పెద్దమ్మగుడి ఈఓ అంజనారెడ్డి
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ శ్రీపెద్దమ్మ దేవాలయం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న సైకం అంజనారెడ్డి అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. అర్చకుడి పదవిని పర్మనెంట్ చేస్తానంటూ రూ.లక్ష డిమాండ్ చేయగా మంగళవారం మధ్యాహ్నం సదరు అర్చకుడు అతడికి నగదు అందజేస్తుండగా అప్పటికే మాటు వేసిన ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. 2017లో పెద్దమ్మ దేవాలయంలో తాత్కాలిక అర్చకుడిగా పని చేస్తున్న ప్రయాగ ఆంజనేయశర్మ ఓ భక్తుడు ఇచ్చిన రూ.50వేల విరాళాన్ని జనరల్ రసీదులో రూ.10వేలుగా రాసి గుడికి చెల్లించి మిగతా రూ.40వేలు నొక్కేశాడు. దీంతో అప్పటి ఈఓ బాలాజీ అతడిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే 2014 కంటే ముందు ఆలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ రెగ్యులరైజేషన్ చేసేందుకు ముఖ్యమంత్రి ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో పెద్దమ్మ గుడిలో అప్పటికే 15 ఏళ్లుగా తాత్కాలిక పూజారిగా పనిచేసిన ఆంజనేయశర్మను రెగ్యులరైజ్ చేయాల్సిందిగా ఉత్తర్వులు అందాయి. ఈ నేపథ్యంలో అతడిని రెగ్యులరైజ్ చేసేందుకు ఈవో అంజనారెడ్డి రూ.5 లక్షలు డిమాండ్ చేశాడు.
తాను అంత మొత్తం ఇచ్చుకోలేనని చెప్పడంతో డబ్బులు ఇస్తేనే రెగ్యులరైజేషన్ ఆర్డర్ ఇస్తానంటూ అంజనారెడ్డి ఆంజనేయశర్మను వేధిస్తున్నాడు. దీనికితోడు ఆంజనేయ శర్మ ఖాతాలో పడిన నాలుగు నెలల వేతనం రూ.1.25 లక్షలు కూడా తనకే ఇవ్వాలని ఈవో మెలిక పెట్టాడు. దీంతో రూ.4 లక్షల నగదు, రూ.1.25 లక్షలు వేతనం ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. ఈఓ వేధింపులు తాళలేక బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పక్కా పథకం ప్రకారం అధికారులు మంగళవారం మధ్యాహ్నం బాధితుడు ఆలయంలోని ఈఓ కార్యాలయంలో అతడికి నగదు అందజేస్తుండగా ఏసీబీ సిటీ రేంజ్ డీఎస్పీ సత్యనారాయణ నేతృత్వంలో ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.
Comments
Please login to add a commentAdd a comment