
బల్లిలా కనిపించే ఈ వింతజీవి పేరు ‘ఆక్సలోటల్’. ఇది ఉభయచర జీవి. ఎక్కువగా మెక్సికోలో కనిపిస్తుంది. ఇవి పుట్టిన తర్వాత శైశవ దశలో నేల మీద ఉన్నా, పెరిగిన తర్వాత పూర్తిగా నీటిలోనే జీవిస్తాయి. పెద్ద తల, రెప్పలులేని కళ్లతో ఉండే ఈ జీవులు చూడటానికి చాలా వింతగా కనిపిస్తాయి.
నీటిలోని చేపలు, చిన్న చిన్న కీటకాలను వేటాడి తింటాయి. వీటికి ఒక అరుదైన శక్తి ఉంది. గాయాల వల్ల వీటిలోని ఏ శరీరభాగం తెగిపోయినా, కొద్దికాలంలోనే వాటిని పూర్తిగా పునరుజ్జీవింప చేసుకోగలవు. బల్లుల వంటి జీవులకు ఈ శక్తి చాలా పరిమితంగా ఉంటుంది. బల్లులకు తోక తెగిపోతే, అది తిరిగి పెరుగుతుంది. ‘ఆక్సలోటల్’కు తోక ఒక్కటే కాదు, శరీరంలోని ఏ అవయవం తెగిపోయినా, కొద్దికాలంలోనే అది పూర్తిగా తిరిగి పెరుగుతుంది.
ఇవి పాలిపోయిన తెలుపు, గులాబి, నలుపు, లేత బూడిద రంగు, ముదురు నీలి రంగుల్లో ఉంటాయి. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, మెదడు వంటి అంతర్గత అవయవాలను కూడా ఇవి తిరిగి పెంచుకోగలవు. వీటికి గల పునరుజ్జీవ శక్తికి కారణాలను తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఇప్పటికీ పరిశోధనలు జరుపుతున్నారు.
ఇవి చదవండి: అద్వైత: బజ్ మంటున్న అలారం శబ్దానికి?
Comments
Please login to add a commentAdd a comment