హిమాలయాలకు చేరువలో ఉన్న భూటాన్‌లో ఏటా పలు పండుగలు, వేడుకలు జరుగుతుంటాయి. ఈ దేశంలో ఎక్కువ మంది బౌద్ధమతానికి చెందిన వారే అయినా, వారు తమ వేడుకలను పురాతన సంప్రదాయాల ప్రకారం నేటికీ జరుపుకుంటూ ఉండటం విశేషం. ఏటా వేసవి ముగిసి వానాకాలం వచ్చే రోజుల్లో వానాకాలానికి స్వాగతం పలుకుతూ ఇక్కడ జరుపుకొనే రెండు వేర్వేరు జాతరలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి.
వీటిలో మొదటిది ‘నిమాలుంగ్ త్షెచు’. ‘త్షెచు’ అంటే జాతర అని అర్థం. భూటాన్ నడిబొడ్డు ఉన్న నిమాలుంగ్ బౌద్ధ ఆరామంలో ఈ వేడుకలను ఘనంగా మూడురోజుల పాటు జరుపుకొంటారు. ఈ ఏడాది జూన్ 14 నుంచి 16 వరకు జరుగుతున్న ఈ వేడుకల్లో ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొంటున్నారు. ఈ జాతరలో సంప్రదాయ నృత్య గానాలతో కోలాహలంగా నిమాలుంగ్ బౌద్ధారమం వరకు ఊరేగింపులు జరుపుతారు. తర్వాత ఆలయంలో ప్రార్థనలు జరిపి, బౌద్ధ గురువుల ఆశీస్సులు తీసుకుంటారు.
ఇదేకాలంలో జరుపుకొనే రెండో జాతర ‘కుర్జే త్షెచు’. ఇది భూటాన్‌లోని కుర్జే పట్టణంలోని కుర్జే బౌద్ధారామంలో ఏటా జూన్ 16న జరుగుతుంది. కుర్జేలోని బౌద్ధారామాన్ని భూటాన్ బౌద్ధులు పవిత్ర క్షేత్రంగా భావిస్తారు. భూటాన్‌లో బౌద్ధమతాన్ని ప్రచారం చేసిన తొలిగురువు పద్మసంభవుడు ఇక్కడ ఎనిమిదో శతాబ్ది ప్రాంతంలో ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన తనువు చాలించిన తర్వాత ఇక్కడ ఆయన భౌతికకాయం ముద్రను రాతిపై శిల్పంగా చెక్కారు.
‘కుర్’ అంటే శరీరం, ‘జే’ అంటే ముద్ర. గురువు శరీర ముద్రను రాతిపై చెక్కి శాశ్వతంగా పదిలపరచడం వల్ల ఈ ప్రదేశానికి కుర్జే అనే పేరు వచ్చింది. ఇక్కడ ప్రస్తుతం ఉన్న ఆరామాన్ని పదిహేడో శతాబ్దిలో నిర్మించారు. ‘కుర్జే త్షెచు’ జాతరలో జనాలు రకరకాల కొయ్య ముసుగులు ధరించి సంప్రదాయ నృత్య గానాలతో ఊరేగింపు నిర్వహిస్తారు. తర్వాత ఆలయం వద్ద ప్రార్థనలు జరుపుతారు. కొయ్యముసుగులు ధరించి ఊరేగింపు జరపడం వల్ల వానాకాలంలో మంచివానలు కురుస్తాయని, తమ పంటలకు దుష్టశక్తుల బెడద ఉండదని నమ్ముతారు.
ఇవి చదవండి: వానా.. వానా.. వల్లప్పా!
Comments
Please login to add a commentAdd a comment