1995, ఏప్రిల్ 6.. ఉదయం ఆరు దాటింది. అమెరికా, ఇండియానా రాష్ట్రం జెఫర్సన్ విల్‌లోని క్లార్క్ మెమోరియల్ హాస్పిటల్‌కి.. ఒక్కొక్కరుగా పేషెంట్స్ వస్తూ ఉన్నారు. ‘టామీ బుర్ష్ డిప్యాటిక్’ అనే నిండు గర్భిణి కూడా తన కుటుంబంతో కలసి కాన్పు కోసం వచ్చింది. ఆ ఆసుపత్రి డాక్టర్స్ డ్యూ డేట్ ఏప్రిల్ 6 అని చెప్పడంతో.. అన్నీ సిద్ధం చేసుకుని వచ్చింది టామీ కుటుంబం. నెల తప్పినప్పటి నుంచీ తనకు వైద్యం చేస్తున్న డాక్టర్ డయానా ఒకోన్ పర్యవేక్షణలోనే ఉంది టామీ. అయితే ఆమె భర్త జేమ్స్ టాడ్ కారల్ మాత్రం చాలా కంగారుపడుతూ అటూ ఇటూ తిరుగుతున్నాడు. ఎందుకంటే.. టామీకి అది మూడో కాన్పు. అప్పటికీ రెండేళ్ల క్రితం.. రెండో కాన్పులో బిడ్డ.. పుట్టిన కాసేపటికే చనిపోయాడు. దాంతో.. ‘పుట్టబోయే బిడ్డ ఎలా ఉంటుందో? ఏమవుతుందో’ అనే భయం అతడ్ని వెంటాడసాగింది. ఆ భయం అతడినే కాదు.. టామీతో సహా వెంట వచ్చిన బంధువులందరినీ పట్టుకుంది.
జాయిన్ అయిన రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర వరకూ ప్రసవ వేదన అనుభవించింది టామీ. అప్పటివరకూ తల్లీబిడ్డల హాట్ బీట్స్‌ని గమనిస్తూనే ఉన్నారు డాక్టర్లు. కాన్పు సమయంలో కూడా.. ‘ఏం భయం లేదు లోపల బేబీ ఆరోగ్యంగా ఉంది’ అనే చెప్పారు. సాయంత్రం నాలుగు నలభై రెండు నిమిషాలకు టామీకి బాబు పుట్టాడు. పుట్టబోయే బిడ్డకు ‘లోగాన్ కారల్’ అని పేరుపెట్టాలని ముందే నిర్ణయించుకున్నారు ఆ దంపతులు. కానీ పుట్టిన బిడ్డ లోగాన్‌లో ఎలాంటి చలనం లేదు. దాంతో డాక్టర్ ఓకాన్.. బాబు(లోగాన్ )కు సీపీఆర్ చేయడం మొదలుపెట్టారు. అయినా ఫలితం లేకపోయేసరికి బాబును అత్యవసర గదికి తరలించారు.
ఎన్ని ప్రయత్నాలు చేసినా బిడ్డ గుండె కొట్టుకోలేదు. మెదడులో ఎలాంటి కదలిక లేదు. దాంతో సాయంత్రం 5:15 గంటలకు లోగాన్ కారల్ మరణించినట్లు ప్రకటించారు. పుట్టిన అరగంటలోనే బిడ్డ చనిపోవడం.. ఆ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టేసింది. టాడ్, టామీలు ఆ వార్త వినగానే కుప్పకూలిపోయారు. ఆసుపత్రి సిబ్బంది.. బాబు లోగాన్ ను చివరి చూపు కోసం ఆ కుటుంబీకులకు అందించారు. అనంతరం బాబుతో కలిపి ఫొటోలు తీస్తుండగా.. టామీ సోదరికి ఆ బాబు వెచ్చని ఊపిరి తగిలినట్లు అనిపించింది. ఉలిక్కిపడిన ఆమె.. వెంటనే వైద్యులతో చెప్పింది. కానీ వైద్యులు ఆమె మాటను కొట్టి పారేశారు. మరణించాడని చెప్పిన నలభై నిమిషాల తర్వాత బాబు వేడెక్కడం గమనించిన టామీ సవతి తల్లి.. ఆ విషయాన్ని మరోసారి ఓ నర్సు దృష్టికి తీసుకెళ్లింది.
ఆ నర్సు.. లోగాన్ (బాబు)ను పరిశీలించి.. నాడి చూసింది. బాబు హార్ట్ బీట్‌నూ గమనించింది. ఆ చిన్న గుండె లయ ఆమెకు స్పష్టంగా వినిపించింది. వెంటనే డాక్టర్ ఓకాన్‌ను పిలిచి విషయం చెప్పింది. ఆమె బాబుని చెక్ చేసి.. షాక్ అయ్యింది. బాబు ప్రాణాలతో ఉండటంతో ఆ శుభవార్తను అందరికీ చెప్పింది. అయితే బాబు చనిపోయాడని అప్పటికే ఆరుగురు డాక్టర్స్, ఎనిమిది మంది నర్సులు నమ్మి.. నిర్ధారించిన తర్వాత.. కొన్ని గంటల్లో బాబు తిరిగి బతకడం మిరాకిల్‌గా.. అంతుపట్టని మిస్టరీగా మారిపోయింది.
ఆ రోజు మొదలు లోగాన్ ‘మిరాకిల్ బేబీ’గా వార్తల్లోకి ఎక్కాడు. ‘అన్‌సాల్వ్‌డ్ మిస్టరీస్’, ‘ఇట్స్ ఎ మిరాకిల్’ వంటి ఎన్నో స్పెషల్ ప్రోగ్రామ్స్‌లో.. లోగాన్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. అయితే బాబు పుట్టుక నుంచీ మానసిక సమస్యలతో బాధపడుతూ.. వీల్ చైర్‌కే పరిమితం అయ్యాడు. అయినా తన కుటుంబంతో సంతోషకరమైన జీవితాన్నే గడిపిన లోగాన్.. తన 24వ ఏట.. 2020లో తీవ్ర అనోరోగ్యానికి గురై మరణించాడు. అయితే ఆ రోజు చనిపోయాడనుకున్న లోగాన్ తిరిగి ఎలా బతికాడు? అంతమంది డాక్టర్స్ నిర్ధారించిన తర్వాత కూడా బాబులో పోయిన ప్రాణం ఎలా తిరిగి వచ్చింది? అనేది నేటికీ మిస్టరీనే. – సంహిత నిమ్మన
Comments
Please login to add a commentAdd a comment