శ్రీవారి దర్శనానికి టైం స్లాట్ యోచన | Now, the time slot is active and planned | Sakshi
Sakshi News home page

శ్రీవారి దర్శనానికి టైం స్లాట్ యోచన

Published Sat, Jul 5 2014 5:06 AM | Last Updated on Sat, Sep 2 2017 9:48 AM

శ్రీవారి దర్శనానికి టైం స్లాట్ యోచన

శ్రీవారి దర్శనానికి టైం స్లాట్ యోచన

  •      టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్
  •      పోస్టాఫీసుల ద్వారా దర్శన టికెట్ల బుకింగ్
  •      వృద్ధులకు స్వామి కనిపించేలా బైనాక్యులర్ సదుపాయం
  •      మూడు క్యూల విధానం వందశాతం సక్సెస్
  • సాక్షి, తిరుమల : శ్రీవారి భక్తులు తిరుమలలోని క్యూల వద్ద, కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండకుండా తగిన సమయం ప్రకారం వచ్చి స్వామిని దర్శించుకునేలా టైం స్లాట్ విధానం అమలు చేస్తామని టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్ అన్నారు. శుక్రవారం ఆయన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భక్తులు అడిగిన ప్రశ్నకు, అనంతరం విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. తొలుత రూ.300 టికెట్ల దర్శనంలో కొత్త విధానం అమలు చేస్తామని, తర్వాత దశలో కాలినడక, సర్వదర్శనం, ఇతర దర్శనాలకు అమలు చేస్తామని చెప్పారు.

    టైం స్లాట్ విధానంలో దేశవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసులు, ఇంటర్నెట్, ఆన్‌లైన్ ద్వారా శ్రీవారి దర్శన టికెట్లు బుకింగ్ చేసుకునే విధానంపై యోచన చేస్తున్నామని ఈవో వెల్లడించారు. దేశంలోని పోస్టాఫీసుల సేవలను వినియోగించుకోవడం వల్ల దర్శన టికెట్ల కోసం ప్రత్యేకంగా టీటీడీ ఈ-దర్శన్ కౌంటర్లను నిర్వహించాల్సిన అవసరం ఉండదని ఈవో గుర్తు చేశారు. భక్తులకు సంతృప్తికంగా దర్శనం కల్పించేందుకు ఆలయంలో కొత్తగా అమలు చేస్తున్న మూడు క్యూల విధానం వందశాతం సక్సెస్ అయ్యిందని ఈవో ఆనందం వ్యక్తం చేశారు.
     
    ఇక మహాలఘు దర్శనమే : ఈవో స్పష్టీకరణ

    పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయంలో మహాలఘు దర్శనం(70 అడుగుల దూరం నుంచే మూలమూర్తిని దర్శించుకునే అవకాశం) అమలు చేయాల్సి ఉంటుందని ఈవో గిరిధర్ గోపాల్ భక్తులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. గతంలో అప్పటి పరిస్థితులు, రద్దీకి అనుగుణంగా కులశేఖరపడి, లఘుదర్శనం అమలు చేసినా ప్రస్తుతం అది సాధ్యం కాదన్నారు. దగ్గరగా వెళ్లి  తోపులాటలో దర్శించుకోవటం కన్నా... కాస్త దూరమైనా ప్రశాంతంగా ఎలాంటి తోపులాటలు లేకుండా కనీసం రెండు సెకన్ల సమయం స్వామిని దర్శించుకునే అవకాశం కల్పించామని ఈవో గుర్తు చేశారు. ఇక మహాలఘు దర్శనమే అమలు చేస్తామని, ఈ విధానంలో ఎలాంటి మార్పులు ఉండబోవన్నారు.
     
    వృద్ధులకు బైనాక్యులర్స్

    మహాలఘుదర్శనంలో సుమారు 70 అడుగుల దూరం నుంచే మూలమూర్తిని దర్శించుకోవాల్సి ఉండటంతో వృద్ధులకు బైనాక్యులర్స్ ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామని ఈవో అన్నారు. దూరం కావడం వల్ల స్వామిని దర్శించుకోలేకపోతున్నామన్న ఓ భక్తుడి విన్నపంతో ఈవో పైవిధంగా బదులిచ్చారు. ఉదయం 10 గంటలు, మధ్యాహ్నం 2 గంటలకు రెండు విడత ల్లో అమలు చేసే వృద్ధుల దర్శనంలో ఒకటి రెండు సెకన్లు ఆలస్యమైనా ఆలయంలో ప్రత్యేకంగా బైనాక్యులర్ అద్దాలు ఇస్తామని చెప్పారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement