జమీందార్ గొడవర్తి నాగేశ్వరరావు
ఈ భవంతి.. జైపూర్ హవా మహల్‌ని గుర్తుకు తెస్తోంది కదూ! ఇది గంధర్వ మహల్.. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంటలో ఉంది! ప్రస్తుతం ఇందులో నివసిస్తున్న మూడోతరం.. ఇటీవలే దీని వందేళ్ల వేడుకను ఘనంగా నిర్వహించింది. ఈ మహల్‌ని చూపించడానికి సందర్భం అదే!
ఆచంటకు చెందిన జమీందార్ గొడవర్తి నాగేశ్వరరావు చిన్నతనం నుంచీ కోటలు చూస్తూ పెరగడంతో సొంతూళ్లో అటువంటి కట్టడాన్ని నిర్మించాలని భావించారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ తదితర ప్రాంతాల్లో పర్యటించి, అక్కడి కోటలను క్షుణ్ణంగా పరిశీలించి, 1918లో.. ఈ గంధర్వ మహల్‌కు శంకుస్థాపన చేశారు. ఆరేళ్లపాటు కొనసాగిన దీని నిర్మాణం 1924 నాటికి పూర్తయింది. సుమారు ఎకరం విస్తీర్ణంలో కొలువై ఉన్న ఈ మహల్ కోసం అప్పట్లోనే సుమారు పది లక్షల రూపాయల వరకు వెచ్చించినట్టు జమీందారు కుటుంబ సభ్యులు చెప్పారు.
ప్రత్యేకతలెన్నో..
మహల్ కోసం బర్మా నుంచి టేకు, బెల్జియం నుంచి అద్దాలు, లండన్ నుంచి ఇనుప గడ్డర్లను తెప్పించారు. రవాణా సదుపాయం అంతగాలేని ఆ రోజుల్లో జలరవాణా ద్వారా వాటిని తీసుకువచ్చారు. ఈ కట్టడానికి ఇనుప ఊచల ఊసు లేకుండా డంగు సున్నాన్నే వాడారు. ఈ మహల్‌లోకి అడుగుపెడితే మైసూర్ మహారాజా ప్యాలస్, గోల్కొండ కోటను చూసిన అనుభూతి కలుగుతుంది. 1885, లండన్ ఎగ్జిబిషన్‌లో రజత పతకం గెలిచిన పియానో ఈ మహల్‌లో ప్రత్యేక ఆకర్షణ. ఇప్పటికీ ఆ పియానో స్వరాలను పలికిస్తుంది. విశాలమైన హాల్‌లో బెల్జియం నుంచి తెప్పించిన నిలువెత్తు అద్దాలు చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తాయి. విద్యుత్ సౌకర్యం లేని ఆ రోజుల్లోనే విదేశాల నుంచి తెప్పించిన రంగురంగుల విద్యుత్ దీపాలను జనరేటర్ సాయంతో వెలిగించేవారని, ఆ వెలుగుల్లో మహల్‌ను చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు తండోపతండాలుగా వచ్చేవారని స్థానికులు చెబుతారు. ఈ మహల్ కట్టిన పదేళ్లకు గానీ ఆచంటకు విద్యుత్‌సదుపాయం రాలేదట.
ముఖ్యమంత్రులు బసచేశారు..
ఈ గంధర్వ మహల్ ఎందరో ప్రముఖులకు విడిదిగా విరాజిల్లింది. మాజీ ముఖ్యమంత్రులు మర్రిచెన్నారెడ్డి, ఎన్టీ రామారావుతో పాటు ఎంతో మంది మాజీ మంత్రులు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ భవంతిలోనే బసచేసేవారు. ఈ మేడలో మొత్తం నాలుగు అంతస్తులు, 12 గదులున్నాయి. గొడవర్తి నాగేశ్వరరావు అనంతరం మూడు తరాలకు ఇది నివాసంగా ఉంది. నాలుగోతరం వారిలో కొందరు విదేశాల్లో స్థిరపడ్డారని జమీందారు కుటుంబ సభ్యుల్లో ఒకరైన గొడవర్తి వెంకటేశ్వరస్వామి తెలిపారు. ఈ భవంతి కట్టాక రెండు పర్యాయాలు రంగులు వేయగా, వందేళ్లు పూర్తయిన సందర్భంగా రూ. 40 లక్షల వ్యయంతో మరమ్మతులు చేయించి రంగులతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. శతదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మరో 30 ఏళ్ల పాటు చెక్కుచెదరకుండా మరమ్మతులు చేయించామని వెంకటేశ్వరస్వామి చెప్పారు. గంధర్వ మహల్‌లో సినిమా షూటింగ్‌లకు అవకాశం ఇవ్వాలని ఎంతోమంది సినీరంగ ప్రముఖులు కోరినప్పటికీ జమీందారు కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. తమ తాతగారి వారసత్వ సంపదగా వస్తున్న ఈ మహల్‌ను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు. – విజయ్‌కుమార్ పెనుపోతుల, సాక్షి, భీమవరం
Comments
Please login to add a commentAdd a comment