నవ నిర్మాణ దీక్ష ముగింపు కార్యక్రమంలో అధికారులు, సామాన్యుల పాట్లు
మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఉక్కపోతలో అవస్థలు
విశాఖపట్నం: నవ నిర్మాణ దీక్ష పేరుతో వారం రోజులపాటు అధికారులు, సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రారంభం నుంచి దీక్షలను విజయవంతం చేయడానికి అధికారులు నానా పాట్లు పడ్డారు. ఎలాగో చివరి ఘట్టానికి చేరుకున్నారు. ఆఖరి రోజు మహా సంకల్ప దీక్ష అంటూ ముఖ్యమంత్రి కడప నుంచి ప్రత్యక్ష ప్రసారంలో ప్రతిజ్ఞ చేయిస్తారని, అందరూ అదే సమయంలో ప్రతిజ్ఞ చేయాలని చెప్పారు. దీంతో సంకల్ప దీక్ష సమయానికి జనాన్ని అందుబాటులో ఉంచేందుకు అధికారులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. సామాన్యులతోపాటు, అధికారులు కూడా గంటల తరబడి నిరీక్షణతో నరకం చూశారు. నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి డ్వాక్రా మహిళలను ఆంధ్ర విశ్వవిద్యాలయం కాన్వొకేషన్ హాల్‌కు తరలించారు. వారితోపాటు సామాన్య ప్రజలను మధ్యాహ్నం ఒంటి గంటకే హాలులో కూర్చోబెట్టారు. అప్పటి నుంచి వారంతా అదే హాల్‌లో మగ్గిపోయారు. సాంస్కృతిక కార్యక్రమాలు కొంతసేపు అలరించాయి. జీవీఎంసీ, వుడా అధికారులు తాము చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇస్తూ కొన్ని గంటల సమయాన్ని గడిపారు.
ఆ తర్వాత జిల్లా స్థాయి అధికారులు ప్రసంగించారు. అప్పటికే సాయంత్రం 4 గంటలు అయ్యింది. అప్పటికే అలసిపోయిన మహిళలు తిరిగి ఇళ్లకు వెళ్లే సమయం కూడా కావడంతో వెనుదిరిగిపోవాలా లేక ఉండాలా అనే సందిగ్ధంలో పడ్డారు. దీంతో నిశ్శబ్దంగా ఉండాలని, ఓపిక వహించాలని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, వుడా వీసీ బాబూరావునాయుడు పలుమార్లు చెప్పారు. సాయంత్రం 5 గంటలకు సీఎం చంద్రబాబు కడప నుంచి ప్రత్యక్ష ప్రసారంలో సంకల్పదీక్ష ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమం మొత్తం ముగిసే సరికి సాయంత్రం 6.30 దాటిపోయింది. ఈ ముచ్చట కోసం అన్ని గంటల పాటు కూర్చోబెట్టేశారని రుసరుసలాడుతూ మహిళలు హుటాహుటిన బయలుదేరి ఆటోలు, బస్సులు పట్టుకుని ఇళ్లకు వెళ్లారు. వారితోపాటు అధికారులు, పోలీసులు కూడా ఈసురోమంటూ నిష్ర్కమించారు.