MLA VELAGAPUDI Ramakrishna
-
మఠాన్నే మడతెట్టేయాలని..!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : నగరంలోని కొత్త వెంకోజిపాలెంలో ఉన్న సాధు మఠం భూములపై కొన్నేళ్లుగా పెద్దల కన్నుపడింది. నగరంలో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో హైవేకు ఆనుకుని కీలక ప్రాంతంలో ఉన్న ఈ మఠంపై పట్టు సాధించడానికి ధార్మికవేత్తలు మొదలు టీడీపీ, బీజేపీ నేతలు ప్రయత్నించారు. ఆధ్యాత్మిక సేవ తప్ప రాజకీయంగా, ఆర్ధికంగా పెద్దగా ప్రాబల్యం లేని మఠం స్వాములపై ప్రలోభాల వల విసిరారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ ఆధ్యాత్మిక వేత్త సాధు మఠం స్వాములను కలిసి.. ‘ఇంత విలువైన స్థలాలను ఖాళీగా ఉంచేస్తే ఎలా.. చుట్టూ ప్రహరీ కట్టి వాణిజ్య సముదాయం నిర్మిస్తే ఆదాయం వస్తుంది. మా పీఠం, మీ మఠం కలిసి అలా వాణిజ్య అవసరాలకు కొంత స్థలం వినియోగిద్దాం’.. అని సూచించారు. మఠం స్వాములు స్పందిస్తూ ‘వద్దు స్వామీ.. గురుపరంపరలో భాగంగా వచ్చిన భూములను ఆథ్యాత్మిక అవసరాల కోసమే వినియోగిస్తామని’ చెప్పి ఆయనకో నమస్కారం పెట్టేశారు. కొన్నాళ్ల కిందట జిల్లా తెలుగుదేశం పార్టీ కీలక ప్రజాప్రతినిధి సతీమణి.. సాధు మఠం స్వాములను పిలిపించుకున్నారు. ‘ఏడెకరాలకు పైగా స్థలముంది కదా.. అందులో రెండు ఎకరాలను మా ట్రస్ట్‌కు ఇవ్వండి.. మేం కూడా సర్వీస్ చేస్తాం. రాజకీయంగా, ఆర్ధికంగా మీకు అండగా ఉంటాం.. ఇక మీ జోలికి ఎవ్రూ రారు’.. అని ఓ ప్రతిపాదన చేశారు. దానికి కూడా స్వాములు అంగీకరించలేదు. ఓ దండం పెట్టి బయటకొచ్చేశారు. ఇక ఇటీవల బీజేపీ ప్రతినిధి, పార్టీ నేతలు కలిసి.. ‘మీపై రాజకీయ ఒత్తిళ్లు వస్తున్నాయి కదా.. మేం అండగా ఉంటాం.. ఓ కమిటీ వేయండి.. అందులో మమ్మల్ని సభ్యులుగా చేయండి.. మీ జోలికి ఎవరైనా వస్తే మేం చూసుకుంటాం’.. అని సలహా ఇచ్చారు. మఠంలో రాజకీయ జోక్యం వద్దంటూ స్వాములు దీన్ని కూడా తిరస్కరించారు. ఇలా చాలామంది అడిగారు.. కాదంటే ఊరకున్నారు.. దాంతో ఎవరికీ ఇబ్బంది లేదు. కానీ టీడీపీకి చెందిన విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు స్టైలే వేరు. తన ఇలాకాలో విలువైన స్థలం సాధువులపరమైతే ఎలా.. తనకేమీ ఉపయోగం లేకుంటే ఎందుకు.. అని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా సామాజికవర్గ కోణంలో స్థానికులను రెచ్చగొట్టారు. ఇందుకు తన అనుచరుడు కాళ్ల శంకర్‌ను పావుగా వాడుకున్నారు. శ్మశానానికి దారి పేరిట వివాదం రేపారు. అధికారులు జోక్యం చేసుకుని సరిదిద్దలేని ప్రత్యేక పరిస్థితి సృష్టించారు. మరోవైపు దేవాదాయ శాఖ అధికారులపై ఒత్తిడి తెచ్చి మఠం ప్రాంగణంలోని దేవాలయాలు సాధువులపరం కాకుండా ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నారు. వెలగపూడి ఓకే అంటేనే.. భూములను సాధు మఠానికి అప్పగించే సమయంలో దాతలు ఆ భూముల్లో దేవాలయాలు నిర్మించి ప్రజలకు జ్ఞానతత్వాన్ని అందించాలని ఆకాంక్షించారు. ఆ మేరకు అక్కడ దేవాలయాలు నిర్మించి వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆశ్రమ నిర్వహణకు వినియోగిస్తున్నారు. కానీ కొన్నేళ్ల కిందట మఠం ప్రాంగణంలోని ఆలయాలను దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకోవడంతో మఠం ప్రతినిధులు ఎండోమెంట్ ట్రిబ్యునల్‌కు వెళ్లారు. సాధుమఠంలో దేవాదాయ శాఖ జోక్యం వద్దని ట్రిబ్యునల్ స్పష్టంగా పేర్కొంది. ఈ తీర్పుపై దేవాదాయ అధికారులు హైకోర్టుకు వెళ్లారు. అక్కడా మఠానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఆ తీర్పు అమలుకాకపోవడంతో స్వాములు కోర్టు ధిక్కార పిటిషన్ వేశారు. ప్రస్తుతం అది పెండింగ్‌లో ఉంది. కాగా 2017లో దేవాదాయ శాఖ అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్ మఠాన్ని సందర్శించారు. ఆశ్రమ నిర్వహణను పరిశీలించి ఆలయాల ఆదాయం మఠానికే చెందాలని భావించారు. ఆ మేరకు జీవో ఎంఎస్ నెంబర్ 66 విడుదల చేశారు. కానీ నేటికీ ఆ జీవో అమలు కాలేదు. దీనిపై ఇప్పటికీ మఠం ప్రతినిధులు, పీఠాధిపతి స్వామి పూర్ణానంద సరస్వతి పోరాటం చేస్తూనే ఉన్నారు. ఆ క్రమంలో అమరావతి వెళ్లి దేవాదాయశాఖ ఉన్నతాధికారులను కలిస్తే.. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు నుంచి ఎన్వోసీ(నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) తెచ్చుకోండి.. అని వారు సూచించడంతో బిత్తరపోవడం స్వాముల వంతైంది. భూములు కొట్టేయాలనే వెలగపూడి కుట్ర –పీఠాధిపతి స్వామి పూర్ణానంద ఆరోపణ అమాయకులైన స్థానికులను రెచ్చగొట్టి మఠం భూములు కొట్టేయాలని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు కుట్ర పన్నారని సాధుమఠం పీఠాధిపతి స్వామి పూర్ణానంద ఆరోపించారు. అందుకు ఆయన సామదానభేద దండోపాయాలు ప్రయోగిస్తున్నారని విమర్శించారు. ఆ భూములపై తమకు ఎటువంటి ఆపేక్ష లేదని, గురుపరంపర పరిరక్షణలో భాగంగానే పోరాడుతున్నామని వివరించారు. జిల్లా అధికారులు వెలగపూడిని చూసి భయపడిపోతున్నారని, చివరికి ఆయనపై ఫిర్యాదు చేసిన తమనే దోషులుగా చూపించే యత్నం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు జోక్యం చేసుకుని మఠం భూములు పరిరక్షించాలని స్వామి పూర్ణానంద కోరారు. వివాదమేమిటో పరిశీలిస్తాం కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ సాధుమఠం భూముల వివాదమేమిటో క్షుణ్ణంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ స్పష్టం చేశారు. వాస్తవానికి ఆ వివాదమేమిటో సోమవారం సాక్షి కథనం చూసే వరకు తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. నిబంధనల మేరకు ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తామని చెప్పారు. -
వెలగపూడి.. గో బ్యాక్
ఎమ్మెల్యే డౌన్ డౌన్.. ఎమ్మెల్యే గో బ్యాక్... వెలగపూడి మాకొద్దు.. ఇళ్లమ్ముకుంటున్న వెలగపూడి డౌన్‌డౌన్ అనే నినాదాలతో పెదజాలరిపేట హోరెత్తింది. తమ ప్రాంతంలో ఇతరులకు ఇళ్లు కేటాయించేందుకు ఎంత తీసుకున్నారంటూ స్థానిక మత్స్యకారులు ధ్వజమెత్తారు. పేదలకు కేటాయించాల్సిన ఇళ్లను టీడీపీ కార్యకర్తలకు, బినామీ పేర్లతో అనర్హులకు కట్టబెట్టడం సరికాదంటూ ఘెరావ్ చేశారు. ఇన్నాళ్లూ అండగాఉన్న తమకే మొండిచేయి చూపారంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యేగా గెలిపించినందుకు ఇంత మోసం చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెదవాల్తేరు (విశాఖ తూర్పు) : పెదజాలరిపేటలో ఇటీవలే రోడ్డుపక్కనే ఉన్న 72 షెడ్లను తొలగించారు. ఇక్కడ పీఎంఏవై–ఎన్టీఆర్ నగర్ పేరిట రూ.7.75 కోట్లతో జీ ప్లస్ 2 కింద 120 ఇళ్ల నిర్మించనున్నారు. షెడ్లు కోల్పోయిన 72 మందికి పోనూ మిగిలిన వాటిని మత్స్యకారులకు కేటాయించాలని ప్రతిపాదించారు. తమ కాలనీలో నిర్మిస్తున్నందున ఇక్కడి పేదలకే ఇవ్వాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. పైగా షెడ్లు కోల్పోయిన 72 మందికి వాంబే కాలనీలో గతంలో ఇళ్లు కేటాయించా రని, ఇప్పుడు మళ్లీ వారికే ఏ విధంగా ఇక్కడ ఇళ్లు నిర్మిస్తారంటూ వారు ప్రశ్నిస్తున్నారు. కొత్తగా మంజూ రైన గృహసముదాయాలకు శంకుస్థాపన చేసేందుకు తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పార్టీ నేతలు, అధికారులతో కలిసి ఆదివారం వెళ్లారు. స్థానిక మత్స్యకారులు ఎమ్మెల్యేను చుట్టుముట్టి ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాలనీ పెద్ద తెడ్డు పరసన్న నాయకత్వంలో ఎమ్మెల్యే శంకుస్థాపన చేయకుండా అడ్డుకున్నారు. గృహాల మంజూరులో ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారని, అధికారులు, అధికార పార్టీ నేతలు కుమ్మక్కై పేద మత్స్యకారులకు అన్యాయం చేస్తున్నారంటూ ఆరోపించారు. అక్కడ అద్దెకు ఇస్తూ... ఇక్కడ ఇల్లా.. మధురవాడ వాంబే కాలనీలో ఇళ్లు పొందిన చాలా మంది రుణాలు చెల్లించారని, కొందరు గృహాలను విక్రయించేశారని మత్స్యకారులు చెబుతున్నారు. మిగిలిన వారు అక్కడి ఇళ్లను అద్దెలకిచ్చేసి పెదజాలారిపేటలో రేకుల షెడ్లు వేసుకుని ఉంటున్నారన్నారు. వీరు ఇప్పుడు ఇళ్లు పొందడంపై మత్స్యకారులు మండిపడ్డారు. జీవీఎంసీ రూపొందించిన జాబితాలో ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఉండడం విచారకరమన్నారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి ఒకే కుటుంబానికి రెండో ఇల్లు కేటాయించడం అన్యాయమన్నారు. చేపల వేటపై ఆధారపడి బతుకుతున్న మత్స్యకారులను కాదని ఎక్కడి నుంచో వచ్చిన వారికి పక్కాఇళ్లు ఎలా కేటాయిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ 1984, 1991 సంవత్సరాలలో కేటాయించిన పక్కాఇళ్లలో మూడేసి కుటుంబాలు చాలీచాలని గదుల్లో ఉంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సునామీ తరువాత ప్రభుత్వం 103 పక్కా ఇళ్లు కేటాయించినా.. ఇప్పటివరకు నిర్మాణాలకు నోచుకోలేదన్నారు. రాత్రి దండోరా ఎమ్మెల్యే శంకుస్థాపన విషయమై అటు జీవీఎంసీ అధికారులు గాని, ఇటు ఎమ్మెల్యే వర్గీయులు గాని స్థానిక మత్స్యకార నాయకులకు సమాచారం ఇవ్వకపోవడం తీవ్ర దుమారం రేపుతోంది. ఇక్కడ ఏ చిన్న కార్యక్రమం నిర్వహించినా ముందుగా చెప్పే నాయకులు, అధికారులు ఇప్పుడు సమాచారం ఇవ్వకపోవడంలో ఆంతర్యం ఏమిట ని స్థానిక నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మె ల్యే శంకుస్థాపన అడ్డుకోవాలం టూ పెదజాలారిపేట కాలనీలో శనివారం ర్రాతి దండోరా వేశారని చెబుతున్నారు. ఎప్పుడైనా మా ప్రాంతానికి వచ్చారా? వరుసగా రెండుసార్లు మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే మీరు ఈ విధంగా చేస్తారా? అంటూ ఎమ్మెల్యేను మత్స్యకార మహిళలు నిలదీశారు. పదవిలోకి వచ్చిన తర్వాత మీ నియోజకవర్గంలో తమ ప్రాంతం ఉందన్న విషయాన్నే మర్చిపోయారని, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఇక్కడకు వచ్చారంటూ కడిగిపారేశారు. వెనుకబడిన జాలరిపేట అభివృద్ధికి ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ ఒక్క ప్రభుత్వ పథకం తమకు అందడం లేదని, మీ మంది మాగాదులే పంచుకుతింటున్నారని ధ్వజమెత్తారు. అద్దెకొంపలు, పూరి గుడెశల్లో నివసిస్తున్న తాము కనిపించడం లేదా మీకు..? ఎక్కడి నుంచో వచ్చిన వారికి ఇక్కడ ఇళ్లు నిర్మిస్తారా అంటూ ఎమ్మెల్యేను నిలదీశారు. వాంబే కాలనీలో ఇళ్లు మంజూరైన వారు అక్కడ వద్దని ధృవీకరణ పత్రం ఇస్తేనా ఇక్కడ ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే నచ్చజెప్పే ప్రయత్నం చేసినా మత్స్యకారులు ససేమిరా అన్నారు. ఇక్కడ ఏ ఒక్క ఇల్లు నిర్మించినా మత్స్య కారులకే ఇవ్వాలని లేకుంటే ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ మత్స్యకారులు ఆయనపై దూసుకెళ్లారు. పోలీసులు, టీడీపీ నేతలు ఎమ్మెల్యేకు రక్షణవలయంగా నిలబడి మత్స్యకారులను నిలువరించే ప్రయత్నం చేశారు. అయినా వారు తమ ఆందోళనను విరమించలేదు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో శంకుస్థాపన చేయకుండానే ఎమ్మెల్యే అక్కడ నుంచి వెనుదిరిగాల్సి వచ్చింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎంవీపీ సీఐ మళ్ల మహేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్ఐలు, కానిస్టేబుళ్లు బందోబస్తు ఏర్పాటు చేశారు. నాలుగు దశాబ్దాలుగా ఉంటున్నాం మేము పెదజాలారిపేటలో గత 40 సంవత్సరాలుగా నివసిస్తున్నాం. సునామీకి ఎంతగానో నష్టపోయాం. అప్పట్లో కేటాయించిన పక్కాఇళ్లు ఇప్పటికీ నిర్మించలేదు. ఇప్పుడేమో స్థానికేతరులకు రెండోసారి ఇళ్లు ఇస్తామనడం అన్యాయం. – ఎన్.నల్లమ్మ, పెదజాలారిపేట సునామీ ఇళ్లు నిర్మించాలి మత్స్యకారులంతా ఇక్కడ చేపల వేటే జీవనాధారంగా బతుకుతున్నారు. మత్స్యకారులకు వేరేచోట ఇళ్లు ఇస్తే కుటుంబ పోషణ కష్టతరంగా ఉంటుంది. సునామీ తరువాత మంజూరు చేసిన 103 ఇళ్ల నిర్మాణం ఇక్కడే చేపట్టాలి. స్థానికేతరుల కారణంగా మత్స్యకారులకు అన్యాయం చేయవద్దు. – పి.పైడిరాజు, కాలనీ పెద్ద, పెదజాలారిపేట -
నరకం చూపించారు..
నవ నిర్మాణ దీక్ష ముగింపు కార్యక్రమంలో అధికారులు, సామాన్యుల పాట్లు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఉక్కపోతలో అవస్థలు విశాఖపట్నం: నవ నిర్మాణ దీక్ష పేరుతో వారం రోజులపాటు అధికారులు, సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రారంభం నుంచి దీక్షలను విజయవంతం చేయడానికి అధికారులు నానా పాట్లు పడ్డారు. ఎలాగో చివరి ఘట్టానికి చేరుకున్నారు. ఆఖరి రోజు మహా సంకల్ప దీక్ష అంటూ ముఖ్యమంత్రి కడప నుంచి ప్రత్యక్ష ప్రసారంలో ప్రతిజ్ఞ చేయిస్తారని, అందరూ అదే సమయంలో ప్రతిజ్ఞ చేయాలని చెప్పారు. దీంతో సంకల్ప దీక్ష సమయానికి జనాన్ని అందుబాటులో ఉంచేందుకు అధికారులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. సామాన్యులతోపాటు, అధికారులు కూడా గంటల తరబడి నిరీక్షణతో నరకం చూశారు. నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి డ్వాక్రా మహిళలను ఆంధ్ర విశ్వవిద్యాలయం కాన్వొకేషన్ హాల్‌కు తరలించారు. వారితోపాటు సామాన్య ప్రజలను మధ్యాహ్నం ఒంటి గంటకే హాలులో కూర్చోబెట్టారు. అప్పటి నుంచి వారంతా అదే హాల్లో మగ్గిపోయారు. సాంస్కృతిక కార్యక్రమాలు కొంతసేపు అలరించాయి. జీవీఎంసీ, వుడా అధికారులు తాము చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇస్తూ కొన్ని గంటల సమయాన్ని గడిపారు. ఆ తర్వాత జిల్లా స్థాయి అధికారులు ప్రసంగించారు. అప్పటికే సాయంత్రం 4 గంటలు అయ్యింది. అప్పటికే అలసిపోయిన మహిళలు తిరిగి ఇళ్లకు వెళ్లే సమయం కూడా కావడంతో వెనుదిరిగిపోవాలా లేక ఉండాలా అనే సందిగ్ధంలో పడ్డారు. దీంతో నిశ్శబ్దంగా ఉండాలని, ఓపిక వహించాలని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, వుడా వీసీ బాబూరావునాయుడు పలుమార్లు చెప్పారు. సాయంత్రం 5 గంటలకు సీఎం చంద్రబాబు కడప నుంచి ప్రత్యక్ష ప్రసారంలో సంకల్పదీక్ష ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమం మొత్తం ముగిసే సరికి సాయంత్రం 6.30 దాటిపోయింది. ఈ ముచ్చట కోసం అన్ని గంటల పాటు కూర్చోబెట్టేశారని రుసరుసలాడుతూ మహిళలు హుటాహుటిన బయలుదేరి ఆటోలు, బస్సులు పట్టుకుని ఇళ్లకు వెళ్లారు. వారితోపాటు అధికారులు, పోలీసులు కూడా ఈసురోమంటూ నిష్ర్కమించారు.