సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: టీడీపీ నేత లోకేష్ యువగళం పాదయాత్రపై ఆ పార్టీ నేతలే పెదవిరుస్తున్నారు. తమ నియోజకవర్గాల్లో పాదయాత్ర అవసరం లేదని, రూట్ మ్యాప్ మార్చాలంటూ వేడుకుంటున్నారు. మొదటగా ప్రకటించిన షెడ్యూల్‌లో ఉన్న తమ నియోజకవర్గాలను తప్పించి, కొత్త రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసుకోవాలని తేల్చిచెబుతున్నారు.
పాదయాత్రకు జన సమీకరణ తమ వల్ల కాదని కొందరు అంటుంటే.. పార్టీ అధిష్టానం వైఖరిపై వ్యతిరేకతతో కొందరు ఆసక్తి చూపడం లేదు. ప్రధానంగా మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అలకబూనడంతో నర్సీపట్నం నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర రూట్ మ్యాప్ మారినట్టు ఆ పార్టీలోనే చర్చ జరుగుతోంది. తన కుమారుడికి అనకాపల్లి ఎంపీ సీటుపై స్పష్టత ఇవ్వకపోవడంతో యువగళం పాదయాత్రకు ఆసక్తి చూపడం లేదనే వార్తలు గుప్పుమంటున్నాయి.
మరోవైపు చోడవరం, మాడుగుల నియోజకవర్గాలకు చెందిన నేతలు ‘మా కొద్దీ యువగళం’ అని తెగేసి చెబుతున్నట్టు సమాచారం. ఫలితంగా ఈ మూడు నియోజకవర్గాల్లో యువగళం పాదయాత్ర రద్దు అయినట్టు తెలుస్తోంది. తెలుగు తమ్ముళ్ల నిరాసక్తతో ఉమ్మడి విశాఖ జిల్లాలో యువగళం పాదయాత్ర రూట్‌మ్యాప్‌ను మార్చివేసినట్టు ఆ పార్టీ నేతలే పేర్కొనడం గమనార్హం.
సొంత నేతల నుంచే నిరాసక్తత!
వాస్తవానికి మొదటగా ప్రకటించిన షెడ్యూల్ మేరకు పాదయాత్ర ఉమ్మడి విశాఖ జిల్లాలో పాయకరావుపేట నుంచి కోటవురట్ల మీదుగా నర్సీప ట్నం, చోడవరం, మాడుగుల, అనకాపల్లి, పరవాడ, గాజువాక చేరుకొని, నగరంలోకి ప్రవేశించి, పెందుర్తి మీదుగా భీమిలి చేరుకోవాలి. తాజాగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 11న పాయకరావుపేటలో ప్రవేశించి యలమంచిలి, అనకాపల్లి, పరవాడ, గాజువాక మీదుగా నగరంలోకి ప్రవే శించనుంది. ఈ నెల 20 లేదా 21వ తేదీన భీమిలిలో ముగించాలని నిర్ణయించారు. ఇందులో నర్సీపట్నం, చోడవరంతో పాటు మాడుగుల నియోజకవర్గాలను తీసివేశారు.
ప్రధానంగా తన కొడుకు ఎంపీ టికెట్‌పై పదే పదే అడుగుతున్నప్పటికీ తేల్చకపోవడంతో పాటు కేవలం ఎన్నికలకు ఏడాది ముందు బయటకు వచ్చిన గంటాకు ప్రాధాన్యత పెరగడాన్ని అయ్యన్నపాత్రుడు తీవ్రంగా తప్పుపడుతున్నట్టు తెలుస్తోంది. అనకాపల్లి ఎంపీ టికెట్ ను తన కొడుకుకు కేటాయించాలని కోరినా పట్టించుకోకపోగా.. ఈ స్థానంలో అభ్యర్థి కోసం గంటా కొంతమందితో మాటా మంతీ సాగించడంపై అయ్యన్న తీవ్రంగా తప్పుపడుతున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు చోడవరంలో పాదయాత్ర నిర్వహణకు ఆ పార్టీ ముఖ్యులు ముందుకు రాకపోగా.. మాడుగుల నియోజకవర్గంలో అసలు నేత ఎవరనే చిక్కు వచ్చింది. అంతేకాకుండా అధికార వైఎస్సార్ సీపీ నిర్వహించిన సామాజిక బస్సు యాత్రకు జనం జేజేలు పలకడంతో ముఠాలతో కుస్తీ పడుతున్న టీడీపీ నేతల వైఖరితో ఈ నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహణ కష్టమని పార్టీ పెద్దలు కూడా భావించినట్టు తెలుస్తోంది.
పార్టీ వైఖరిపై కినుక!
వాస్తవానికి అనకాపల్లి ఎంపీ సీటుతో పాటు నర్సీపట్నం ఎమ్మెల్యే టికెట్ కావాలని అయ్యన్నపాత్రుడు పట్టుబడుతున్నారు. అయితే దీనిపై పార్టీ నుంచి సరైన స్పందన లభించలేదు. నర్సీపట్నం టికెట్ ఇస్తాం.. ఎంపీ టికెట్‌పై చూద్దామంటూ దాటవేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అనకాపల్లి ఎంపీ టికెట్ కోసం మాజీ మంత్రి గంటా అభ్యర్థులను అన్వేషిస్తున్నారు.
ఒక ఎన్‌ఆర్‌ఐను బరిలోకి నిలిపేందుకు వెదకడంతో పాటు కొద్ది మందిని పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో అయ్యన్నపాత్రుడు మండిపడుతున్నారు. అంతేకాకుండా నర్సీపట్నం నియోజకవర్గంలో కూడా కొద్ది మంది అసంతృప్తి నేతలను కలిపి పిక్నిక్ తరహాలో వన భోజనాలను గతంలో గంటానే వెనుక ఉండి నిర్వహించేలా చేశారనేది అయ్యన్న అభియోగం.
ఈ విషయాన్ని కూడా పార్టీ అధినేత వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అయినప్పటికీ గంటాను పిలిచి మందలించడం వంటిది చేయకపోవడం అయ్యన్నకు మరింత ఆగ్రహాన్ని తెప్పించిందనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఎన్నికలకు ఏడాది ముందు మాత్రమే గంటా బయటకు రావడాన్ని అయ్యన్నపాత్రుడు బహిరంగంగానే విమర్శించారు.
పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పట్టించుకోని నేతలను దూరం ఉంచాలని.. వారితో జాగ్రత్తగా వ్యవహరించాలని కూడా అయ్యన్న నేరుగా చంద్రబాబుకే స్పష్టం చేశారు. అయినప్పటికీ వైఖరి మారకపోవడంతో అలకబూనినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర నిర్వహణకు పెద్దగా ఆసక్తి చూపలేదని ప్రచారం జరుగుతోంది. మొత్తంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో యువగళం పాదయాత్ర అంటేనే ఆ పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది.
లోకేష్ యువగళం పాదయాత్రకు ఆ పార్టీ నేతలే ఆసక్తి చూపడం లేదు. తమ నియోజకవర్గాల్లో వద్దు బాబోయ్ అంటూ వేడుకుంటున్నారు. పాదయాత్రకు జనం నుంచి పెద్దగా స్పందన లేకపోవడాన్ని గ్రహించిన ఆ పార్టీ నేతలు.. జన సమీకరణకు వచ్చే ఇబ్బందులను గ్రహించి తమ వద్ద వద్దంటూ తెగేసి చెబుతున్నారు. ఇక తన కొడుకు సీటు విషయంలో కినుక వహించిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ‘మా కొద్దీ యువగళం’ అని స్పష్టం చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఇక చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో పాదయాత్ర నిర్వహణకు ఎవరూ ముందుకు రాలేదని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి: చంద్రబాబు పిచ్చి కూతలు.. రామోజీ చెత్త రాతలు: మంత్రి కాకాణి ఫైర్
Comments
Please login to add a commentAdd a comment