ఈ నీటితొట్టెలోని చేపలను చూశారు కదా! ఇవి చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి. వీటి పొడవు దాదాపు గోరంత ఉంటుంది. కచ్చితంగా చెప్పాలంటే, ఇవి 10 నుంచి 12 మిల్లీమీటర్ల పొడవు వరకు ఉంటాయి. పారదర్శకంగా తళతళలాడుతూ చూడచక్కగా ఉంటాయి.
అయితే, ఇవి శబ్దం చేస్తే మాత్రం చెవులు చిల్లులు పడాల్సిందే! ఈ చేపలకు శాస్త్రవేత్తలు ‘డేనియోనెల్లా సరీబ్రమ్’ అని పేరుపెట్టారు. వీటి నుంచి వెలువడే శబ్దం 140 డెసిబల్స్ వరకు ఉంటుంది. మామూలుగా మనుషుల చెవులు 70 డెసిబల్స్ వరకు శబ్దాన్ని భరించగలవు. అంతకు రెట్టింపు స్థాయిలో కూత పెట్టగలగడమే ఈ గోరంత చేపల ప్రత్యేకత.
వీటి శబ్దం దాదాపుగా జెట్‌విమాన శబ్దంతో సమానంగా ఉంటుంది. ఈ చేపలను తొలిసారిగా 1980లలో గుర్తించారు. అయితే, ఈ చేపలను పోలిన ‘డేనియోనెల్లా ట్రాన్స్‌లూసిడా’ అనే మరోరకం చేపలు కూడా ఉండటంతో శాస్త్రవేత్తలు వీటి లక్షణాలను నిర్దిష్టంగా గుర్తించడంలో కొంత గందరగోళానికి లోనయ్యారు.
మూడేళ్ల కిందట ఒక అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం వీటిపై పరిశోధనలు జరిపి, వీటి కూత శక్తిని తెలుసుకున్నారు. వీటి గొంతు వద్ద ధ్వనికండరాలు, మృదులాస్థి ప్రకంపనల ద్వారానే ఈ చేపలు చెవులు చిల్లులు పడే స్థాయిలో కూత పెట్టగలుగుతున్నాయని గుర్తించారు. వీటి కూత ముందు సింహగర్జన కూడా బలాదూరే! సింహగర్జన శబ్దం 114 డెసిబల్స్ అయితే, ఈ చేపల కూత శబ్దం 140 డెసిబల్స్. ఇంతకు మించిన శబ్దం చేసే జీవి ప్రపంచంలో మరేదీ లేదు.
Comments
Please login to add a commentAdd a comment