ఆ ఊళ్లో ఇళ్లు కారుచౌకగా దొరుకుతాయి. అక్కడి ఇళ్ల ధరలు తెలుసుకుంటే, ఇక్కడి జనాలు ఏమాత్రం నమ్మలేరు. ఆ ఊరు ఇటలీలో ఉంది. సిసిలీ స్వయంప్రతిపత్తి ప్రాంతంలోని సంబూకా అనే పట్టణంలో ఒక్కో ఇల్లు ఒక యూరో నుంచి మూడు యూరోల (దాదాపు రూ. 90 నుంచి రూ. 270) ధరకే దొరుకుతాయి.
సరిగా చెప్పాలంటే, ఈ ఇళ్లు మామూలు పిజ్జా ధర కంటే తక్కువే! ఇటలీలో పిజ్జా ధర దాదాపు 5 యూరోల (రూ.446) వరకు ఉంటుంది. ఈ పట్టణంలో ఇప్పటికే రెండుసార్లు– 2019లో ఒకసారి, 2021లో ఒకసారి ఇళ్ల వేలం నిర్వహించారు. ఆ వేలం పాటల్లో ఇళ్ల ధరలు ఒక యూరో నుంచి మూడు యూరోల వరకు పలికాయి.
త్వరలోనే మరోసారి ఈ ఊళ్లో ఇళ్ల వేలం నిర్వహించనున్నారు. ఈసారి కూడా వేలంలో ఇళ్ల ధరలు పెద్దగా పెరిగే అవకాశం లేదని, ఇళ్ల ప్రారంభ ధరలు 3 యూరోల (సుమారు రూ.270) నుంచి మొదలయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. చాలాకాలంగా ఖాళీగా మిగిలిపోయి, పాడుబడిన ఇళ్లను ఈ పట్టణ సంస్థ ఇలా వేలంలో విక్రయిస్తోంది. వీటిని కొనుగోలు చేసేందుకు ఇటాలియన్లతో పాటు ఇటలీకి వచ్చే విదేశీ పర్యాటకులు కూడా ఆసక్తి చూపుతున్నారు.
పురాతనమైన పాడుబడిన ఇళ్లకు పన్నులు కట్టలేక కొందరు యజమానులు వాటిని ఎలాగైనా వదిలించుకోవాలనుకుంటున్నారని, అందుకే ఇక్కడ ఇళ్లు ఇంత చౌకగా దొరుకుతున్నాయని రియల్ ఎస్టేట్ ఏజెంట్ మారిజియో బెర్తీ చెబుతున్నారు. ఇక్కడ చౌకగా దొరికే ఇళ్లలో ఎక్కువగా శతాబ్దాల కిందట నిర్మించినవి. ఒక ఉదాహరణ చెప్పుకోవాలంటే, మసూద్ అహ్మది అనే వ్యక్తి, ఆయన భార్య షెల్లీ ఇక్కడ మూడు యూరోలకు 2019లో పద్దెనిమిదో శతాబ్ది నాటి ఇల్లు కొన్నారు.
దానిని 8400 యూరోల (సుమారు రూ.7.50 లక్షలు) ఖర్చుతో బాగు చేయించుకున్నారు. ఇక్కడ ఇళ్ల ధరల కంటే, వాటి మరమ్మతుల ఖర్చే ఎక్కువగా ఉంటుంది. మరమ్మతు ఖర్చులు కలుపుకున్నా, ఇక్కడి ఇళ్ల ధరలు కారుచౌక అనే చెప్పాలి.
Comments
Please login to add a commentAdd a comment