స్పెయిన్‌లోని అతి చిన్న నగరం ‘సిటీ ఆఫ్ ఫ్రియాస్’. స్పెయిన్‌కు వచ్చే పర్యాటకులు దీనిని పెద్దగా పట్టించుకోరు గాని, ఈ ఊరికి చాలా విశేషాలే ఉన్నాయి. పదో శతాబ్దికి చెందిన ఈ నగరంలో ఆనాటి రాజు రెండో జువాన్ నిర్మించిన రాతికోట ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. మునిసిపాలిటీ నిర్వహణలో ఉన్న ఈ ఊరు సాంకేతికంగా పట్టణమే అయినా, పేరులో మాత్రం ‘సిటీ’ ఉండటంతో స్పెయిన్‌లోని అతి చిన్న నగరంగా గుర్తింపు పొందింది.
చిన్నా చితకా పట్టణాల్లోనే కాదు, పల్లెల్లో కూడా కార్లు విరివిగా తిరిగే పరిస్థితులు ఉన్నా, ఈ ఊర్లో మాత్రం కార్లు కనిపించవు. ఇక్కడి ప్రజలు తమ ఊరిలో కార్లను నిషేధించారు. అందువల్ల మోటారు శబ్దాల రొద లేకుండా ఈ ఊరు ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఊరి జనాభా దాదాపు మూడువందల మంది మాత్రమే! ఈ విశేషాలు తెలిసిన కొద్దిమంది పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు. ఈ ఊళ్లోని పురాతనమైన ‘ఇగ్లేషియా డి సాన్ విన్సెంటె మార్టిర్’ కేథలిక్ చర్చి, ‘ఫ్యూంటే డి లాస్ తేజాస్’ ఫౌంటెన్ ప్రత్యేక ఆకర్షణలు.
ఈ ఫౌంటెన్ నుంచి నీరు కిందకు పడేటప్పుడు సంగీత స్వరాలు వినిపిస్తాయి. ఈ ఊళ్లో చిన్న చిన్న రెస్టారెంట్లు, హోటళ్లు, సెలూన్లు, మాంసం కొట్లు, ఫ్యాన్సీ దుకాణాలు, బేకరీ, ఫార్మసీ దుకాణాలు వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడి ‘హోటల్ రూరల్ ఫ్రియాస్’ పర్యాటకులకు అనుకూలంగా ఉంటుంది. పురాతన యూరోపియన్ విశేషాలను తిలకించాలనుకునే పర్యాటకులు ఇక్కడ బస చేయవచ్చు. ఈ హోటల్‌లో బస చేయడానికి రోజుకు 79 పౌండ్లు (రూ.8,411) చెల్లించాల్సి ఉంటుంది. సాధారణ యూరోపియన్ హోటళ్లతో పోల్చుకుంటే ఈ ధర తక్కువే!
ఇవి చదవండి: అబ్బే! ప్రాణహాని ఉందని కాదు!
Comments
Please login to add a commentAdd a comment