మనలో చాలా మంది పక్షులను పెంచుకుంటూ ఉంటారు. కానీ ఎక్కువశాతం తమ ఆహ్లాదం కోసమే. నిజానికి పక్షులను ఆదరించాల్సింది మన ఆహ్లాదం కోసం కాదు, వాటి ఆనందం కోసం దగ్గరకు తీయాలి. వాటి రెక్కలు విరిచి పంజరంలో పెట్టి మనం చూస్తూ ఆనందించడం హేయమైన చర్య. స్వేచ్ఛగా ఎగరడం వాటి సహజ లక్షణం. అది వాటికి ప్రకృతి ఇచ్చిన హక్కు. ఆ హక్కును కాలరాసే అధికారం మనకు లేదు... అంటున్నారు మహారాష్ట్ర, పుణేలో నివసిస్తున్న రాధికా సోనావానే. ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్స్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా ఉద్యోగం చేస్తున్న రాధిక పక్షి సంరక్షకురాలిగా మారిన క్రమాన్ని ఆమె చాలా ఇష్టంగా వివరిస్తారు.
‘‘ప్రస్తుతం నా ఉద్యోగరీత్యా పూనాలో ఉన్నాం. మా స్వస్థలం ఔరంగాబాద్. బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ సలీం అలీ బర్డ్ సాంక్చురీకి ఎన్నిసార్లు వెళ్లానో లెక్కచెప్పలేను. పక్షుల మీద మమకారం ఏర్పడింది. నేను బర్డ్ లవర్‌ని బర్డ్ వాచర్‌ని మాత్రమే అనుకున్నాను. కానీ ఏ మాత్రం ముందస్తు ప్రణాళికలు లేకుండా అనుకోకుండా పక్షి సంరక్షకురాలినయ్యాను. పెళ్లి తర్వాత నా నివాసం ఔరంగాబాద్‌లోనే ఒక ఫ్లాట్‌లోకి మారింది.
మా పొరుగింట్లో ఓ పెద్దాయన బాల్కనీలో బర్డ్ ఫీడర్, ఒక గిన్నెలో నీరు పెట్టడం చూసిన తర్వాత నాకూ ఆలాగే చేయాలనిపించింది. పుణేకి బదిలీ అయిన తర్వాత కూడా కొనసాగింది. ఇప్పుడు మా ఇంటి గార్డెన్ పక్షుల విహార కేంద్రమైంది. నాకు తోచిన గింజలు పెట్టి సరిపెట్టకుండా ఏ పక్షికి ఏమిఇష్టమో తెలుసుకోవడానికి పక్షుల జీవనశైలిని అధ్యయనం చేశాను. రామ చిలుకలకు వేరుశనగ పప్పులు ఇష్టం. గోరువంకలు అరటి పండు తింటాయి. రామ చిలుక ముక్కు పెద్దది.
గోరువంక, పిచ్చుకల ముక్కులు చిన్నవి. ఆ సంగతి దృష్టిలో పెట్టుకుని ఫీడర్ బాక్సులు డిజైన్ చేయించాను. నేను పెట్టిన ఆహారాన్ని అవి ఇష్టంగా తింటున్నాయా లేదా, నేను చదివింది నిజమేనా కాదా అని తెలుసుకోవడానికి బాల్కనీలో కూర్చుని శ్రద్ధగా గమనించేదాన్ని. అరటి పండు ముక్కలను చూడగానే గోరువంకలు సంతోషంగా పాటలు పాడడం మొదలుపెడతాయి. పాట పూర్తయిన తర్వాత తింటాయి. టైయిలర్ బర్డ్ అయితే పత్తి దూదిని చూడగానే రాగాలు మొదలుపెడుతుంది.
గూడు కట్టుకోవడానికి పత్తి కనిపిస్తే దాని ఆనందానికి అవధులు ఉండవు. మనం సాధారణంగా కాకులను ఇష్టపడం. కానీ అవి చాలా హుందాగా వ్యవహరిస్తాయి. కాకులు, పిచుకలు, చిలుకలు, గోరువంకలు ఇతరులకు హాని కలిగించవు. పావురాలు అలా కాదు. వాటి ఆహారపు అలవాట్లు కూడా అంత సున్నితంగా ఏమీ ఉండవు. తమ ఆహారంలో ఇతరులను ముక్కు పెట్టనివ్వవు, ఇతరుల ఆహారాన్ని కూడా తామే తినేయాలన్నంత అత్యాశ వాటిది.
