తూర్పు సీయరా నెవడా, కాలిఫోర్నియాలో ‘బాడీ’ అనే ఘోస్ట్ టౌన్ ని ప్రతి ఏడాది కొన్ని లక్షల మంది సందర్శిస్తుంటారు. 7,395 అడుగుల (2,254 మీటర్లు) ఎత్తైన కొండపై ఉన్న ఈ చారిత్రక నగరం.. ఎన్నో మిస్టీరియస్ కథనాలతో నేటికీ ప్రపంచాన్ని వణికిస్తోంది. అక్కడి అందాలను కళ్లతో ఆస్వాదించాలే తప్ప కంటికి ఇంపైన వస్తువును ‘బాగుంది కదా’ అని తీసుకుని బ్యాగ్‌లో వేసుకున్నామో బొందితో కైలాసం ఖాయం. ఆ క్షణం నుంచే.. అక్కడున్న అతీంద్రయశక్తుల వేట మొదలవుతుందట.
1859లో.. గి బోడే అనే వ్యక్తి.. తన స్నేహితులతో కలసి.. సీయరా పర్వతాలకు తూర్పువైపు వెళ్లినప్పుడు.. మొదటిసారి ఈ ప్రాంతాన్ని కనుగొన్నాడట. అక్కడ బంగారు గని ఉందని గుర్తించిన ఆ స్నేహితులంతా.. ఎవరికీ తెలియకుండా ఆ స్థలాన్ని కొంతకాలం రహస్యంగా ఉంచాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లే తిరిగి తమతమ స్వస్థలాలకు బయలుదేరారు.
అయితే బోడే తన స్వస్థలమైన మోనోవిల్‌కు వెళ్తుంటే.. దారిలో మంచు తుఫానులో చిక్కి మరణించాడు. దాంతో అతడి స్నేహితులంతా ఆ బంగారు గనులున్న ప్రాంతానికి బోడే అని పేరు పెట్టారు. అయితే బోర్డ్ మీద పేరు రాసే వ్యక్తి.. బోడేకి బదులుగా బాడీ అని రాయడంతో అదే పేరు స్థిరపడిపోయింది. కాలక్రమేణా ఆ గని గురించి తెలుసుకున్నవారి సంఖ్య పెరగడంతో.. 1876 నాటికి.. అక్కడ భారీ స్థాయిలో బంగారం తవ్వకాలు మొదలయ్యాయి. మైనింగ్ కంపెనీలు, హైడ్రో–ఎలక్ట్రికల్ కేంద్రాలతో ఆ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందసాగింది.
తదనుగుణంగా అక్కడ స్థిరపడేవారి సంఖ్య కూడా పెరగసాగింది. సుమారు 10 వేల మంది నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇతరప్రాంతాల నుంచీ రాకపోకలు పెరగడంతో రైల్వే మార్గం కూడా ఏర్పడింది. 1880 నాటికి, బాడీలో ఎన్నో వ్యాపారాలు వెలశాయి. అక్కడి ‘చైనా టౌన్’ అనే ఓ పెద్ద భవనంలో మొత్తం చైనీయులే ఉండేవారట. తమ దేశానికి చెందిన వస్తువుల్ని అక్కడి స్థానికులకు అమ్మేవారట. అయితే బాడీ టౌన్ మొత్తంలో క్రైమ్‌రేట్ విపరీతంగా ఉండేదట. హత్యలు, జూదం, వ్యభిచారం, దోపిడీలు, తుపాకీ కాల్పులు ఇలా వీధికో అఘాయిత్యం నమోదయ్యేదట.
1882 ప్రాంతంలో బతుకు తెరువు కోసం ఓ కుటుంబం బాడీకి వెళ్లాల్సి వచ్చిందట, దాంతో ఆ ఇంటి చిన్నారి ‘‘వీడ్కోలు దేవా.. మేము బాడీకి వెళ్తున్నాం’’ అని ఏడుస్తూ గట్టిగా ప్రార్థించిందట. దాన్ని బట్టి అర్థంచేసుకోవచ్చు బాడీలో ఎలాంటి భయానక వాతావరణం ఉండేదో? అక్కడికి వెళ్తే తిరిగి ప్రాణాలతో వస్తామన్న నమ్మకం ఎవరికీ ఉండేదికాదట.
అన్యాయాలు, అహింసలతో కొందరు చనిపోతే.. తీవ్రమైన మంచు కారణంగా మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. ఇంకొందరేమో మైనింగ్ ప్రమాదాల్లో అసువులుబాశారు. ఇదిలా ఉంటే.. 1892లో ఘోరమైన అగ్నిప్రమాదం సంభవించి తీవ్రమైన ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టమూ వాటిల్లింది. గనులు ఖాళీ కావడంతో.. 1917 నాటికి రైల్వే మార్గాన్ని కూడా నిలిపివేశారు. 1932లో మరొక భారీ పెద్ద అగ్నిప్రమాదం జరిగేసరికి.. పట్టణమంతా ఖాళీ అయ్యింది. అలా ప్రకృతితో మమేకమైన బాడీ.. ఇప్పుడు మాత్రం ఎన్నో వ్యథలను వినిపిస్తోంది.
బాడీ పట్టణాన్ని చూడటానికి రెండు కళ్లూ చాలవంటారు పర్యాటకులు. కొండ కోనల్లో, విశాలమైన గడ్డి మైదానాల్లో .. చెల్లాచెదురుగా పడున్న వాహనాలు.. నాటి కట్టడాలు, గుర్రపు బండ్లు వంటివన్నీ చిత్రకారుడు గీసిన పెయింటింగ్‌లా ఆకట్టుకుంటాయి. ఇక్కడ మొత్తం 168 భవనాలు నేటికీ చెక్కుచెదరకుండా దర్శనమిస్తాయి. సమీపంలోని శ్మశానవాటికలో 150 మంది ఖననాలు కనిపిస్తాయి. అయితే.. బాడీ టౌన్ లో పగటి పూట కూడా విచిత్రమైన అలికిడులు భయపెడతాయట.
ఆ పురాతన ఇళ్లల్లో నిద్ర చేయడానికి సాహసించిన ఎందరో పర్యాటకులు అక్కడి అతీంద్రియశక్తులేవో తమకు ఊపిరి ఆడకుండా చేశాయని, కనిపించని రూపాలేవో వణికించాయని తమకెదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. మరోవైపు ‘ఒ కెయిన్ హౌస్’ అనే ఇంట్లో ఒక చైనా మహిళ.. దయ్యంగా తిరుగుతుందని స్థానికుల నమ్మకం. అలాగే శ్మశానవాటికలో ‘ఎవెలిన్’ అనే మూడేళ్ల పాప ముసిముసి నవ్వులు వినిపిస్తాయనీ చెబుతుంటారు. ఎవెలిన్ మరణ వివరాలు 1897 రికార్డ్స్‌లో ఉన్నాయి.
ఇక్కడికి వచ్చిన ఎందరో పర్యాటకులు ఇక్కడ దొరికిన సీసాలను, చిన్న చిన్న బొమ్మలను తమ వెంట తీసుకెళ్లి ప్రమాదాలను కొనితెచ్చున్నారట. తీసుకెళ్లిన ప్రతి వస్తువు ఒక లేఖతో పాటు బాడీకి తిరిగి రావడమే ట్విస్ట్. ‘‘ఈ వస్తువును దొంగిలించినందుకు లేదా తీసుకున్నందుకు మమ్మల్ని క్షమించండి’ అని రాసిన ఎన్నో అజ్ఞాత లేఖల్లో.. బాడీలోని వస్తువుల్ని వెంట తీసుకుని వెళ్లడం వల్ల వాళ్లు ఎదుర్కొన్న సమస్యలను రాశారా బాధితులు.
కారు ప్రమాదాలు జరగడం, ఉద్యోగాలు కోల్పోవడం, తీవ్ర అనారోగ్యానికి గురికావడం ఇలా ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడి.. తిరిగి ఆ వస్తువుల్ని బాడీకి పంపించేశారట. అందుకే తెలిసినవారు ఎవ్వరూ ఇక్కడి వస్తువుల్ని బ్యాగ్‌లో వేసుకోరు. ఏది ఏమైనా ఇక్కడ ఉన్న అతీంద్రియశక్తులు ఏంటీ? ఇక్కడి వస్తువుల్ని ఎవరైనా తీసుకెళ్తే ఎందుకు వారిని వెంటాడుతున్నాయి? అనేది నేటికీ మిస్టరీయే! – సంహిత నిమ్మన
ఇవి చదవండి: Short Story: ఒకనాడు ఆ రాక్షసుడు నర్మదా తీరంలో..
Comments
Please login to add a commentAdd a comment