నిరసన తెలుపుతున్న మత్స్యకారులు
ఎమ్మెల్యే డౌన్ డౌన్.. ఎమ్మెల్యే గో బ్యాక్... వెలగపూడి మాకొద్దు.. ఇళ్లమ్ముకుంటున్న వెలగపూడి డౌన్‌డౌన్ అనే నినాదాలతో పెదజాలరిపేట హోరెత్తింది. తమ ప్రాంతంలో ఇతరులకు ఇళ్లు కేటాయించేందుకు ఎంత తీసుకున్నారంటూ స్థానిక మత్స్యకారులు ధ్వజమెత్తారు. పేదలకు కేటాయించాల్సిన ఇళ్లను టీడీపీ కార్యకర్తలకు, బినామీ పేర్లతో అనర్హులకు కట్టబెట్టడం సరికాదంటూ ఘెరావ్ చేశారు. ఇన్నాళ్లూ అండగాఉన్న తమకే మొండిచేయి చూపారంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యేగా గెలిపించినందుకు ఇంత మోసం చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెదవాల్తేరు (విశాఖ తూర్పు) : పెదజాలరిపేటలో ఇటీవలే రోడ్డుపక్కనే ఉన్న 72 షెడ్లను తొలగించారు. ఇక్కడ పీఎంఏవై–ఎన్టీఆర్ నగర్ పేరిట రూ.7.75 కోట్లతో జీ ప్లస్ 2 కింద 120 ఇళ్ల నిర్మించనున్నారు. షెడ్లు కోల్పోయిన 72 మందికి పోనూ మిగిలిన వాటిని మత్స్యకారులకు కేటాయించాలని ప్రతిపాదించారు. తమ కాలనీలో నిర్మిస్తున్నందున ఇక్కడి పేదలకే ఇవ్వాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. పైగా షెడ్లు కోల్పోయిన 72 మందికి వాంబే కాలనీలో గతంలో ఇళ్లు కేటాయించా రని, ఇప్పుడు మళ్లీ వారికే ఏ విధంగా ఇక్కడ ఇళ్లు నిర్మిస్తారంటూ వారు ప్రశ్నిస్తున్నారు.
కొత్తగా మంజూ రైన గృహసముదాయాలకు శంకుస్థాపన చేసేందుకు తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పార్టీ నేతలు, అధికారులతో కలిసి ఆదివారం వెళ్లారు. స్థానిక మత్స్యకారులు ఎమ్మెల్యేను చుట్టుముట్టి ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాలనీ పెద్ద తెడ్డు పరసన్న నాయకత్వంలో ఎమ్మెల్యే శంకుస్థాపన చేయకుండా అడ్డుకున్నారు. గృహాల మంజూరులో ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారని, అధికారులు, అధికార పార్టీ నేతలు కుమ్మక్కై పేద మత్స్యకారులకు అన్యాయం చేస్తున్నారంటూ ఆరోపించారు.
అక్కడ అద్దెకు ఇస్తూ... ఇక్కడ ఇల్లా..
మధురవాడ వాంబే కాలనీలో ఇళ్లు పొందిన చాలా మంది రుణాలు చెల్లించారని, కొందరు గృహాలను విక్రయించేశారని మత్స్యకారులు చెబుతున్నారు. మిగిలిన వారు అక్కడి ఇళ్లను అద్దెలకిచ్చేసి పెదజాలారిపేటలో రేకుల షెడ్లు వేసుకుని ఉంటున్నారన్నారు. వీరు ఇప్పుడు ఇళ్లు పొందడంపై మత్స్యకారులు మండిపడ్డారు. జీవీఎంసీ రూపొందించిన జాబితాలో ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఉండడం విచారకరమన్నారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి ఒకే కుటుంబానికి రెండో ఇల్లు కేటాయించడం అన్యాయమన్నారు. చేపల వేటపై ఆధారపడి బతుకుతున్న మత్స్యకారులను కాదని ఎక్కడి నుంచో వచ్చిన వారికి పక్కాఇళ్లు ఎలా కేటాయిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ 1984, 1991 సంవత్సరాలలో కేటాయించిన పక్కాఇళ్లలో మూడేసి కుటుంబాలు చాలీచాలని గదుల్లో ఉంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సునామీ తరువాత ప్రభుత్వం 103 పక్కా ఇళ్లు కేటాయించినా.. ఇప్పటివరకు నిర్మాణాలకు నోచుకోలేదన్నారు.
రాత్రి దండోరా
ఎమ్మెల్యే శంకుస్థాపన విషయమై అటు జీవీఎంసీ అధికారులు గాని, ఇటు ఎమ్మెల్యే వర్గీయులు గాని స్థానిక మత్స్యకార నాయకులకు సమాచారం ఇవ్వకపోవడం తీవ్ర దుమారం రేపుతోంది. ఇక్కడ ఏ చిన్న కార్యక్రమం నిర్వహించినా ముందుగా చెప్పే నాయకులు, అధికారులు ఇప్పుడు సమాచారం ఇవ్వకపోవడంలో ఆంతర్యం ఏమిట ని స్థానిక నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మె ల్యే శంకుస్థాపన అడ్డుకోవాలం టూ పెదజాలారిపేట కాలనీలో శనివారం ర్రాతి దండోరా వేశారని చెబుతున్నారు.
ఎప్పుడైనా మా ప్రాంతానికి వచ్చారా?
వరుసగా రెండుసార్లు మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే మీరు ఈ విధంగా చేస్తారా? అంటూ ఎమ్మెల్యేను మత్స్యకార మహిళలు నిలదీశారు. పదవిలోకి వచ్చిన తర్వాత మీ నియోజకవర్గంలో తమ ప్రాంతం ఉందన్న విషయాన్నే మర్చిపోయారని, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఇక్కడకు వచ్చారంటూ కడిగిపారేశారు. వెనుకబడిన జాలరిపేట అభివృద్ధికి ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ ఒక్క ప్రభుత్వ పథకం తమకు అందడం లేదని, మీ మంది మాగాదులే పంచుకుతింటున్నారని ధ్వజమెత్తారు. అద్దెకొంపలు, పూరి గుడెశల్లో నివసిస్తున్న తాము కనిపించడం లేదా మీకు..? ఎక్కడి నుంచో వచ్చిన వారికి ఇక్కడ ఇళ్లు నిర్మిస్తారా అంటూ ఎమ్మెల్యేను నిలదీశారు.
వాంబే కాలనీలో ఇళ్లు మంజూరైన వారు అక్కడ వద్దని ధృవీకరణ పత్రం ఇస్తేనా ఇక్కడ ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే నచ్చజెప్పే ప్రయత్నం చేసినా మత్స్యకారులు ససేమిరా అన్నారు. ఇక్కడ ఏ ఒక్క ఇల్లు నిర్మించినా మత్స్య కారులకే ఇవ్వాలని లేకుంటే ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ మత్స్యకారులు ఆయనపై దూసుకెళ్లారు. పోలీసులు, టీడీపీ నేతలు ఎమ్మెల్యేకు రక్షణవలయంగా నిలబడి మత్స్యకారులను నిలువరించే ప్రయత్నం చేశారు. అయినా వారు తమ ఆందోళనను విరమించలేదు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో శంకుస్థాపన చేయకుండానే ఎమ్మెల్యే అక్కడ నుంచి వెనుదిరిగాల్సి వచ్చింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎంవీపీ సీఐ మళ్ల మహేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు బందోబస్తు ఏర్పాటు చేశారు.
నాలుగు దశాబ్దాలుగా ఉంటున్నాం
మేము పెదజాలారిపేటలో గత 40 సంవత్సరాలుగా నివసిస్తున్నాం. సునామీకి ఎంతగానో నష్టపోయాం. అప్పట్లో కేటాయించిన పక్కాఇళ్లు ఇప్పటికీ నిర్మించలేదు. ఇప్పుడేమో స్థానికేతరులకు రెండోసారి ఇళ్లు ఇస్తామనడం అన్యాయం.
– ఎన్.నల్లమ్మ, పెదజాలారిపేట
సునామీ ఇళ్లు నిర్మించాలి
మత్స్యకారులంతా ఇక్కడ చేపల వేటే జీవనాధారంగా బతుకుతున్నారు. మత్స్యకారులకు వేరేచోట ఇళ్లు ఇస్తే కుటుంబ పోషణ కష్టతరంగా ఉంటుంది. సునామీ తరువాత మంజూరు చేసిన 103 ఇళ్ల నిర్మాణం ఇక్కడే చేపట్టాలి. స్థానికేతరుల కారణంగా మత్స్యకారులకు అన్యాయం చేయవద్దు.
– పి.పైడిరాజు, కాలనీ పెద్ద, పెదజాలారిపేట
Comments
Please login to add a commentAdd a comment