎక్కడ ప్రమాదకరం... ఎక్క డ జాగ్రత్తగా ఉండాలో తెలియజేసే బోర్డులు లేవు.
పొంచి ఉన్న ప్రమాదం..
కోదండరామస్వామి ఆలయం పక్కనే ఉన్న నీటికొలను లోతు ఎంత ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. ఈ ప్రాంతం వద్ద దేవదాయ శాఖాధికారులు హెచ్చరిక బోర్డులు సైతం ఏర్పాటు చేయలేదు. గతంలో ఇక్కడ బోర్డులుండేవి. గాలులకు పడిపోయిన తర్వాత ఎవ్వరూ మళ్లీ ఏర్పాటు చేయలేదు. భీముని గుడికి వెళ్లే మెట్ల మార్గం వద్ద.. సీతమ్మ పురిటి మంచం వద్ద మెట్లు దిగే ప్రాంతంలో సందర్శకులు తీవ్ర ఇబ్బంది పడుతుంటారు. ఇక్కడే అదుపు తప్పి ఎంతోమంది పడిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ దేవస్థాన సిబ్బంది పట్టించుకోకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఉన్నతాధికారుల దృష్టికి ..
బోడికొండపై హెచ్చరికబోర్డులు, సూచిక చిహ్నాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. రెయిలింగ్ ఏర్పాటు చేస్తే మంచిందే కానీ ఈ విషయంపై ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. భక్తులు కూడా సహకరించాలి. బోడికొండపైకి చేరుకుంటున్న భక్తులు జాగ్రత్తలు తీసుకోవాలి. దారి తప్పితే సాహసాలు చేయకుండా వచ్చిన రహదారినే తిరిగి ఆశ్రయించాలి..
ఎన్‌వీఎస్‌ఎన్ మూర్తి, డిప్యూటీ కమీషనర్, దేవదాయశాఖ.
Comments
Please login to add a commentAdd a comment