
సాక్షి, న్యూఢిల్లీ: సదావర్తి భూముల వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. వందల కోట్ల విలువైన భూములను కారు చౌకగా కట్టబెట్టేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టడం, కోర్టుల జోక్యం, రెండుసార్లు వేలం వంటి పరిణామాల నేపథ్యంలో.. తమిళనాడు తెరపైకి రావడంతో అసలు భూములెవరివో తేల్చాలంటూ సుప్రీంకోర్టు పరోక్షంగా స్పష్టం చేసింది. ఈ భూములు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖవి కావని, తమకు చెందినవని, అందువల్ల వేలం నిర్వహిం చరాదంటూ తమిళనాడు చేసిన వాదనలను పరిగణనలోకి తీసుకున్న సర్వోన్నత న్యాయస్థానం దీన్ని మళ్లీ విచారించి పరిష్కరించాలని హైకోర్టుకు సూచించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు ఎ.ఎం.ఖన్విల్కర్, డీవై చంద్రచూడ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. భూముల వేలం కేసును ఇంతటితో ముగిస్తున్నట్టు పేర్కొంది. తమిళనాడులోని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖకు చెందిన వందల కోట్ల విలువ చేసే సదావర్తి సత్రం భూముల (ఇవి తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి)ను నిబంధనలు ఉల్లంఘించి, ఒక పథకం ప్రకారం అధికార పార్టీ నేతలకు రూ.22 కోట్ల నామమాత్రపు ధరకు దక్కేలా వ్యవహరించారని ఆరోపిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గతంలో హైకోర్టును ఆశ్రయించారు.
ఈ నేపథ్యంలో రూ.27 కోట్లను కనీస ధరగా నిర్ణయించి తిరిగి వేలం పాట నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆదేశాలను సవాలు చేస్తూ తాము నిబంధనల ప్రకారమే రూ.22 కోట్లకు వేలం పాడామని, తమకే చెందేలా ఆదేశాలు ఇవ్వాలని తొలి వేలంలో భూము లను దక్కించుకున్న ఎం.సంజీవరెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇందుకు నిరాకరిం చిన సుప్రీంకోర్టు రెండోసారి వేలానికి అనుమతించింది. దీనికి అనుగు ణంగా దేవాదాయ శాఖ వేలం నిర్వహించగా బహిరంగ వేలంలో మూడింతలు ధర పలికినా.. మొదటి బిడ్డర్ నగదు చెల్లించలేదు. దీంతో తదుపరి బిడ్డర్‌కు అవకాశం దక్కింది. ఈ నేపథ్యంలో శుక్రవారం సుప్రీంకోర్టులో జరిగిన తాజా విచారణలో తొలుత దేవాదాయ శాఖ తరఫు న్యాయవాది ప్రేరణా సింగ్ తాజా పరిణామాలను ధర్మాసనానికి నివేదించారు. మొదటి బిడ్డర్ నగదు చెల్లించ లేకపోయారని, తదుపరి బిడ్డర్ నగదు చెల్లించారని వివరించారు. దీంతో ఇక కేసు ముగించేద్దామని ధర్మాసనం పేర్కొనగా.. తమిళనాడు ప్రభుత్వం తరఫు న్యాయవాది సుబ్రమణ్యం ప్రసాద్ తమ వాదన వినాలని కోరారు. ఈ భూములు తమిళనాడు ప్రభు త్వానివని, అందువల్ల వేలం ప్రక్రియను అంగీకరించరాదని, ఈ మేరకు హైదరాబాద్ లోని హైకోర్టులో మధ్యంతర దరఖాస్తు దాఖలు చేశామని విన్నవించారు.
18 శాతం వడ్డీకి తెచ్చాం..: తొలివేలంలో భూములను కైవసం చేసుకున్న సంజీవరెడ్డి తరఫు న్యాయవాది రామకృష్ణప్రసాద్ వాద నలు వినిపిస్తూ తాము 18 శాతం వడ్డీకి డబ్బు తెచ్చి వేలం పాడి డిపాజిట్ చేశామని, నెలల తరబడి డిపాజిట్ ఉంచుకుని ఇప్పుడు కేవ లం 8 శాతం వడ్డీతో వెనక్కి తిరిగి ఇస్తే తాము నష్టపోతామని, న్యాయం చేయాలని అభ్యర్థిం చారు. సీపీఐ నారాయణ తరఫు న్యాయవాది కె.శ్రవణ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ సీబీఐ విచారణ జరిపించాలని, ఈ మేరకు మధ్యంతర దరఖాస్తు దాఖలు చేశామని చెప్పారు. అయితే ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించేందుకు నిరాకరించింది.
పిటిషనర్‌కు వడ్డీతో చెల్లించండి
అందరి వాదనలు విన్న తర్వాత ఈ కింది ఆదేశాలు జారీ చేయడం సముచితంగా ఉంటుందని భావిస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. ‘పిటిషనర్ సంజీవరెడ్డి డిపాజిట్ చేసిన మొత్తాన్ని 4 వారాల్లోగా వడ్డీతో సహా చెల్లించాలి. రెండో బిడ్డర్ చేసిన డిపాజిట్‌ను దేవాదాయ శాఖ కమిషనర్ తిరిగి చెల్లించాలి. తమిళనాడు తరపు న్యాయవాది సుబ్రమణ్యం ప్రసాద్ చేస్తున్న వాదనను పరిగణనలోకి తీసుకుని ఈ మొత్తం వ్యవహారాన్ని హైకోర్టు మళ్లీ విచారించి పరిష్కరించాలి. అందుకు అనుగుణంగా స్పెషల్ లీవ్ పిటిషన్‌ను, మధ్యంతర దరఖాస్తుల విచారణ ప్రక్రియను ముగిస్తున్నాం..’ అని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment