ఇథియోపియా, అడిస్ అబాబాకు దక్షిణంగా ఉన్న సోడో ప్రాంతంలోని తియా పురావస్తు ప్రదేశం.. ప్రపంచాన్నే ఆకట్టుకుంటుంది. ఇక్కడ పదుల సంఖ్యలో మెగాలిథిక్ స్తంభాలు.. 12 లేదా 14వ శతాబ్దాల నాటి ఎన్నో కథలను.. ఊహించి చెబుతుంటాయి. అందుకే అవన్నీ మార్మిక సంకేతాలతో మానవ చరిత్రకు వారసత్వ సంపదగా చరిత్రలో నిలిచాయి.
సంక్లిష్టమైన సామాజిక–మతపరమైన పద్ధతుల్లో కొన్ని రకాల చిహ్నాలు.. ఆ శిలాఫలకాలపై చెక్కి ఉన్నాయి. కత్తులు, బొమ్మలు ఇలా ఎన్నో భావనలతో చెక్కిన ఆ స్తంభాలు.. యునెస్కో గుర్తింపును కూడా పొందాయి. అందుకే ఇవన్నీ.. శాస్త్రవేత్తలను, పర్యాటకులను ఇట్టే ఆకర్షిస్తున్నాయి. పురాతన ఇథియోపియన్ సంస్కృతికి చెందిన ఆచారాలకు, నమ్మకాలకు ఇవి నిశ్శబ్ద సాక్ష్యాలుగా నిలిచి ఉన్నాయి. ఈ అమూల్యమైన ప్రదేశాన్ని సంరక్షించడానికి అక్కడి ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంది. ఈ శిలాఫలకాలు, వాటిపైనున్న మార్మిక చిహ్నాలు పురాతన రాతియుగం నాటి పరిస్థితుల్ని సూచిస్తాయి. కానీ ఆ సూచనలు నేటి తరాలకు ఏ మాత్రం అర్థం కాకుండా ఉన్నాయి.
ఇక్కడ మొత్తంగా 36 మెగాలిథిక్ స్తంబాలు ఉన్నాయి. వాటి మీదున్న కత్తుల బొమ్మలు ఏదైనా దైవ శక్తిని లేదా సైనిక శక్తిని సూచిస్తూ ఉండవచ్చని నిపుణుల అంచనా. కానీ దానిపై స్పష్టత లేదు. ఇక ఇతర బొమ్మల విషయానికి వస్తే ఆనాటి జ్యోతిష వివరాలను, ఆనాటి నాగరికత వివరాలను తెలుపుతున్నట్లుగా అనిపిస్తున్నాయని కొందరు పరిశోధకులు అభిప్రాయపడ్డారు. 1930ల వరకు ఈ పురావస్తు ప్రదేశం వెలుగులోకి రాలేదు. ఇథియోపియా ప్రాంతీయ సర్వేల సమయంలో ఫ్రెంచ్ పరిశోధకులు వీటి ప్రాముఖ్యతను గుర్తించి, వీటి వివరాలను ప్రపంచానికి వెల్లడించారు.
ఆ రాతిస్తంభాలన్నీ పురాతన యుగంలో.. అంటే 12 లేదా 14 శతాబ్దంలోని చనిపోయిన పూర్వీకుల జ్ఞాపకార్థం కావచ్చని కొందరు లేదంటే అప్పటి సమూహానికి నాయకుడిగా ఉన్న నాయకుడి గౌరవార్థం కావచ్చని మరికొందరు అంచనా వేశారు. ఆ లెక్కన చూస్తే.. ఇది పురాతన శ్మశానవాటిక కావచ్చని కూడా కొందరి అభిప్రాయం. అయితే ఈ స్తంభాలు వెనుకున్న అసలు కథ ఏమిటి? అన్నది మాత్రం నేటికీ మిస్టరీనే! – సంహిత నిమ్మన
Comments
Please login to add a commentAdd a comment