
భారతంలోని స్త్రీ పాత్రలలో గాంధారిది విశిష్ఠ పాత్ర. రాజభోగాలతో తులతూగవలసిన ఆమెను మానసిక క్షోభ నిరంతరం వెన్నంటింది. తాను పెళ్లాడబోయేది పుట్టుగుడ్డివాడైన ధృతరాష్ట్రుని అని తెలిసి, భర్తకు లేని చూపు తనకు కూడా ఉండనక్కరలేదని తనకు తానే స్వచ్ఛందంగా కళ్లకు గంతలు కట్టుకుంది. అయితే, దీనివల్ల ఆమె ఏమి ప్రయోజనం సాధించిందో అర్థం కాదు. ఒకవేళ పతివ్రతా స్త్రీగా అలా చేసిందే అనుకుంటే, ఆమె కన్న నూటొక్క మంది సంతానం ఏమైపోవాలి? అసలు కౌరవుల పతనానికి వారి తల్లిదండ్రుల మితిమీరిన ప్రేమాభిమానాలే కారణం. పిల్లలు తప్పు చేస్తుంటే, అహంకరిస్తుంటే, విచ్చలవిడితనంతో ప్రవర్తిస్తుంటేæ మురిసిపోతూ చూస్తూ ఊరుకున్నారు గాంధారీ ధృతరాష్ట్రులు. ఫలితం... కురుక్షేత్ర యుద్ధంలో కొడుకులందరూ దిక్కులేని చావుచస్తుంటే ఏమీ చేయలేక నిస్సహాయంగా చూస్తూ ఊరుకుండిపోవలసి వచ్చింది. అప్పటికీ ఆమె తన తప్పిదాన్ని గుర్తించలేదు. భీముని గదాప్రహారానికి తొడలు విరిగి నేలకూలిన కుమారుని చూసి జాలిపడలేదు పైపెచ్చు... ‘ఆ చావు సావదగు ఆ న్నీచునకున్‘ ఆ నీచునికి (అధముడికి) అట్లాంటి చావు తగినదే... అంది. స్వయంగా తన కడుపున పుట్టిన పెద్దకుమారుడు. అసలు ఆ దుర్యోధనుడు నీచుడెలా కాగలిగాడు? పాండవుల వలె కౌరవులు సంస్కారవంతులెలా కాలేకపోయారు?
బిడ్డలకు ప్రథమగురువు తల్లి. తండ్రి జాత్యంధుడు. కన్నతల్లి నేత్రపట్టం గట్టుకుని త్యాగమయ జీవితం గడిపినందువలన ఒనగూడిన ప్రయోజనం ఏ మాత్రమూ భారతమున కానరాదు. మరి కన్నపిల్లల భవిష్యత్తును ఎవరు తీర్చిదిద్దాలి? మేనమామ శకునిపై బడింది. శకుని కుటిలబుద్ధి అతనిని ఆత్మీయుడుగా చేసింది. కురుసార్వభౌముడైన భర్త, మహా బల పరాక్రమవంతులైన నూరుగురు కొడుకులు, అందచందాలలో, ఆస్తి అంతస్తులలో కొడుకులకు ఏమాత్రం తీసిపోని కోడళ్లు, మనవలు, మనవరాళ్లు, ఒక్కగానొక్క కూతురు దుస్సల, అల్లుడు సైంధవుడు... వీరందరి సమక్షంలో రాజమాతగా కలకాలం సుఖశాంతులతో జీవితం వెళ్లబుచ్చవలసిన గాంధారి, దుర్భర గర్భశోకాన్ని ఎందుకు అనుభవించాల్సి వచ్చింది? వందమంది కుమారుల గర్భశోక మొకవైపు, ఉన్న ఒక్క కుమార్తె విధవ కావటం మరోవైపు ఆమెను నిలువునా కుంగదీశాయి. దీని బదులు కురుసార్వభౌముని పట్టమహిషిగా, 100 మంది కోడళ్లకు అత్తగా, రాజమాతగా యుద్ధం ప్రకటించిననాడే నేత్ర పట్టం తీసివేసి దుర్యోధన సార్వభౌముని శిక్షించకల్గిన మాతగా జీవించి ఉంటే, భారతకథ ఏవిధంగా ఉండేదో కదా? అందుకే అన్నారు, బిడ్డలు చెడిపోయారంటే, తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లిదే బాధ్యత. ఎందుకంటే, పిల్లలకు మంచి చెడ్డలు చెప్పకపోవడం ఆమెదే తప్పు కదా..
– డి.వి.ఆర్. భాస్కర్
Comments
Please login to add a commentAdd a comment