సాక్షి,పాడేరు: నమ్ముకున్న వారిని దగా చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. అవసరం ఉన్నంత వరకు వాడుకుని, తరువాత కరివేపాకులా తీసి పారేయడం ఆయన నైజమని కొందరు టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్త చేశారు. ఈ విషయం తాజాగా అరకులోయ అభ్యర్థి ఎంపికలో మరోసారి రుజువైందన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అరకు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా సివేరి దొన్నుదొర పోటీ చేస్తారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు శనివారం అరకులో జరిగిన రా..కదలిరా సభలో ప్రకటించి, అరకులోయ టిక్కెట్ తమకు ఇస్తారని ఆశలు పెట్టుకుని ఇన్నాళ్లూ పార్టీ కోసం పనిచేసిన వారికి ఝలక్ ఇచ్చారు. టీడీపీ కీలకనేతలు మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు సివేరి అబ్రహంలు ఈ సీటును ఆశించారు.
2019 ఎన్నికల్లో అరకు నుంచి కిడారి శ్రావణ్ పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఆ సమయంలోనే సివేరి అబ్రహంకు 2024 ఎన్నికల్లో అరకు సీటు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే 2019 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన సివేరి దొన్నుదొర టీడీపీలో చేరారు. ఇటీవల టీడీపీ ఇన్‌చార్జిగా దొన్నుదొరకు బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి సివేరి అబ్రహం చంద్రబాబు వైఖరిపై అసంతృప్తితో ఉన్నారు. తనకు ఈ ఎన్నికల్లో న్యాయం చేయాలని టీడీపీ పెద్దల ద్వారా చంద్రబాబుకు అబ్రహం విన్నవించుకున్నారు.
అయితే అరకు అసెంబ్లీ అభ్యర్థిగా సివేరి దొన్నుదొరను ప్రకటించడంతో అబ్రహంతో పాటు శ్రావణ్ నిరాశ చెందారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే శ్రావణ్,అబ్రహంలకు తగిన న్యాయం చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చి వెళ్లిపోయారు. వారి తండ్రులు దివంగత అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలు 2018లో మావోయిస్టుల చేతిలో హత్యకు గురయ్యారు. ఈ రెండు కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటానని అప్పట్లో సీఎం హోదాలో చంద్రబాబు హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో వీరిద్దరికి చంద్రబాబు తగిన న్యాయం చేస్తారని వారి అనుచరులు భావించారు. అయితే వారికి చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు.
టీడీపీ జెండాలను కాళ్లతో తొక్కిన కార్యకర్తలు
సాక్షి పాడేరు: అరకు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా దొన్నుదొరను ఆపార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించడంతో పలువురు టీడీపీ నాయకులు భగ్గుమన్నారు. సభ ముగిసిన వెంటనే సభా ప్రాంగణంలోనే కార్యకర్తలు టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పార్టీ జెండాలను చింపివేసి, కాళ్లతో తొక్కడం చర్చనీయాంశమైంది. గతంలోనూ ఇదే వర్గానికి చెందిన దయానిధి అనే టీడీపీ నాయకుడు సీవేరి అబ్రహంకు అన్యాయం చేశారంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. చంద్రబాబును చెప్పుతో కొడతానని హెచ్చరించడం సంచలనం నృష్టించింది. చంద్రబాబు వైఖరిపై కార్యకర్తల్లో రోజురోజుకు ఆగ్రహ జ్వాలలు మిన్నంటుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment