తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు కీలకపాత్ర పోషించారని తెలంగాణ మజ్దూర్ యూనియన్(టీఎంయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వత్థామ పేర్కొన్నారు.
శామీర్‌పేట్ రూరల్: తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు కీలకపాత్ర పోషించారని తెలంగాణ మజ్దూర్ యూనియన్(టీఎంయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వత్థామ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని హకీంపేట్ ఆర్టీసీ డిపో వద్ద టీఎంయూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులు ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారన్నారు.
తెలంగాణ సాధించుకున్న కార్మికులు కష్టించి పనిచేసి సంస్థను లాభాల బాటలోకి తీసుకురావాలని కోరారు. కార్మికులు ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. 15 రోజుల్లో ఉద్యోగుల్లో విభజన జరుగుతుందని ఎలాంటి ఇబ్బందులు తలెత్తవన్నారు. మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే కనకారెడ్డి మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించి ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. డిపోలో ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు.
ఈ సందర్భంగా డిపోనకు చెందిన దాదాపు 350 మంది ఎన్‌ఎంయూ సంఘం నాయకులు, కార్మికులు టీఎంయూలో చేరారు. కార్యక్రమంలో టీఎంయూ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ థమస్‌రెడ్డి, టీఎంయూ డిపో గౌరవ అధ్యక్షుడు వంగ పెంటారెడ్డి, టీఎంయూ నాయకులు ఎం.వి.రెడ్డి, కమలాకర్‌గౌడ్, ప్రసాద్, కృష్ణ, పి.ఆర్.రెడ్డి, రాజిరెడ్డి, చెన్నయ్య, పవన్ తదితరులు పాల్గొన్నారు.