ఇది ప్రపంచంలోనే అతిచిన్న చెరసాల. ఇద్దరు ఖైదీల సామర్థ్యం మాత్రమే గల ఈ జైలు బ్రిటన్‌లోని సార్క్ దీవిలో ఉంది. ఇంగ్లండ్, ఫ్రాన్స్ దేశాల మధ్య ఇంగ్లిష్ చానల్‌లోని చానల్ దీవుల ద్వీపసమూహంలో ఒకటైన సార్క్ దీవి విస్తీర్ణం 5.4 చదరపు కిలోమీటర్లు మాత్రమే! ఈ దీవి జనాభా 562 మంది.
ఈ దీవిలో 1856లో ఈ జైలును నిర్మించారు. చెక్కపీపాను దీనికి పైకప్పుగా ఏర్పాటు చేయడం ఇందులోని మరో విశేషం. తొలిరోజుల్లో ఈ జైలుకు విద్యుత్ సౌకర్యం కూడా ఉండేది కాదు. జైలు నిర్మించిన దాదాపు శతాబ్దం తర్వాత మాత్రమే దీనికి విద్యుత్తు సౌకర్యం వచ్చింది. ఇందులో ఇద్దరు ఖైదీల కోసం రెండు గదులు, రెండు గదుల మధ్య సన్నని నడవ మాత్రమే ఉంటాయి. ఈ జైలు ఇప్పటికీ వినియోగంలో ఉండటం విశేషం.
అయితే, ఈ జైలులో ఖైదీలను ఎక్కువకాలం నిర్బంధంలో ఉంచరు. ఏదైనా నేరారోపణతో పట్టుబడిన నిందితులను ఈ జైలులో రెండు రోజుల వరకు ఉంచుతారు. కోర్టులో హాజరుపరచిన తర్వాత ఇక్కడి నుంచి గ్రంజీ దీవిలోని పెద్ద జైలుకు తరలిస్తారు. సార్క్ దీవి అధికార యంత్రాంగానికి బ్రిటిష్ రాచరికం పరిమితంగా మాత్రమే న్యాయవిచారణ అధికారాలను ఇచ్చింది.
ఇక్కడ పట్టుబడిన ఖైదీలను రెండు రోజులకు మించి నిర్బంధించరాదని, అంతకు మించిన శిక్ష విధించాల్సిన నేరానికి పాల్పడినట్లయితే వారిని గ్రంజీ జైలుకు తరలించాలని 1583లో అప్పటి బ్రిటిష్ రాచరికం ఆదేశాలు జారీచేసింది. ఆనాటి ఆదేశాలే ఇక్కడ ఈనాటికీ అమలులో ఉన్నాయి. అయితే, ఈ జైలుకు తరచు ఖైదీల రాక ఉండదు. తక్కువ జనాభా గల ఈ దీవిలో నేరాలు కూడా చాలా తక్కువ.
ఇవి చదవండి: 'అపార్ట్‌మెంట్ 66బి’ గురించి.. కనీసం మాట్లాడాలన్నా ధైర్యం చాలదు!
Comments
Please login to add a commentAdd a comment