శ్రీవారి దర్శనానికి టైం స్లాట్ యోచన: గిరిధర్ గోపాల్
టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్
పోస్టాఫీసుల ద్వారా దర్శన టికెట్ల బుకింగ్
వృద్ధులకు స్వామి కనిపించేలా బైనాక్యులర్ సదుపాయం
సాక్షి, తిరుమల: శ్రీవారి భక్తులు తిరుమలలోని క్యూలు, కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండకుండా తగిన సమయం ప్రకారం వచ్చి స్వామిని దర్శించుకునేలా టైం స్లాట్ విధానం అమలు చేస్తామని టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్ అన్నారు. శుక్రవారం ఆయన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భక్తులు అడిగిన ప్రశ్నలకు, అనంతరం విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. తొలుత రూ.300 టికెట్ల దర్శనంలో కొత్త విధానం అమలు చేస్తామని, తర్వాత దశలో కాలినడక, సర్వదర్శనం, ఇతర దర్శనాలకు అమలు చేస్తామని చెప్పారు. టైం స్లాట్ విధానంలో దేశవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసులు, ఇంటర్నెట్, ఆన్‌లైన్ ద్వారా శ్రీవారి దర్శన టికెట్లు బుకింగ్ చేసుకునే విధానంపై యోచన చేస్తున్నామని ఈవో వెల్లడించారు. పోస్టాఫీసుల సేవలను వినియోగించుకుంటే దర్శన టికెట్ల కోసం టీటీడీ ఈ-దర్శన్ కౌంటర్ల అవసరం ఉండదని చెప్పారు. మహాలఘుదర్శనంలో సుమారు 70 అడుగుల దూరం నుంచే మూలమూర్తిని దర్శించుకోవాల్సి ఉండటంతో వృద్ధులకు బైనాక్యులర్స్ ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామని వివరించారు.