కృపాచార్యుడు | kripacharya | Sakshi
Sakshi News home page

కృపాచార్యుడు

Published Sun, Sep 27 2015 12:25 AM | Last Updated on Sun, Sep 3 2017 10:01 AM

కృపాచార్యుడు

కృపాచార్యుడు

ఐదోవేదం : మహాభారత పాత్రలు - 17
శరద్వంతుడనే గౌతమ వంశీయుడు తపస్సుతో ధనుర్వేదాన్ని నేర్చుకొన్నాడు. కొంతమంది చదువు అంటకపోయినా, ఆటల్లోనో నటనలోనో ఇతర కళల్లోనో రాణించినట్టుగా ఈ గౌతముడికి వేదా భ్యాసమంటే గిట్టేది కాదు గానీ, విలువిద్య అంటే మహాపిచ్చి ఉండేది. తపస్సుతోనే ఆ ధనుర్విద్యలో పారంగతుడయ్యాడు. తపస్సంటే ఇంద్రియాల స్వేచ్ఛను అపహరించడమే; వాటిని అదుపులో పెట్టడమే. ఇంద్రియాలకు రాజు మనస్సు. మనస్సు రెండు రకాలుగా ఉంటుంది: ఇంద్రియ సంబంధమైనది ఒకటి; రెండోది దివ్యమైనది.

పురాణాల్లో కనిపించే ఇంద్రుడు మొదటి రకం మనస్సు, తపస్సును భ్రష్టుపట్టిద్దామన్న యావతో తన ఇంద్రియ రాజ పదవికి ముప్పు రాకుండా చూసుకొనే కరడుగట్టిన స్వార్థం లాగ అనిపిస్తుంది గానీ నిజానికి అది పెట్టేది ఒక గడ్డు పరీక్ష; వేదంలో అవుపించే ఇంద్రుడు రెండో రకం మనస్సు, సాక్షిభూతమూ కూటస్థమూ ధ్రువమూ స్థిరమూ అయిన విజ్ఞానం. మొదటి మనస్సు మానుషమైనదిగా అనిపిస్తుంది; రెండోది దివ్యమైనది. మానుషమైన మనస్సుకు ఏ తపస్సైనా కంటగింపే. ఆ మనస్సు అప్సరసల్ని పంపించి తపస్సును పాడు చేద్దామని చూస్తుంది.

‘ప్సా’ అనే క్రియకు తినడం, అంటే, అనుభవించడం అని అర్థం. ‘అప్సా’ అంటే, అందుచేత, ‘తినకూడనిదీ’, ‘అనుభవించకూడనిదీ’ అని అర్థం. అనుభవించకూడని రసమే ‘అప్సరస’. ఈ అనుభవించకూడని రసమేమిటి? అప్సరసలు ‘అప్సు’, అంటే, నీళ్లల్లోంచి పుట్టారని పురాణాలు ఒక కథను చెబుతాయి. అమృతం కోసం సముద్రాన్ని మధించినప్పుడు విషమూ లక్ష్మీ చంద్రుడూ ఐరావతమూ ఉచ్చైశ్శ్రవమూ మొదలైనవాటితో సహా అప్సరసలు పుట్టుకొచ్చారని ఆ కథ చెబుతుంది.

అమృతం కోసం ప్రయత్నించేవాళ్లకు పైన చెప్పినవన్నీ అడ్డులే. నీళ్లు ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటాయి. అచ్చూ మచ్చూ అలాగే ఎప్పుడూ ఎడతెరిపి లేకుండా ప్రవహించేవి కర్మలు. ఒక పని తరవాత మరో పని వరసగా మీదకు దాడి చేస్తూన్న ట్టుగా వస్తూనే ఉంటుంది ఆపుదల లేకుండా. సంస్కృతంలో ‘అప్పు’లంటే నీళ్లనీ కర్మలనీ రెండు అర్థాలూ ఉన్నాయి. ఇంతకీ అప్సరసలంటే, ఇప్పుడు తేలిం దేమిటంటే, అనుభవించకూడని కర్మఫల రసాలని.

కర్మఫలాలను అనుభవించాలని ఉవ్విళ్లూరితే ఎడతెగని బంధాలనే అప్పుల్లో పీకలదాకా మునిగిపోతాం: జన్మమీద జన్మ పోటీపడ్డట్టుగా ఎడతెరిపి లేకుండా అవశంగా వస్తూనే ఉంటుంది. మనస్సును అదుపులో పెట్టుకొని, తపస్సు చేద్దామని చూసే ప్రతి సాధక రుషికీ ఆ మనస్సే ‘అప్సరసల’ను ఎరగా చూపిస్తూ ఉంటుంది. పురాణాల్లో చెప్పిన ఇటువంటి రుషులందరూ మార్కండేయుడిలాగ అసలు లొంగ కుండానో ఇప్పటి గౌతముడిలాగ తాత్కాలికంగానో కొంతమంది విశ్వామిత్రుడిలాగ చాలాకాలం పాటో లొంగి, పాట్లను పడుతూ ఉంటారు.
 
ఇక్కడ గౌతముణ్ని ఊరిద్దామని వచ్చిన దివ్యకన్య పేరు ‘జానపది’: ‘జానం’ అంటే పుట్టుక. పుట్టుకకు పదం, అంటే, స్థానమైనది ‘జానపది’. పుట్టుకకు స్థానం, అంటే, కారణం తెలివి మాలినతనమనే పాపం. గౌతముడంటే ఇంద్రియాలను బాగా అణిచినవాడని అర్థం. కానీ ఆ జానపదిని చూడగానే అతని ధైర్యం ఆ క్షణంలో సడలిపోయింది. ఇంతలోనే మెలకువను తెచ్చుకొని, విల్లూ అమ్ములూ అక్కడే వదిలేసి, ఎక్కడికో వెళ్లిపోయాడు. అతని ధైర్యం తాత్కాలి కంగా దెబ్బతిన్న కారణంగా అక్కడ ఒక పిల్లాడూ ఒక పిల్లా పుట్టారు.

‘జానపది’ పని అయిపోయింది కాబట్టి ఆవిడా జారుకుంది. అక్కడ ఆ రెల్లుగడ్డి మధ్యలో ఉన్న పసికందుల్ని, వేటకు వెళ్లిన శాంతను మహారాజు చూసి జాలితో వాళ్లను సాకాడు. కనకనే వాళ్లకు ‘కృప’, ‘కృపి’ అనే పేర్లు పెట్టారు. పుట్టిన కొడుక్కి అతని తండ్రి రహస్యంగా వచ్చి విలువిద్యను నేర్పాడు. ‘కృప’ అనే మాటకు జాలి అని అర్థమేగాక, ‘కృప’ అనే ధాతుపరంగా కల్పన చేయడం అన్న అర్థం కూడా ఉంది.

అదీగాక, దౌర్బల్యమనీ సామర్థ్యమనీ కూడా అర్థాలున్నాయి. మనుషుల్ని దౌర్బల్యంగా చేసే సామర్థ్యమున్నది అభూతకల్పనకు లోనుజేసే అవిద్య. అవిద్య మాయకు కూతురు. మాయ మొత్తం లోకంలోని అందర్నీ మోసం చేస్తుంది. మాట వరసకు, ఆకాశానికి ఏ రంగూ లేకపోయినా మనందరికీ నీలంగా అవుపిస్తూ ఉంటుంది. అంతేగాదు, అది మహా నిజమైనట్టు, వినీలాకాశమంటూ కవుల కవిత్వాలూ వినిపిస్తూ ఉంటాయి.

ఆకాశంలో ఎగురుతూండే దుమ్ముకణాల మీద కాంతికిరణాల విక్షేపం వల్ల ఈ రంగు అవుపిస్తుంది. కానీ, ఎంత తెలిసినా, దాన్ని రంగులేనిదానిగా చూడడం నేలమీద తిరిగే మనకు పడదు. అవిద్య అనేది మనిషి మనిషికీ వేరు వేరుగా ఉండే భ్రమ. ఇది అతని స్థాయిని బట్టి మారుతూ ఉంటుంది. అవిద్య అంటే, విద్య లేకపోవడమని అర్థంగాదు. శుభ్రంగా లేనిదాన్ని శుభ్రంగా ఉందను కోవడమూ, మారిపోయేదాన్ని అసలు మారిపోకుండా ఎప్పటికీ ఉంటుందను కోవడమూ, దుఃఖాన్ని సుఖమను కోవడమూ - అన్నీ ఇలాగ తారుమారుగా కల్పించుకొంటూ అనుకోవడమే అవిద్యకు గుర్తు.

మాటవరసకు, పొద్దున్న వండిన అన్నం సాయంత్రానికి పాసిపోతుంది. ఆ అన్నాన్ని తిని పెరిగే ఈ శరీరం ఎప్పుడూ ఉంటుందని ఊహించడం అందరికీ ఉన్న అవిద్యే, తెలివిమాలినతనమే. దీన్ని ఆలోచనతో రూఢి చేసుకొన్న మనిషి మొదట్లో అందరిలాగే శరీరాన్ని నిత్యమని భ్రమపడినా, తాను పోగుచేసుకొన్న జ్ఞానంతో నెమ్మదినెమ్మదిగా దాన్ని పోగొట్టుకోగలుగుతాడు. ఆ విధంగా అవిద్యా స్థాయిల్లో తేడాలుంటాయి.
 
ఈ అవిద్యే మనుషులందరికీ మొదటి ఆచార్యుడు. పాండవులకూ కౌరవులకూ యాదవులకూ అందరికీ కృపాచార్యుడే మొదటి గురువు. ఆ తరవాతనే ద్రోణా చార్యుడి పాఠాలు వచ్చాయి.
 కృపాచార్యుడి తోబుట్టువు కృపి, ద్రోణాచార్యుడికి భార్య అయింది. కృపీ ద్రోణాచార్యుల సంతానమే అశ్వత్థామ. అంచేత, కృపాచార్యుడికి అశ్వత్థామ మేనల్లుడన్నమాట. వీళ్లు ముగ్గురూ అధర్మానికే కొమ్ముకాస్తూ కౌరవులవైపే యుద్ధం చేశారు. దానిలో జరిగిన రెండు అకృత్యాల్లో కృపాచార్యుడూ అశ్వత్థామా భాగస్వాములయ్యారు.

మొదటిది, అభి మన్యుణ్ని ఏకాకిని చేసి ఒకేసారి ఆరుగురు దాడిచేసి చంపడం. అర్జునుణ్ని చంపిగానీ యుద్ధాన్ని విరమించమని శపథం చేసి సుశర్మతో సహా పదివేల మంది అతన్ని దూరంగా తీసుకొనిపోయారు. ఆ సంశప్త కులతో అక్కడ యుద్ధం జరుగుతూన్న ప్పుడు, ద్రోణాచార్యుడు చక్రవ్యూహం పన్నాడు.

దానిలోకి చొరబడడమైతే వచ్చును గానీ బయటపడడం మాత్రం చేతగాదు అభిమన్యుడికి. అయితే, అర్జునుడు సంశప్తకులతో యుద్ధం చేస్తూ ఉండడంతో, ఇక్కడ అభిమన్యుడు వ్యూహంలోకి చొరబడవలసివచ్చింది గత్యంతరం లేక. ద్రోణుడూ అశ్వత్థామా కృపుడూ కృతవర్మా కర్ణుడూ బృహద్బ లుడూ అనే ఆరుగుర్నీ వేరువేరుగా ఓడించాడు అభిమన్యుడు. అప్పుడు ద్రోణుడు విల్లునొకణ్నీ గుర్రాలనొకణ్నీ రథానికి అటుపక్కా ఇటుపక్కా రక్షిస్తూ ఉండే పార్శ్వరక్షకుల్ని ఒక్కణ్నీ పడగొట్ట మని పథకం వేశాడు. కర్ణుడు విల్లు విర గ్గొడితే, గుర్రాల్ని కృతవర్మ చంపాడు; కృపుడు పార్శ్వరక్షకుల్ని మట్టుబెట్టాడు. అలా ఒక్కణ్ని చేసి అభిమన్యుణ్ని చంప డంలో కృపాచార్యుడి చెయ్యి కూడా ఉంది.
 
రెండోది, నిద్రపోతూన్న ఉప పాండవుల్నీ ధృష్టద్యుమ్నుణ్నీ శిఖండినీ చంపడం. దుర్యోధనుడు కూడా చని పోయిన తరవాత, సౌప్తికపర్వంలో అశ్వ త్థామకు సాయపడ్డవాళ్లు కృతవర్మా కృపా చార్యుడూను. సౌప్తిక పర్వమనేది నిద్ర పోతూన్నప్పుడు యోద్ధల్ని పశువుల్ని చంపినట్టు చంపిన కథనాన్ని చెప్పే భాగం. దుర్యోధనుడి చేత చివరి సేనాపతిగా తిలకాన్ని పెట్టించుకొన్న అశ్వత్థామ, తనతోబాటు బతికి ఉన్న కృపుడూ కృతవర్మలతో కలిసి శత్రువులకు అవుపడ కుండా రాత్రి అడవిలో ఒక మర్రిచెట్టు కింద ఉన్నాడు.

వాళ్లిద్దరూ నిద్రపోయారు గానీ అశ్వత్థామకు కునుకు పట్టలేదు. అక్కడ అతను ఒక గుడ్లగూబ ఆ చెట్టు మీదున్న గూళ్లల్లో నిద్రపోతూన్న కాకుల్ని చంపడాన్ని చూశాడు. తాను కూడా తన తండ్రిని చంపిన ధృష్టద్యుమ్నుణ్ని అలాగే చంపాలని నిశ్చయం చేసుకొన్నాడు. ఆ ఆలోచనను విన్న మేనమామ కృపా చార్యుడు బోధ చేశాడు: అద్య స్వప్స్యన్తి పఞ్చాలా విముక్తకవచా విభో విశ్వస్తా రజనీం సర్వే ప్రేతా ఇవ విచేతసః॥యస్తేషాం తదవస్థానాం ద్రుహ్యేత పురుషో నృజుః వ్యక్తం స నరకే మజ్జేదగాధే విపులే ప్లవే॥(సౌప్తికపర్వం 5-13, 14): ఈ రోజు రాత్రి పాంచాలురందరూ గెలిచామన్న ధీమాతో, కవచాలు తీసేసి నిశ్చింతగా నిద్రపోతూంటారు.

ఆ అవస్థలో ఎవడైనా క్రూరుడై ద్రోహం చేస్తే, వాడు ఘోర నరకంలో మగ్గిపోవడం ఖాయం. ఇంత చెప్పినా, మేనల్లుడు మేనమామ మాటను పెడచెవిన పెట్టాడు. అశ్వత్థామ ఒక్కడూ వాళ్ల శిబిరానికి బయలుదేరుతూంటే, కృతవర్మా కృపుడూ సాయంగా వెళ్లారు. శిబిర ద్వారం దగ్గర నిలుచుని, ఎవరైనా పారిపోతూంటే వాళ్లను చంపడానికి సన్నద్ధులై పొంచి కాపలా కాశారు.
 ఇంతగా పాండవులకు విరుద్ధంగా ప్రవర్తించి కూడా చివరికి బతికినవాళ్లు కౌరవుల్లో ఈ ముగ్గురే.

నిజానికి వీళ్లు కౌరవులు కారు, కౌరవుల అధర్మానికి కొమ్ముకాసినవాళ్లు. అశ్వత్థామ ద్రోణా చార్యుడి కొడుకు; కృతవర్మ భోజవంశం వాడైన యాదవుడు; కృపాచార్యుడు గౌతమ వంశంవాడు. అశ్వత్థామ తాను చేసిన జుగుప్సాకరమైన పనివల్ల అడవు ల్లోనే అజ్ఞాతంగా ఇప్పటికీ బతికే ఉన్నాడని చెబుతారు. కృపాచార్యుడు పాండవులతో సంధి చేసుకొని, వాళ్ల దగ్గరే ఉన్నాడు. అభిమన్యుడి భార్య ఉత్తరకు పరీక్షిత్తు పుట్టిన తరవాత, ఆ కుర్రాడికి విలువిద్యను కృపాచార్యుడే నేర్పాడు. అంటే, మొదటి పాఠం మళ్లీ అవిద్యకు ప్రతీక అయిన కృపాచార్యుడిదేనన్నమాట.
 
కృపాచార్యుడిలాగ తన బతుకును పొడిగిస్తూ ఉండడమంటే, ఈ సాపేక్షక ప్రపంచంలో ఈ అవిద్య ఎప్పటికీ లేకుండా పోదని అర్థం. అవిద్యే తప్పుకుంటే, సృష్టిలోని రూపాలన్నీ అరూపమైన పరమాత్మగా అయిపోయి సృష్టి కనుమరుగైపోతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement