మఠాన్నే మడతెట్టేయాలని..! | Planning Occupying The Math | Sakshi
Sakshi News home page

మఠాన్నే మడతెట్టేయాలని..!

Published Thu, Jun 7 2018 8:41 AM | Last Updated on Thu, Mar 21 2019 8:18 PM

Planning Occupying The Math - Sakshi

మఠంలోని ఆశ్రమం

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : నగరంలోని కొత్త వెంకోజిపాలెంలో ఉన్న సాధు మఠం భూములపై కొన్నేళ్లుగా పెద్దల కన్నుపడింది. నగరంలో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో హైవేకు ఆనుకుని కీలక ప్రాంతంలో ఉన్న ఈ మఠంపై పట్టు సాధించడానికి ధార్మికవేత్తలు మొదలు టీడీపీ, బీజేపీ నేతలు ప్రయత్నించారు. ఆధ్యాత్మిక సేవ తప్ప రాజకీయంగా, ఆర్ధికంగా పెద్దగా  ప్రాబల్యం లేని మఠం స్వాములపై ప్రలోభాల వల విసిరారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ ఆధ్యాత్మిక వేత్త సాధు మఠం స్వాములను కలిసి.. ‘ఇంత విలువైన స్థలాలను ఖాళీగా ఉంచేస్తే ఎలా.. చుట్టూ ప్రహరీ కట్టి వాణిజ్య సముదాయం నిర్మిస్తే ఆదాయం వస్తుంది. మా పీఠం, మీ మఠం కలిసి అలా వాణిజ్య అవసరాలకు కొంత స్థలం వినియోగిద్దాం’.. అని సూచించారు. మఠం స్వాములు స్పందిస్తూ ‘వద్దు స్వామీ.. గురుపరంపరలో భాగంగా వచ్చిన భూములను ఆథ్యాత్మిక అవసరాల కోసమే వినియోగిస్తామని’ చెప్పి ఆయనకో నమస్కారం పెట్టేశారు. 


కొన్నాళ్ల కిందట జిల్లా తెలుగుదేశం పార్టీ కీలక ప్రజాప్రతినిధి సతీమణి.. సాధు మఠం స్వాములను పిలిపించుకున్నారు. ‘ఏడెకరాలకు పైగా స్థలముంది కదా.. అందులో రెండు ఎకరాలను మా ట్రస్ట్‌కు ఇవ్వండి.. మేం కూడా సర్వీస్‌ చేస్తాం. రాజకీయంగా, ఆర్ధికంగా మీకు అండగా ఉంటాం.. ఇక మీ జోలికి ఎవ్రూ రారు’.. అని ఓ ప్రతిపాదన చేశారు. దానికి కూడా స్వాములు అంగీకరించలేదు. ఓ దండం పెట్టి బయటకొచ్చేశారు. ఇక ఇటీవల బీజేపీ ప్రతినిధి, పార్టీ నేతలు కలిసి.. ‘మీపై రాజకీయ ఒత్తిళ్లు వస్తున్నాయి కదా..  మేం అండగా ఉంటాం.. ఓ కమిటీ వేయండి.. అందులో మమ్మల్ని సభ్యులుగా చేయండి.. మీ జోలికి ఎవరైనా వస్తే మేం చూసుకుంటాం’.. అని సలహా ఇచ్చారు. మఠంలో రాజకీయ జోక్యం వద్దంటూ స్వాములు దీన్ని కూడా తిరస్కరించారు.


ఇలా చాలామంది అడిగారు.. కాదంటే ఊరకున్నారు.. దాంతో ఎవరికీ ఇబ్బంది లేదు. కానీ టీడీపీకి చెందిన విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు స్టైలే వేరు. తన ఇలాకాలో విలువైన స్థలం సాధువులపరమైతే ఎలా.. తనకేమీ ఉపయోగం లేకుంటే ఎందుకు.. అని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా సామాజికవర్గ కోణంలో స్థానికులను రెచ్చగొట్టారు. ఇందుకు తన అనుచరుడు కాళ్ల శంకర్‌ను పావుగా వాడుకున్నారు. శ్మశానానికి దారి పేరిట వివాదం రేపారు. అధికారులు జోక్యం చేసుకుని సరిదిద్దలేని ప్రత్యేక పరిస్థితి సృష్టించారు. మరోవైపు దేవాదాయ శాఖ అధికారులపై ఒత్తిడి తెచ్చి మఠం ప్రాంగణంలోని దేవాలయాలు సాధువులపరం కాకుండా ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నారు.


వెలగపూడి ఓకే అంటేనే..
భూములను సాధు మఠానికి అప్పగించే సమయంలో దాతలు ఆ భూముల్లో దేవాలయాలు నిర్మించి  ప్రజలకు జ్ఞానతత్వాన్ని అందించాలని ఆకాంక్షించారు. ఆ మేరకు అక్కడ దేవాలయాలు నిర్మించి వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆశ్రమ నిర్వహణకు వినియోగిస్తున్నారు. కానీ కొన్నేళ్ల కిందట మఠం ప్రాంగణంలోని ఆలయాలను దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకోవడంతో మఠం ప్రతినిధులు ఎండోమెంట్‌ ట్రిబ్యునల్‌కు వెళ్లారు. సాధుమఠంలో దేవాదాయ శాఖ జోక్యం వద్దని ట్రిబ్యునల్‌ స్పష్టంగా పేర్కొంది. ఈ తీర్పుపై దేవాదాయ అధికారులు హైకోర్టుకు వెళ్లారు. అక్కడా మఠానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఆ తీర్పు అమలుకాకపోవడంతో స్వాములు కోర్టు ధిక్కార పిటిషన్‌ వేశారు. ప్రస్తుతం అది పెండింగ్‌లో ఉంది.


కాగా 2017లో  దేవాదాయ శాఖ అప్పటి ప్రిన్సిపల్‌ సెక్రటరీ జేఎస్‌వీ ప్రసాద్‌ మఠాన్ని సందర్శించారు. ఆశ్రమ నిర్వహణను పరిశీలించి ఆలయాల ఆదాయం మఠానికే చెందాలని భావించారు. ఆ మేరకు జీవో ఎంఎస్‌ నెంబర్‌ 66 విడుదల చేశారు. కానీ నేటికీ ఆ జీవో అమలు కాలేదు. దీనిపై ఇప్పటికీ మఠం ప్రతినిధులు, పీఠాధిపతి స్వామి పూర్ణానంద సరస్వతి పోరాటం చేస్తూనే ఉన్నారు. ఆ క్రమంలో అమరావతి వెళ్లి దేవాదాయశాఖ ఉన్నతాధికారులను కలిస్తే.. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు నుంచి ఎన్‌వోసీ(నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌) తెచ్చుకోండి.. అని వారు సూచించడంతో బిత్తరపోవడం స్వాముల వంతైంది.

భూములు కొట్టేయాలనే వెలగపూడి కుట్ర
పీఠాధిపతి స్వామి పూర్ణానంద ఆరోపణ
అమాయకులైన స్థానికులను రెచ్చగొట్టి మఠం భూములు కొట్టేయాలని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు కుట్ర పన్నారని సాధుమఠం పీఠాధిపతి స్వామి పూర్ణానంద ఆరోపించారు. అందుకు ఆయన సామదానభేద దండోపాయాలు ప్రయోగిస్తున్నారని విమర్శించారు. ఆ భూములపై తమకు ఎటువంటి ఆపేక్ష లేదని, గురుపరంపర పరిరక్షణలో భాగంగానే పోరాడుతున్నామని వివరించారు. జిల్లా అధికారులు వెలగపూడిని చూసి భయపడిపోతున్నారని, చివరికి ఆయనపై ఫిర్యాదు చేసిన తమనే దోషులుగా చూపించే యత్నం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు జోక్యం చేసుకుని మఠం భూములు పరిరక్షించాలని స్వామి పూర్ణానంద కోరారు.


వివాదమేమిటో పరిశీలిస్తాం
కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌
సాధుమఠం భూముల వివాదమేమిటో క్షుణ్ణంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ స్పష్టం చేశారు. వాస్తవానికి ఆ వివాదమేమిటో సోమవారం సాక్షి కథనం చూసే వరకు తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. నిబంధనల మేరకు ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తామని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement