రాళ్లతో కొట్టమని, గాజు గ్లాసుతో పొడవమంటూ టీడీపీ శ్రేణులను రెచ్చగొడుతున్న చంద్రబాబు
సాక్షి, అమరావతి : తీవ్రమైన ఫ్ర్రస్టేషన్ కారణంగా చంద్రబాబు తన పార్టీ శ్రేణులను రెచ్చగొడుతున్నారు. సీఎంను రాళ్లతో కొట్టండి.. అడ్డొచ్చిన వారిని గాజు గ్లాసుతో పొడవండి అంటూ.. పిలుపులిస్తున్నారు. ఈ పిలుపును అందుకుని తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. చంద్రబాబు కుమారుడు లోకేశ్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గం కుంచనపల్లిలో గురువారం ప్రచారంలో ఉన్న వైఎస్సార్‌సీపీ నేతలపై టీడీపీ గూండాలు మూకుమ్మడి దాడికి దిగారు.
ఈ దాడిలో వైఎస్సార్‌సీపీ బూత్ కన్వీనర్ మేకా వెంకటరెడ్డి మృతి చెందడం కలకలం రేపింది. ఓటమి భయంతో లోకేశ్ హింసా రాజకీయాలకు పాల్పడుతున్నట్లు, చంద్రబాబు వ్యాఖ్యలు అందుకు తోడైనట్లు ఈ ఘటన రుజువు చేసింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోనూ గురువారం టీడీపీ గూండాలు రోడ్‌షో చేస్తున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను చంపేందుకు ప్రయత్నించారు.
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి రంగయ్య రోడ్‌షోను టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్ర అనుచరులు అడ్డుకునేందుకు ప్రయత్నించి వీరంగం సృష్టించారు. ఈ దాడిలో నలుగురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు.
శృతిమించిన చంద్రబాబు వ్యాఖ్యలతో దాడులు
చంద్రబాబు శృతి మించి చేస్తున్న వ్యాఖ్యలే ఈ దాడులకు కారణమని సొంత పార్టీ నేతలే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఎంను రాళ్లతో కొట్టాలని చంద్రబాబు బహిరంగ సభలో చెప్పిన తర్వాతే విజయవాడలో సీఎం వైఎస్ జగన్‌పై రాయితో హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఒకపక్క సీఎం జగన్ తన పాలనలో ప్రతి ఒక్కరికీ చేసిన మేలును వివరిస్తూ మీ ఇంటికి మంచి జరిగిందనుకుంటేనే తనకు ఓటు వేయాలని హుందాగా కోరుతుండగా.. ప్రతిపక్ష నేత చంద్రబాబు మాత్రం హింసను ప్రేరేపించడాన్ని టీడీపీ నేతలే తప్పుపడుతున్నారు.
తమ పార్టీ విధానాలను ప్రస్తావించకుండా వ్యక్తిగత దుర్భాషలకు దిగడం ఎన్నికల వేళ పార్టీకి తీవ్ర నష్టం చేకూరుస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘బాబు గారేమిటి ఇలా మాట్లాడుతున్నారు? ఆయనకేమైనా మతి పోయిందా?’ అని అంతర్గతంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఎన్నికలను హింసాత్మకంగా మార్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లు కనబడుతోందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
దున్నపోతు అంటూ దిగజారుడు మాటలు
ఇటీవల రాజధాని ప్రాంతమైన తాడికొండ సభలో ‘ఆ దున్నపోతును మనిషిని ఒక రాయి తీసుకుని ఏది దొరికితే అది తీసుకుని కొట్టండి’ అంటూ చంద్రబాబు రెచ్చగొట్టారు. ముఖ్యమంత్రిని దున్నపోతు అంటూ సంభోదించడం ఏమిటని, ఇలాంటి వ్యాఖ్యలతో రాజకీయ మలి సంధ్యలో చంద్రబాబు మరింత దిగజారిపోతున్నారని టీడీపీ నేతలు వాపోతున్నారు.
ఇటీవలే మరో సభలో గాజు గ్లాసు తీసుకుని పొడవాలంటూ సైగలు చేయటాన్ని చూసి పక్కనున్న నేతలే విస్తుపోయారు. ఈ సమయంలో ఆయన హావభావాలు కూడా నీచంగా ఉన్నాయని తప్పుబడుతున్నారు. ప్రతి సభలో సీఎం జగన్‌పై అక్కసుతో కక్ష పూరితంగా మాట్లాడటం పార్టీకి చాలా మైనస్‌గా మారిందని అంటున్నారు. ప్రసంగాల్లో సైకో అని సంభోదిస్తూ గల్లీ లీడర్‌కంటే దిగజారిపోవటాన్ని ప్రజలు ఎలా సహిస్తారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బాబు తీరుతో నష్టపోతున్నాం
ఒకవైపు సీఎం జగన్ ప్రసంగాలు హుందాగా, పద్ధతిగా, ప్రజల్లో ఆలోచన రేకెత్తించేలా ఉన్నాయి. చంద్రబాబు మాత్రం ఊకదంపుడు ఉపన్యాసాలు, హింసాత్మక వ్యాఖ్యలతో నిండిపోతున్నాయి. వీటన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని, చంద్రబాబు గ్రాఫ్ బాగా పడిపోవడానికి ఆయన దిగజారుడు మాటలే కారణమని టీడీపీ నేతలు అంటున్నారు.
సీఎం జగన్ తన పాలనలో చేసిన మంచి పనులు, సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ, చంద్రబాబు వైఫల్యాలు, పాత మేనిఫెస్టోను చూపించి ఎండగడుతున్నారని, దీనికి సమాధానం చెప్పకుండా చంద్రబాబు అదే పనిగా నోరు పారేసుకోవడం వల్ల ప్రయోజనం ఉండదని పేర్కొంటున్నారు. సీఎం జగన్ మేనిఫెస్టోలను పోల్చి చూపడం, బాబు మోసాలను వివరిస్తున్న విధానం ప్రజల్లోకి బాగా వెళుతోందనే అభిప్రాయం టీడీపీ నేతల్లో ఉంది.
దీనికి కౌంటర్ ఇచ్చే పరిస్థితి తమ పార్టీకి లేకుండా పోయిందని, దానికి తోడు చంద్రబాబు శ్రేణులను రెచ్చగొడుతున్న తీరుతో తాము రాజకీయంగా కోలుకోలేని దెబ్బ తింటున్నామని టీడీపీ సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 40 ఏళ్ల సీనియర్ నాయకుడినని చెప్పుకొనే చంద్రబాబు విజ్ఞత కోల్పోవడం వల్ల ప్రజల్లో బాగా చులకనవుతున్నామని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment