హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మొదటి జాబితాలో అభ్యర్థిని ప్రకటించలేదు. అయితే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న వారిలో మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్‌రెడ్డి, మాజీ ఎంపీ, టీం ఇండియా మాజీ సారథి మొహమ్మద్ అజహరుద్దీన్ ఉన్నారు. తమకే టికెట్ లభిస్తుందనే ధీమాతో ఇదివరకే వారు నియోజకవర్గంలో తమ ప్రచారాలను చేసేసుకుంటున్నారు. ఎవరికివారే తమకే టికెట్ ఖారారు అయిందని, డివిజన్ల నేతలతో మీటింగ్‌లు, బస్తీలు, కాలనీల్లో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మొదటి జాబితాలో తన పేరు వస్తుందని ఆశించిన ఇద్దరికీ నిరాశే ఎదురైంది.
మరో రెండు రోజుల్లో తమకే టికెట్ అని నేతలతో చర్చలు కూడా జరిపారు. అయితే గురువారం కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. మాజీ ఎంపీ అజహరుద్దీన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు జరిగిన అవినీతిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. దీంతో అధిష్టానం అజహరుద్దీన్ సీటు ఇచ్చే విషయంలో పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. అవినీతి మరకతో ఎన్నికల బరిలోకి దిగితే ప్రత్యర్థి పార్టీలు దుమ్మెత్తిపోస్తాయనే ఆందోళన.. ఆలోచనలో పడింది.
దాదాపు లక్షకుపైగా మైనార్టీ ఓట్లు ఉన్న నియోజకవర్గంలో అజహరుద్దీన్ అభ్యర్థి అయితే కాంగ్రెస్ కలిసివస్తుందని, సెటిలర్లు సైతం తమకే మొగ్గు అనే సంబరాల్లో ఉన్న అజహరుద్దీన్ టీం ఇప్పుడు ఇరకాటంలో పడిందనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డికే టికెట్ ఖరారయ్యే అవకాశాలున్నాయని ఆయన వర్గం ధీమా వ్యక్తం చేస్తోంది. మధ్యలో కాంగ్రెస్ అధిష్టానం మరో ట్విస్ట్‌కు తెరలేపింది. ఎంఐఎం నుంచి ఒకసారి, స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన నవీన్‌యాదవ్‌కు ఢిల్లీకి పిలిపించింది.
యువనేతగా బలమైన పోటీనిచ్చే వ్యక్తిగా బలాన్ని తెలుసుకొని పిలిపించారని సమాచారం. అయితే టికెట్ ఇస్తేనే కాంగ్రెస్‌లో ఉంటానని, లేకుండా ఎంఐఎం లేదా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ధీమాగా వారికి చెప్పారని రాజకీయ వర్గాల్లో చర్చలు కొనసాగుతున్నాయి. ఈ సారి తమకు మద్దతు ఇవ్వాలని, ఎంపీ అవకాశం ఇస్తామని చెప్పారట. ఎమ్మెల్యేగానే అవకాశం ఇవ్వాలని కోరారట. కాంగ్రెస్ అధిష్టానం విష్ణు వైపు మొగ్గు చూపుతుందా... మైనార్టీల బలంతో అజహరుద్దీన్‌కే టికెట్ ఇస్తారా.. లేక.. పోటీలో ఉన్న ఇద్దరినీ కాదని.. కొత్త వ్యక్తి ప్రత్యర్థితో బలంగా నిలబడే నవీన్‌యాదవ్ లాంటి వ్యక్తికి చాన్స్ ఇస్తుందా అనే విషయంలో త్వరలో తేలిపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment