peddamma temple
-
Peddamma Temple: అమ్మలగన్నమ్మ.. పెద్దమ్మ
బంజారాహిల్స్: జంట నగరాల్లోనే జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి అటు భక్తుల రాకతోనూ, ఇటు ఆదాయంలోనూ ‘పెద్దమ్మ’గా దినదిన ప్రవర్ధమానమై వర్ధిల్లుతోంది. భక్తుల కోర్కెలు నెరవేర్చడంలోనే కాకుండా హుండీ ఆదాయంలోనూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నెంబర్–1 స్థానంలో కొనసాగుతుంది. తెలంగాణ వ్యాప్తంగా చూస్తే అటు భక్త జనసందోహంలోనూ, ఇటు ఆదాయ ఆర్జనలోనూ పెద్దమ్మ గుడి ఏడో స్థానంలో నిలిచింది. యేటా ఆదాయం పెరుగుతూ భక్తులను మరింతగా ఆకర్షిస్తూ ఈ ఆలయం వెలుగొందుతోంది. పెద్దమ్మ గుడి వార్షిక నికర ఆదాయం రూ.13 కోట్లు ఉండగా ఫిక్స్డ్ డిపాజిట్ల రూపేణా రూ.25 కోట్లు ఉన్నాయి. అమ్మవారికి 15 కిలోల బంగారు వజ్రాభరణాలు ధగధగలాడుతూ భక్తుల కొంగుబంగారం అమ్మవారు కీర్తిప్రతిష్టలను మూటగట్టుకుంటున్నది.ప్రసాద విక్రయాలు, ఆదాయంలో.. హుండీ ఆదాయం ప్రతినెలా రూ.50 నుంచి రూ.60 లక్షల వరకూ వస్తుంది. ప్రసాద విక్రయాల్లోనూ ఈ ఆలయం నెంబర్–1 స్థానంలో ఉంటుంది. రోజుకు 8 క్వింటాళ్ల పులిహోర అమ్ముతుండగా, 12 వేల లడ్డూలు విక్రయిస్తున్నారు. వారంలో మంగళ, శుక్ర, శని వారాల్లో మూడు సార్లు అన్నప్రసాద వితరణ జరుగుతుంది. యేటా మూడు ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. వార్షిక రథోత్సవం, శాకాంబరి ఉత్సవాలు, దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు.. ఈ మూడు పండుగలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఒక్క ఆదివారం రోజే 40 వేల మంది దాకా భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అమ్మవారికి మొక్కలు చెల్లించుకుంటున్నారు. -
విజయదశమి కావడంతో జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో భక్తుల రద్దీ
-
జూబ్లిహిల్స్ పెద్దమ్మ గుడికి పోటెత్తిన భక్తులు
-
జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయానికి ఫుడ్ లైసెన్స్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ప్రముఖ దేవాలయాల్లో భక్తులకు నాణ్యమైన ప్రసాదం అందించేందుకు జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. ఫుడ్ సేఫ్టీ డిజిగ్నేటెడ్ అధికారి సుదర్శన్‌రెడ్డి, జీహెచ్ఎంసీ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ బాలాజీ రాజు ఫుడ్ ఇన్స్పెక్టర్లతో కలిసి హైదరాబాద్‌లో గుర్తించిన ప్రముఖ ఆలయాలను సందర్శించడంతో పాటు కార్యనిర్వహణ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మహంకాళి, బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంతో పాటు జూబ్లీహిల్స్ పెద్దమ్మ దేవాలయం సైతం ఎంపికైంది. సంబంధిత అధికారులు పెద్దమ్మ దేవాలయం ఈవో శ్రీనివాసరాజుతో ఇటీవల సమావేశమై చర్చించారు. ఫుడ్‌సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం దేవాలయాలకు జీహెచ్ఎంసీ జారీ చేసిన ఫుడ్ లైసెన్స్‌లను పెద్దమ్మ దేవాలయానికి సైతం అందజేయనున్నారు. ప్రఖ్యాత ఆలయాల్లో భక్తులకు నాణ్యమైన ప్రసాదాలు అందించే లక్ష్యంతో, ప్రసాదాల నాణ్యతకు సంబంధించి ఐదు అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ లైసెన్స్‌లు జారీ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఫుడ్‌సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఎఫ్ఎస్ఏఐ) ప్రవేశ పెట్టిన బ్లిస్ ఫుల్ హైజనిక్ ఆఫరింగ్ టూ గాడ్(భోగ్) పథకంలో భాగంగా దేవాలయాలకు లైసెన్స్‌ల జారీ చేపట్టినట్లు జీహెచ్ఎంసీ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ బాలాజీ రాజు, సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు. నగరంలో సుమారుగా ఎనిమిది దేవాలయాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటికే బల్కంపేట ఎల్లమ్మ ఆలయం, ఉజ్జయినీ మహంకాళి దేవాలయానికి లైసెన్స్ అందజేసిన అధికారులు పెద్దమ్మ ఆలయానికి త్వరలోనే జారీ చేయనున్నారు. ఇప్పటికే ఫుడ్ ఇన్స్పెక్టర్లు స్వాతి, మౌనిక, లక్ష్మీకాంత్ తదితరుల ఆధ్వర్యంలో ఆయా దేవాలయాల్లో ఈవోలతో సమీక్ష సమావేశం నిర్వహించి నాణ్యమైన ప్రసాదాలపై చర్చలు జరిపారు. ఈ లైసెన్స్ జారీ చేయడం ద్వారా ఇప్పటికే పరిశుభ్రమైన, రుచికరమైన ప్రసాదాలు అందజేస్తున్న ఆలయాలు మరింత నాణ్యమైన ప్రసాదాలను అందజేసేందుకు వీలవుతుంది. ఈ నిర్ణయం పట్ల పెద్దమ్మ భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియకు ఆలయ అధికారులు సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. ఇప్పటికే పెద్దమ్మ గుడి ప్రసాదానికి నగర వ్యాప్తంగా విశేషమైన ఆదరణ ఉన్న నేపథ్యంలో ఈ కొత్త నిబంధనతో భక్తులు మరిన్ని ప్రయోజనాలు పొందనున్నారు. చదవండి: బాలుడిపై దాష్టీకం.. బట్టలూడదీసి, చేతులు కాళ్లు కట్టేసి చిత్ర హింసలు -
ఏసీబీ వలలో పెద్దమ్మగుడి ఈవో
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ శ్రీపెద్దమ్మ దేవాలయం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న సైకం అంజనారెడ్డి అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. అర్చకుడి పదవిని పర్మనెంట్ చేస్తానంటూ రూ.లక్ష డిమాండ్ చేయగా మంగళవారం మధ్యాహ్నం సదరు అర్చకుడు అతడికి నగదు అందజేస్తుండగా అప్పటికే మాటు వేసిన ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. 2017లో పెద్దమ్మ దేవాలయంలో తాత్కాలిక అర్చకుడిగా పని చేస్తున్న ప్రయాగ ఆంజనేయశర్మ ఓ భక్తుడు ఇచ్చిన రూ.50వేల విరాళాన్ని జనరల్ రసీదులో రూ.10వేలుగా రాసి గుడికి చెల్లించి మిగతా రూ.40వేలు నొక్కేశాడు. దీంతో అప్పటి ఈఓ బాలాజీ అతడిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే 2014 కంటే ముందు ఆలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ రెగ్యులరైజేషన్ చేసేందుకు ముఖ్యమంత్రి ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో పెద్దమ్మ గుడిలో అప్పటికే 15 ఏళ్లుగా తాత్కాలిక పూజారిగా పనిచేసిన ఆంజనేయశర్మను రెగ్యులరైజ్ చేయాల్సిందిగా ఉత్తర్వులు అందాయి. ఈ నేపథ్యంలో అతడిని రెగ్యులరైజ్ చేసేందుకు ఈవో అంజనారెడ్డి రూ.5 లక్షలు డిమాండ్ చేశాడు. తాను అంత మొత్తం ఇచ్చుకోలేనని చెప్పడంతో డబ్బులు ఇస్తేనే రెగ్యులరైజేషన్ ఆర్డర్ ఇస్తానంటూ అంజనారెడ్డి ఆంజనేయశర్మను వేధిస్తున్నాడు. దీనికితోడు ఆంజనేయ శర్మ ఖాతాలో పడిన నాలుగు నెలల వేతనం రూ.1.25 లక్షలు కూడా తనకే ఇవ్వాలని ఈవో మెలిక పెట్టాడు. దీంతో రూ.4 లక్షల నగదు, రూ.1.25 లక్షలు వేతనం ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. ఈఓ వేధింపులు తాళలేక బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పక్కా పథకం ప్రకారం అధికారులు మంగళవారం మధ్యాహ్నం బాధితుడు ఆలయంలోని ఈఓ కార్యాలయంలో అతడికి నగదు అందజేస్తుండగా ఏసీబీ సిటీ రేంజ్ డీఎస్పీ సత్యనారాయణ నేతృత్వంలో ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. -
పెద్దమ్మ గుడికి ధర్మకర్తల మండలి.. కోర్టు స్టే
సాక్షి, హైదరాబాద్: శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ ధర్మకర్తల మండలి ఏర్పాటుపై హైకోర్టు స్టే ఇచ్చింది. ట్రస్టు బోర్డు ఏర్పాటును సవాల్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ధర్మకర్తలుగా తమ కుటుంబం ఉండగా ట్రస్ట్ ఎలా ఏర్పాటు చేస్తారని ఆయన పిటీషన్లో పేర్కొన్నారు. సదరు పిటిషన్‌పై విచారించిన కోర్టు పెద్దమ్మ గుడి ట్రస్ట్ బోర్డు ఏర్పాటుపై స్టే విధించింది. దివంగత మాజీ సీఎల్పీ నేత పి.జనార్ధన్‌రెడ్డి 1993లో స్థాపించిన ఈ దేవాలయానికి దేవాదాయ శాఖ ధర్మకర్తల మండలి ఏర్పాటు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పీజేఆర్ హయాం నుంచి ప్రస్తుత విష్ణువర్ధన్‌రెడ్డి వరకు ఆలయం క్రమశిక్షణకు, శుచి, శుభ్రతకు, పటిష్టమైన కార్యనిర్వహణకు కేరాఫ్‌గా నిలుస్తున్నది. ఒకే వ్యక్తి పాలనలో ఉండటంతో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా వివాదాలకు దూరంగా ఉంది. పెద్దమ్మ దేవాలయానికి ధర్మకర్తల మండలి నియామకాన్ని వ్యతిరేకిస్తూ ఆలయ యాజమాన్యం ఎప్పటికప్పుడు మినహాయింపు కోరుతూ వచ్చింది. అయితే 2018 మార్చి 5వ తేదీన మినహాయింపు గడువు ముగిసింది. మరోసారి ట్రస్ట్ బోర్డు వేయకుండా మినహాయింపునివ్వాలంటూ కోరినా ఫలితం దక్కలేదు. దీంతో విష్ణువర్థన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. -
పెద్దమ్మ గుడికి ధర్మకర్తల మండలి?
సాక్షి, హైదరాబాద్: చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న జూబ్లీహిల్స్ శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ ధర్మకర్తల మండలి ఏర్పాటుకు దేవాదాయ శాఖ నోటిఫికేషన్ విడుదలకు జీవో జారీ చేసింది. మాజీ ఎమ్మెల్యే పి. విష్ణువర్ధన్‌రెడ్డి ఫౌండర్ ట్రస్టీగా కొనసాగుతున్న ఈ ఆలయానికి ధర్మకర్తలి మండలి వేయడం తొలిసారిగా జరుగుతుండటం గమనార్హం. దివంగత మాజీ సీఎల్పీ నేత పి.జనార్ధన్‌రెడ్డి 1993లో స్థాపించిన ఈ దేవాలయానికి దేవాదాయ శాఖ ధర్మకర్తల మండలి ఏర్పాటుకు ఇప్పుడు నోటిఫికేషన్ జారీ చేయడానికి ప్రయత్నిస్తుండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పీజేఆర్ హయాం నుంచి ప్రస్తుత విష్ణువర్ధన్‌రెడ్డి వరకు ఆలయం క్రమశిక్షణకు, శుచి, శుభ్రతకు, పటిష్టమైన కార్యనిర్వహణకు కేరాఫ్‌గా నిలుస్తున్నది. ఒకే వ్యక్తి పాలనలో ఉండటంతో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా వివాదాలకు దూరంగా ఉంది. ఇప్పుడు ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేస్తే ఏ మేరకు భక్తులు హర్షిస్తారో వేచి చూడాల్సి ఉంది. జూబ్లీహిల్స్ శ్రీ పెద్దమ్మ దేవాలయానికి ధర్మకర్తల మండలి నియామకాన్ని వ్యతిరేకిస్తూ ఆలయ యాజమాన్యం ఎప్పటికప్పుడు మినహాయింపు కోరుతూ వచ్చింది. అయితే 2018 మార్చి 5వ తేదీన మినహాయింపు గడువు ముగిసింది. మరోసారి ట్రస్ట్ బోర్డు వేయకుండా మినహాయింపునివ్వాలంటూ కోరినా ఫలితం దక్కలేదు. వీరి లేఖను మంత్రి తిరస్కరించారు. దీంతో ట్రస్ట్ బోర్డు ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు అయింది. 14 మంది ధర్మకర్తలు... ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం త్వరలో ట్రస్ట్ బోర్డు ఏర్పాటుకు నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో చైర్మన్ సహా 14 మంది సభ్యులను నియమించేందుకు ఎండోమెంట్ చట్టం వర్తిస్తుంది. ఆలయ ప్రధాన అర్చకులు ఎక్స్ అఫీషియో సభ్యులుగా వ్యవహరిస్తారు. ఎండోమెంట్ చట్టం ప్రకారం ఆలయ ఫౌండర్ ట్రస్టీ చైర్మన్‌గా వ్యవహరించే అవకాశం ఉంటుంది. 6(ఏ) కేటగిరిలో ఆలయం... జూబ్లీహిల్స్ శ్రీ పెద్దమ్మ దేవాలయాన్ని దేవాదాయ శాఖ 6(ఏ) కేటగిరిలో నమోదు చేసింది. ‘25 లక్షల నుంచి’ రూ.1 కోటి వరకు వార్షిక నికర ఆదాయం ఉన్న ఆలయాలకు ఫస్ట్ గ్రేడ్ ఈవోను, రూ.1 కోటి పైబడి వార్షిక ఆదాయం ఉంటే అసిస్టెంట్ కమిషనర్ పరిధిలోకి, రూ.1 కోటి నుంచి 3 కోట్లలోపు ఆదాయం ఉంటే అసిస్టెంట్ కమిషనర్ హోదా ఈవోను నియమిస్తారు. రూ.3 కోట్లు దాటితే డిప్యూటీ కమిషనర్, రూ.5 కోట్లు పైబడిన ఆలయాలకు జాయింట్ కమిషనర్‌ను నియమిస్తారు. జూబ్లీహిల్స్ శ్రీ పెద్దమ్మ దేవాలయం వార్షిక ఆదాయం రూ.7 కోట్ల వరకు ఉంటుందని అంచనా. హుండీ ఆదాయం నెలకు రూ.37 లక్షల వరకు ఉంటుంది. ఈ ఆలయం ఫస్ట్ గ్రేడ్ ఈవో పరిధిలో ఉంది. నగరంలోనే పెద్దమ్మ.... జంట నగరాల్లోనే అత్యంత ఆదాయం కలిగిన ఆలయాల్లో జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి ఒకటి. ప్రతి మంగళ, శుక్ర, ఆదివారాల్లో వేలాదిగా భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఆ స్థాయిలోనే హుండీ ఆదాయం కూడా ఉంటుంది. వారానికి రెండుసార్లు ఉచిత అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటారు. ఆభరణాల్లోనే అమ్మవారు పెద్దమ్మలా నిలుస్తున్నారు. సుమారు ఏడెకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయం ఇతర రాష్ట్రాల్లోని భక్తులను కూడా ఆకర్షిస్తుంటుంది. అమ్మవారి ఆశీస్సుల కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు విశేషంగా తరలి వస్తుంటారు. నిత్య బోనం... ఎక్కడా లేని విధంగా పెద్దమ్మ దేవాలయం నిత్య బోనాలతో కళకళలాడుతుంటుంది. ముఖ్యంగా మంగళ, శుక్ర, ఆదివారాల్లో అమ్మవారికి బోనం సమర్పించే వారు బారులు తీరుతుంటారు. భక్తులకు చక్కటి వసతులు కూడా ఏర్పాటు చేశారు. -
పెద్దమ్మ ఆలయంలో చోరీ
ఇబ్రహీంపట్నం: కరీంనగర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బండలింగాపూర్లోని ఆలయంలో చోరీ జరిగింది. స్థానిక పెద్దమ్మ ఆలయంలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ప్రవేశించి అమ్మవారి నగలను అపహరించుకు పోయారు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. నాలుగు తులాల బంగారు ఆభరణాలతో పాటు వెండి సామాగ్రి చోరీకి గురైనట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.