పక్షి స్వేచ్ఛాజీవి..
పెట్ డాగ్‌లాగా యజమానితో అనుబంధం పెంచుకోవడం పక్షుల్లో ఉండదు. స్వేచ్ఛగా విహరిస్తూ అనేక ప్రదేశాలకు వెళ్తుంటాయి. ఒక ప్రదేశంతో కానీ వ్యక్తితో కానీ అనుబంధం పెంచుకోవు. మా ఇంటికి వచ్చే నా అతిథుల్లో చిలుకలే ఎక్కువ. అలెగ్జాండ్రియన్ ΄్యారట్, ఇండియన్ రింగ్‌నెక్ ΄్యారట్‌లు తరచూ కనిపిస్తుంటాయి. సన్‌బర్డ్, వీవర్ బర్డ్ కూడా వస్తుంటాయి. కాలం మారేకొద్దీ అవి అప్పటి వరకు ఉన్న ప్రదేశాలను వదిలి తమకు అనువైన ప్రదేశాలకు వెళ్లిపోతుంటాయి.
వాయు కాలుష్యం, వాతావరణంలో వస్తున్న మార్పులు కూడా పక్షుల వలసలకు కారణమే. సెల్ ఫోన్ టవర్‌ల నుంచి వెలువడే రేడియేషన్ కారణంగా పక్షులు కంటి చూపును కోల్పోతున్నాయి. దాంతో అవి తమకు సురక్షితమైన ప్రదేశాలను వెతుక్కుంటూ ఎటుపోతున్నాయో తెలియడం లేదు. కరవు, అధిక వర్షాలు, యాసిడ్ వర్షాలు, అడవులలో చెట్లు నరకడం, మంటలు వ్యాప్తించడం... వాటికి ఎదురయ్యే ప్రమాదాలు. పక్షులు అడవిలో జీవించినంత ధైర్యంగా మనుషుల మధ్య జీవించలేవు.
వాటికి మనుషులంటే భయం. ఆ భయాన్ని వదిలించి మచ్చిక చేసుకోవాలంటే వాటికి ఆహారాన్ని అందుబాటులో ఉంచడం ఒక్కటే మార్గం. ఆహారం కోసం ధైర్యం చేస్తాయి, క్రమంగా మన మీద నమ్మకం కలిగిన తర్వాత మన ఇంటిని తమ ఇంటిలాగా భావిస్తాయి. మా గార్డెన్‌కి రోజూ నలభై నుంచి యాభై పక్షుల వరకు వస్తుంటాయి. వాటి కోసం ఇంట్లో వంటగది, హాలు, బాల్కనీల్లో పక్షుల కోసం నీటి పాత్రలు పెట్టాను. దాహం వేసినప్పుడు నేరుగా దగ్గరలో ఉన్న నీటి పాత్ర దగ్గరకు వెళ్లిపోతాయి. పక్షులు మనతో మాట్లాడతాయి.
రోజూ మా ఇంటి ఆవరణలో వినిపించే కిచకిచలన్నీ అవి నాకు చెప్పే కబుర్లే. కరోనా సమయంలో నా టైమ్ అంతా వీటి కోసమే కేటాయించాను. నన్ను నిత్య చైతన్యంగా ఉంచాయవి. నిజానికి పక్షి ప్రేమికులెవ్వరూ పక్షులను పంజరంలో బంధించరు. తమ సంతోషం కోసం పక్షులను పెంచే స్వార్థజీవులే ఆ పని చేస్తారు. దయచేసి పక్షులను బంధించవద్దు. వాటిని స్వేచ్ఛగా ఎగరనివ్వండి. చేతనైతే రోజుకు గుప్పెడు గింజలు, ఒక పండు పెట్టండి’’ అంటూ పక్షుల గురించి ఆసక్తికరమైన విషయాలెన్నో చెబుతారు రాధిక.
ఇవి చదవండి: ఉర్దూ మీడియంలో చదివి.. 'నీట్' టాపర్‌గా..!
Comments
Please login to add a commentAdd a comment