![AP Endowment NMR workers worrying about Job Security - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2017/09/30/temple.jpg.webp?itok=BP6hjmnx)
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని వివిధ ఆలయాల్లో ఎన్‌ఎంఆర్‌లుగా చేరి ఆ తర్వాత రెగ్యులర్ ఉద్యోగిగా పదోన్నతి పొందిన వందలాది మంది ఉద్యోగులు ఇప్పుడు తమ ఉద్యోగం ఉంటుందో.. ఊడుతుందో అర్థంకాక ఆందోళన చెందుతున్నారు. దేవాదాయ శాఖలో ఏళ్ల తరబడి ఎన్‌ఎంఆర్‌గా పనిచేస్తున్న తమను రెగ్యులరైజు చేయాలంటూ ఇటీవల కాలంలో పెద్ద సంఖ్యలో హైకోర్టును ఆశ్రయించారు. అలాగే గతంలో ఎన్‌ఎంఆర్‌గా పనిచేసిన ఉద్యోగులను కొందరు అధికారులు ప్రభుత్వం అనుమతి లేకుండా రెగ్యులరైజు చేశారంటూ ఇటీవల రాష్ట్ర హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ పరిధిలో మొదట ఎన్‌ఎంఆర్‌గా చేరి ఆ తర్వాత రెగ్యులర్ ఉద్యోగిగా పదోన్నతి పొందిన వారి సర్వీసు రికార్డులను అత్యవసరంగా ప్రభుత్వానికి చేర్చాలంటూ మంగళవారం దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
రాజమండ్రి, తిరుపతిలోని దేవాదాయ శాఖ ఉప ప్రాంతీయ కమిషనర్లతో పాటు డిప్యూటీ కమిషనర్లు, అన్ని జిల్లాల అసిస్టెంట్ కమిషనర్లు తమ పరిధిలో ఉండే ఆలయాల్లో ఈ తరహా ఉద్యోగుల సర్వీసు రికార్డులను ప్రత్యేక సిబ్బంది ద్వారా అత్యవసరంగా అందజేయాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. దాదాపు 15 ఏళ్ల కిత్రం రెగ్యులరైజు అయిన ఉద్యోగాల గురించి ప్రభుత్వం అత్యవసరంగా సమీక్షించాలని నిర్ణయించడంతో ఎందుకో అర్థంకాక ఉద్యోగులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పటికీ ఎన్‌ఎంఆర్‌లుగా పనిచేస్తున్న వారిని రెగ్యులరైజ్ చేయాల్సి వస్తుందని ప్రభుత్వం కోర్టు కేసులు సాకు చూపి తమ ఉద్యోగాలకు ఎక్కడ ఎసరు పెడుతుందోమోనని భయాందోళన చెందుతున్నారు.
ఆరువేల మంది ఎన్‌ఎంఆర్‌లు
వివిధ ప్రభుత్వ శాఖల్లో ఎన్‌ఎంఆర్‌లుగా పనిచేస్తూ ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగులను రెగ్యులరైజు చేయడానికి 1994 ఏప్రిల్‌లో అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ఆధారంగా 2000 సంవత్సరంలో దేవాదాయ శాఖ పరిధిలో ఉండే ఆలయాల్లో ఎన్‌ఎంఆర్‌లుగా పనిచేసే వారిని రెగ్యులరైజ్ చేయడానికి అనుమతి తెలుపుతూ అప్పటి దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో 2000–2004 మధ్య కాలంలో దాదాపు 800 మంది ఎన్‌ఎంఆర్ ఉద్యోగులను రెగ్యులరైజు చేసినట్టు దేవాదాయ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఇవి రాజకీయ పైరవీలతో కొనసాగాయని పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో 2005లో ఈ తరహా నియమకాలకు అప్పటి ప్రభుత్వం బ్రేక్‌లు వేసింది.
అయితే తమనూ రెగ్యులరైజు చేయాలంటూ ఏళ్ల తరబడి ఎన్‌ఎంఆర్‌లుగా పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు ఇటీవల కోర్టును ఆశ్రయించారు. అందుకు ప్రభుత్వం ఆసక్తిగా లేకపోవడంతో, కోర్టు కేసులు సాకుగా చూపి గతంలో రెగ్యులరైజు చేసిన ఎన్‌ఎంఆర్ ఉద్యోగుల నియామకాలపై పునరాలోచన చేయాలని యోచిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో 20,839 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, అర్చకులు పోను 9,727 మంది కార్యనిర్వాహక ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో కేవలం 3,316 మంది మాత్రమే రెగ్యులర్ ఉద్యోగులుగా కొనసాగుతుండగా, వీరిలో 800 మంది ఎన్‌ఎంఆర్‌లుగా పనిచేస్తూ పదోన్నతి పొందిన వారని అధికారులు చెబుతున్నారు. మరో 6,411 మంది ఇప్పటికీ ఎన్‌ఎంఆర్‌లుగానూ, కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్నారు.