
నియమత్ మెహతా దిల్లీలో ఏర్పాటు చేసిన ఫస్ట్ సోలో ఎగ్జిబిషన్ ‘మెరాకీ’కి మంచి స్పందన లభించింది. ‘మెరాకీ’ అనేది గ్రీకు పదం. దీని అర్థం మనసుతో చేయడం. ఈ ఎగ్జిబిషన్‌లోని 27 బ్రాంజ్, హైడ్రో రెసిన్ స్కల్ప్చర్‌లు కళాప్రియులను ఆకట్టుకున్నాయి. మన పౌరాణికాల నుంచి సాల్వడార్ డాలీ, లియోనార్డో డావిన్సీ, లియోనోరా కారింగ్టన్, ఎంఎఫ్ హుసేన్‌లాంటి మాస్టర్‌ల కళాఖండాల వరకు స్ఫూర్తి పొంది ఈ శిల్పాలకు రూపకల్పన చేసింది మెహతా.
బీథోవెన్ సంగీతం, లార్డ్ బైరన్ పదాల ప్రభావం మెహతా శిల్పకళపై కనిపిస్తుంది. లండన్ నుంచి రోమ్ వరకు తాను చూసిన, పరవశించిన ఎన్నో ఆర్ట్ షోల ప్రభావం ఆమె కళాత్మక ప్రయాణాన్ని ప్రకాశవంతం చేశాయి. ఒక చిన్న శిల్పం తయారుచేయడానికి నెల అంతకుమించి సమయం తీసుకుంటుంది. ఎగ్జిబిషన్‌లో అత్యంత ఆకర్షణీయమైన ‘మిస్టర్ సినాట్రా’ శిల్పం రూపొందించడానికి ఆమెకు ఎనిమిది వారాలు పట్టింది. ఎరుపు రంగు జాకెట్‌తో కనిపించే ఈ శిల్పం పాత కాలం బ్రిటిష్ పబ్ నుంచి ఇప్పుడిప్పుడే బయటికి వచ్చిన వ్యక్తిలా కనిపిస్తుంది. ‘మన దేశంలో శిల్పకళకు అత్యంత ఆదరణ ఉంది’ అంటున్న నియమత్ శిల్పకళపై ఆసక్తి ఉన్నవారికి సలహాల రూపంలో తనవంతుగా సహాయం చేస్తోంది.