ఒకనాడు రవి అస్తమించని సామ్రాజ్యాన్ని ఏలిన బ్రిటిష్ రాజ్యాన్ని ఇప్పుడు సాలీళ్లు గడగడలాడిస్తున్నాయి. సాలీడు పేరు చెబితేనే బ్రిటిష్ ప్రజలు భయంతో వణుకుతున్నారు. సాలీళ్లలో ‘ఫెన్ రాఫ్ట్ స్పైడర్’ జాతికి చెందిన భారీ సాలీళ్లు ఇళ్లల్లోకి చొరబడి గూళ్లు ఏర్పాటు చేసుకుంటూ, జనాలను బెంబేలెత్తిస్తున్నాయి. మామూలు సాలీళ్లలా ఇవి చిన్నగా ఉండవు. ఏకంగా అరచేతి పరిమాణంలో ఉంటాయి. బ్రిటన్‌లోని సఫోక్, ససెక్స్, నార్ఫోక్ ప్రాంతాల్లో ఈ భారీ సాలీళ్ల బెడద కొద్దిరోజులుగా ఎక్కువైంది. నీటి ఉపరితలంలోను, నేల మీద కూడా జీవించగలిగే ఫెన్ రాఫ్ట్ స్పైడర్ సాలీళ్లలో అరుదైన జాతి. జలాశయాల పర్యావరణాన్ని ఇవి కాపాడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ సాలీళ్లు కీటకాలతో పాటు చిన్న చిన్న చేపలను కూడా తింటాయి. ఇదివరకు ఇవి జలాశయాల పరిసరాల్లోనే కనిపించేవి. ఇప్పుడివి ఇళ్లల్లోకి కూడా చొరబడటమే బెడదగా మారింది.
నల్లులతో నానా యాతన..!
అగ్రరాజ్యం అమెరికాను నల్లులు హడలెత్తిస్తున్నాయి. అమెరికాలోని దాదాపు ఇరవై రాష్ట్రాల్లో ఇటీవలి కాలంలో నల్లుల బెడద విపరీతంగా పెరిగింది. చాలా చోట్ల ఇళ్లు, హోటళ్లు తదితర ప్రదేశాల్లోని మంచాలు, కుర్చీలు, సోఫాల్లోకి చేరిన నల్లులు జనాలను కుట్టి చంపుతున్నాయి.
అమెరికాలో ఎక్కువగా ‘ఆసియన్ లాంగ్‌హార్న్‌డ్ టిక్’ జాతికి చెందిన నల్లులు కొద్దికాలంగా విజృంభిస్తున్నాయి. అమెరికాలో ఈ జాతి నల్లులను తొలిసారిగా 2017 సంవత్సరంలో ఓక్లహామాలో గుర్తించారు. వీటి నిర్మూలనకు ఎన్ని చర్యలు తీసుకున్నా, ఇవి అన్నింటినీ తట్టుకుంటూ ఇప్పుడు ఇరవై రాష్ట్రాలకు విస్తరించాయి. ఈ నల్లులు వ్యాప్తి చేసే లైమ్ వ్యాధి ఇప్పటికే పలువురి ప్రాణాలను బలిగొంది. ఈ నల్లులు లైమ్ వ్యాధికి కారణమయ్యే పరాన్నజీవులను వ్యాప్తి చేస్తాయని అమెరికా పర్యావరణ పరిరక్షణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నల్లి కాటుకు గురైన వారిలో లైమ్ వ్యాధికి గురై, దాదాపు 15 శాతం మంది మృతిచెందినట్లు వైద్యాధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment