ఉషా మూల్పూరి
‘నర్తనశాల’ (2018) సినిమా తీసి తల్లిదండ్రులను బాధ పెట్టానని శౌర్య ఫీలయ్యాడు. మా బ్యానర్ నుంచి అలాంటి సినిమా వచ్చినందుకు నిర్మాతగా నేను బాధపడ్డాను. శౌర్య కెరీర్‌లో అది బిగ్గెస్ట్ డిజాస్టర్. ఆ బాధను తీసేసేలా ‘అశ్వథ్థామ’ మంచి సంతోషాన్ని ఇచ్చింది’’ అన్నారు నిర్మాత ఉషా మూల్పూరి (నాగశౌర్య తల్లి). రమణతేజ దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా శంకర్‌ప్రసాద్ సమర్పణలో ఉషా మూల్పూరి నిర్మించిన చిత్రం ‘అశ్వథ్థామ’. నాగశౌర్య ఈ సినిమాకు కథ అందించారు. జనవరి 31న ఈ చిత్రం విడుదలైంది.
ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని చిత్రబృందం చెబుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో నిర్మాత ఉషా మూల్పూరి మాట్లాడుతూ – ‘‘మా చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. కె. రాఘవేంద్రరావుగారు, నందినిరెడ్డిగారు ఫోన్ చేసి అభినందించారు. శౌర్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వస్తున్నాయి. చిత్రం చాలా బాగుందని, ఇంకా మూడు నుంచి నాలుగు వారాలు థియేటర్స్‌లో బాగా ఆడుతుందని డిస్ట్రిబ్యూటర్స్ చెబుతుండటం సంతోషాన్నిచ్చింది. యూత్ బాగా కనెక్ట్ అయ్యారు.
ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాను ఆదరిస్తున్నారు. మనకు ఒక నిర్భయ, దిశ కేసులు తెలుసు. కానీ ‘అశ్వథ్థామ’లో చూపించిన విధంగా కూడా జరుగుతుందని మనలో చాలామందికి తెలియదు. కథ పరంగా శౌర్యకు మంచి స్పందన వస్తోంది. శౌర్య ఇలాంటి కథ రాసినందుకు ఒక నిర్మాతగా కంటే కూడా ఒక తల్లిగా బాగా సంతోషపడుతున్నాను. కథ చెప్పినప్పుడు శౌర్య సామాజిక బాధ్యతతో ఆలోచిస్తున్నాడని మేం ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాం. ‘అశ్వథ్థామ’ చిత్రంతో శౌర్యలోని మాస్ యాంగిల్‌ని ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకున్నారు. కమర్షియల్ హీరోతో సినిమా చేయాలనుకునేవారికి శౌర్య కూడా ఒక మంచి ఆలోచన.
నిజానికి చిన్నప్పటి నుంచి కూడా శౌర్య ఫుల్ మాస్. సాఫ్ట్ క్యారెక్టర్ కాదు. కానీ ఇండస్ట్రీలో క్యూట్ అండ్ లవర్‌బాయ్ అనే పేరు వచ్చింది. శౌర్య అనుకోకుండా ఇండస్ట్రీలోకి వచ్చాడు. హీరో అయ్యాడు. ఇప్పుడు రైటర్ అయ్యాడు. భవిష్యత్‌లో దర్శకుడు అవుతాడేమో ఇప్పుడే తెలియదు. ఇండస్ట్రీకి మేం చాలా ప్యాషనేట్‌గా వచ్చాం. మా బ్యానర్‌లో తర్వాతి చిత్రం వేరే హీరోతో ఉండొచ్చు. మా బ్యానర్‌లో అందరి హీరోలతో సినిమాలు చేయాలనుకుంటున్నాం. మా అబ్బాయి ఒక్కరే హీరో కాదు కదా! రాఘ వేంద్రరావుగారితో శౌర్య సినిమా కోసం చర్చలు జరుగుతున్నాయి’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment