జూబ్లీహిల్స్ శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయం
సాక్షి, హైదరాబాద్: చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న జూబ్లీహిల్స్ శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ ధర్మకర్తల మండలి ఏర్పాటుకు దేవాదాయ శాఖ నోటిఫికేషన్ విడుదలకు జీవో జారీ చేసింది. మాజీ ఎమ్మెల్యే పి. విష్ణువర్ధన్‌రెడ్డి ఫౌండర్ ట్రస్టీగా కొనసాగుతున్న ఈ ఆలయానికి ధర్మకర్తలి మండలి వేయడం తొలిసారిగా జరుగుతుండటం గమనార్హం. దివంగత మాజీ సీఎల్పీ నేత పి.జనార్ధన్‌రెడ్డి 1993లో స్థాపించిన ఈ దేవాలయానికి దేవాదాయ శాఖ ధర్మకర్తల మండలి ఏర్పాటుకు ఇప్పుడు నోటిఫికేషన్ జారీ చేయడానికి ప్రయత్నిస్తుండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పీజేఆర్ హయాం నుంచి ప్రస్తుత విష్ణువర్ధన్‌రెడ్డి వరకు ఆలయం క్రమశిక్షణకు, శుచి, శుభ్రతకు, పటిష్టమైన కార్యనిర్వహణకు కేరాఫ్‌గా నిలుస్తున్నది.
ఒకే వ్యక్తి పాలనలో ఉండటంతో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా వివాదాలకు దూరంగా ఉంది. ఇప్పుడు ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేస్తే ఏ మేరకు భక్తులు హర్షిస్తారో వేచి చూడాల్సి ఉంది. జూబ్లీహిల్స్ శ్రీ పెద్దమ్మ దేవాలయానికి ధర్మకర్తల మండలి నియామకాన్ని వ్యతిరేకిస్తూ ఆలయ యాజమాన్యం ఎప్పటికప్పుడు మినహాయింపు కోరుతూ వచ్చింది. అయితే 2018 మార్చి 5వ తేదీన మినహాయింపు గడువు ముగిసింది. మరోసారి ట్రస్ట్ బోర్డు వేయకుండా మినహాయింపునివ్వాలంటూ కోరినా ఫలితం దక్కలేదు. వీరి లేఖను మంత్రి తిరస్కరించారు. దీంతో ట్రస్ట్ బోర్డు ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు అయింది.
14 మంది ధర్మకర్తలు...
ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం త్వరలో ట్రస్ట్ బోర్డు ఏర్పాటుకు నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో చైర్మన్ సహా 14 మంది సభ్యులను నియమించేందుకు ఎండోమెంట్ చట్టం వర్తిస్తుంది. ఆలయ ప్రధాన అర్చకులు ఎక్స్ అఫీషియో సభ్యులుగా వ్యవహరిస్తారు. ఎండోమెంట్ చట్టం ప్రకారం ఆలయ ఫౌండర్ ట్రస్టీ చైర్మన్‌గా వ్యవహరించే అవకాశం ఉంటుంది.
6(ఏ) కేటగిరిలో ఆలయం...
జూబ్లీహిల్స్ శ్రీ పెద్దమ్మ దేవాలయాన్ని దేవాదాయ శాఖ 6(ఏ) కేటగిరిలో నమోదు చేసింది. ‘25 లక్షల నుంచి’ రూ.1 కోటి వరకు వార్షిక నికర ఆదాయం ఉన్న ఆలయాలకు ఫస్ట్ గ్రేడ్ ఈవోను, రూ.1 కోటి పైబడి వార్షిక ఆదాయం ఉంటే అసిస్టెంట్ కమిషనర్ పరిధిలోకి, రూ.1 కోటి నుంచి 3 కోట్లలోపు ఆదాయం ఉంటే అసిస్టెంట్ కమిషనర్ హోదా ఈవోను నియమిస్తారు. రూ.3 కోట్లు దాటితే డిప్యూటీ కమిషనర్, రూ.5 కోట్లు పైబడిన ఆలయాలకు జాయింట్ కమిషనర్‌ను నియమిస్తారు. జూబ్లీహిల్స్ శ్రీ పెద్దమ్మ దేవాలయం వార్షిక ఆదాయం రూ.7 కోట్ల వరకు ఉంటుందని అంచనా. హుండీ ఆదాయం నెలకు రూ.37 లక్షల వరకు ఉంటుంది. ఈ ఆలయం ఫస్ట్ గ్రేడ్ ఈవో పరిధిలో ఉంది.
నగరంలోనే పెద్దమ్మ....
జంట నగరాల్లోనే అత్యంత ఆదాయం కలిగిన ఆలయాల్లో జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి ఒకటి. ప్రతి మంగళ, శుక్ర, ఆదివారాల్లో వేలాదిగా భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఆ స్థాయిలోనే హుండీ ఆదాయం కూడా ఉంటుంది. వారానికి రెండుసార్లు ఉచిత అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటారు. ఆభరణాల్లోనే అమ్మవారు పెద్దమ్మలా నిలుస్తున్నారు. సుమారు ఏడెకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయం ఇతర రాష్ట్రాల్లోని భక్తులను కూడా ఆకర్షిస్తుంటుంది. అమ్మవారి ఆశీస్సుల కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు విశేషంగా తరలి వస్తుంటారు.
నిత్య బోనం...
ఎక్కడా లేని విధంగా పెద్దమ్మ దేవాలయం నిత్య బోనాలతో కళకళలాడుతుంటుంది. ముఖ్యంగా మంగళ, శుక్ర, ఆదివారాల్లో అమ్మవారికి బోనం సమర్పించే వారు బారులు తీరుతుంటారు. భక్తులకు చక్కటి వసతులు కూడా ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment