ఇది చూడటానికి మిగిలిన కొండగుహల మాదిరిగానే కనిపిస్తుంది గాని, నిజానికిది మృత్యుగుహ. ఈ గుహలోకి అడుగుపెడితే మృత్యువు తప్పదు. కోస్టారికాలోని పోవాస్ అగ్నిపర్వత శిఖరం వద్ద ఉన్న ఈ కొండగుహ మృత్యుగుహగా పేరుమోసింది.
రెండు మీటర్ల లోతు, మూడు మీటర్ల పొడవు ఉన్న ఈ గుహ చిన్నా చితకా జంతువులు, పక్షులు తలదాచుకోవడానికి అనువైన ప్రదేశంలా కనిపించినా, ఇందులోకి జంతువులు, పక్షులు ఏవీ వెళ్లవు. పొరపాటున వెళితే, క్షణాల్లోనే అవి ఊపిరాడక మరణిస్తాయి. కంటికి కనిపించని, కనీసం ముక్కుపుటాలకు వాసనైనా తెలియని కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ వాయువులు ఈ గుహ నిండా వ్యాపించి ఉండటం వల్లనే ఈ గుహలో ఎలాంటి జీవులైనా ప్రాణాలతో ఉండలేవు.
వెలిగించిన కాగడాను ఈ గుహలోపల పెడితే అది క్షణాల్లోనే ఆరిపోతుంది. ఊపిరి పీల్చుకోవడానికి అవసరమైన ఆక్సిజన్ బొత్తిగా లేకపోవడం, లోపల అంతా కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ వాయువులు వ్యాపించి ఉండటం వల్ల ఇది మృత్యుగుహగా తయారైంది.
ఈ గుహ లోపల ప్రతి గంటకు కనీసం ముప్పయి కిలోల కార్బన్ డయాక్సైడ్ వెలువడుతుంది. ఈ ప్రాంతంలో రిక్రియో వెర్డే కాంప్లెక్స్ నిర్మాణం జరుపుతున్నప్పుడు ఇంజినీర్లు ఈ గుహకు గల ప్రాణాంతక లక్షణాన్ని తొలిసారిగా గుర్తించారు. వారు దీనికి ‘కేవా డి లా మ్యూర్టె’ (మృత్యుగుహ)గా పేరుపెట్టారు.
ఇవి చదవండి: ఈ సరికొత్త టెక్నాలజీ గురించి విన్నారా! వీటి పనేంటో తెలుసా!!
Comments
Please login to add a commentAdd a comment