వయోభారం, అనారోగ్య సమస్యలతో ఢిల్లీలో తుదిశ్వాస విడిచిన నాట్య మయూరి
నేడు ఢిల్లీ గ్రీన్‌పార్క్ శ్మశానవాటికలో అంత్యక్రియలు
ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లె యామిని జన్మస్థలం
2016లో పద్మ విభూషణ్ పురస్కారం..
సాక్షి, న్యూఢిల్లీ/మదనపల్లె/అమరావతి: ప్రముఖ భరతనాట్య, కూచిపూడి, ఒడిస్సీ నృత్య కళాకారిణి, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ యామినీ కృష్ణమూర్తి (84) కన్నుమూశారు. వయసు రీత్యా తలెత్తిన అనారోగ్య సమస్యలతో ఏడు నెలలుగా బాధపడుతున్న ఆమె ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆమె పార్థి వదేహాన్ని ఢిల్లీ గ్రీన్‌పార్క్‌లోని డి–బ్లాక్‌లో అభిమానుల సందర్శనార్థం ఉంచారు.
ఆదివారం సాయంత్రం 5 గంటలకు గ్రీన్‌పార్క్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబీకులు వెల్లడించారు. చాలా ఏళ్లుగా ఢిల్లీలోనే ఉంటూ ప్రదర్శనలు ఇస్తున్న కృష్ణమూర్తి ఈ ఏడాది జనవరిలో వయోభార సంబంధిత సమస్యలతో అపోలో ఆస్పత్రిలో చేరారు. అప్పట్నుంచి ఆస్పత్రి ఐసీయూలోనే వైద్యులు చికిత్స అందిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం ఆరోగ్యం విషమించి తుదిశ్వాస విడిచారు.
17వ ఏట తొలి ప్రదర్శన
యామిని పూర్తిపేరు యామినీ కృష్ణమూర్తి పూర్ణతిలకం. చిత్తూరు జిల్లా మదనపల్లెలో 1940 డిసెంబర్ 20న ముంగర కృష్ణమూర్తి, లక్ష్మి దంపతులకు జన్మించారు. తండ్రి కృష్ణమూర్తి సంస్కృత పండితులు. నృత్యంపై ఉన్న మమకారంతో మదనపల్లెలోని ఓ డ్యాన్స్ మాస్టర్ వద్ద చిన్న వయసులోనే నాట్యం నేర్చుకొనేందుకు యామిని వెళ్లారు. ఆ తర్వాత కొంతకాలానికి తమిళనాడులోని చిదంబరంలో స్థిరపడ్డారు.
తన తండ్రి ప్రోత్సాహంతో 5వ ఏట చెన్నైలోని రుక్మిణీదేవి అరండేల్ కళాక్షేత్రంలో భరతనాట్యం నేర్చుకోవడం ప్రారంభించారు. అనంతరం కూచిపూడి, ఒడిస్సీ కూడా అభ్యసించారు. ఎండీ రామనాథన్ వద్ద కర్ణాటక సంగీతం, కల్పక్కం స్వామినాథన్ దగ్గర వీణ నేర్చుకున్నారు. యామిని తన తొలి ప్రదర్శనను తన 17వ ఏట 1957లో చెన్నైలో ఇచ్చారు.
ఖండాంతరాలను దాటిన ప్రతిభ
యామిని భరతనాట్య ప్రతిభ ఖండాతరాలను దాటింది. 17 ఏళ్ల వయసులో తొలిసారి ఆస్ట్రేలియాలో భరతనాట్య ప్రదర్శన ఇచ్చారు. ఆ తర్వాత అమెరికా, యూరొప్, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, న్యూజిలాండ్, ఇండోనేసియా, థాయ్‌ల్యాండ్, సింగపూర్, మయన్మార్ వంటి దేశాల్లో భరతనాట్యం, కూచిపూడి ప్రదర్శనలతో మంత్రముగ్ధుల్ని చేశారు.
ఢిల్లీలో నృత్య కౌస్తుభ కల్చరల్ సొసైటీ యామినీ స్కూల్ ఆఫ్ డాన్స్ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి యువతకు భరతనాట్యం, కూచిపూడి నృత్యాల్లో శిక్షణ ఇస్తున్నారు. 2014లో మహిళా దినోత్సవం సందర్భంగా శాంభవి స్కూల్ ఆఫ్ డాన్స్ సంస్థ యామినికి నాట్య శాస్త్ర పురస్కారాన్ని అందించింది. ఢిల్లీలోని ఇందిరా ప్రియదర్శిని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మ్యూజిక్ అండ్ డాన్స్ అనే సంస్థకు డైరెక్టర్‌గా ఆమె కొన్నేళ్లు సేవలందించారు.
‘డకోటా’ ఫ్లైట్‌లో పాకిస్తాన్‌కు..
యామినీ కృష్ణమూర్తి నాట్యం గురించి తెలుసుకున్న పాకిస్తాన్ దేశస్తులు.. అక్కడ ప్రదర్శన నిమిత్తం ఆహ్వానించారు. దీంతో 1970లో ఆమె లాహోర్‌లో ప్రదర్శన ఇచ్చారు. ఆ సమయంలో భారత్ నుంచి ‘డకోటా’ ఫ్లైట్‌లో అతికష్టం మీద పాక్‌కు వెళ్లాల్సి వచ్చి ందని పలు సందర్భాల్లో ఆమె ప్రస్తావించారు. భరతనాట్యం, కూచిపూడి నాట్యప్రదర్శలను చూసిన పాకిస్థానీలు మంత్రముగ్థులై పలుమార్లు ఆమెను ఆహ్వానించడం విశేషం. ప్రముఖ సేవామూర్తి మదర్ థెరెసా చేతుల మీదుగా యామిని జ్ఞాపికను అందుకోవడం విశేషం.
వివాహం చేసుకోకుండా..
నాట్య రంగానికే జీవితాన్ని అంకితం చేసిన యామిని వివాహం చేసుకోలేదు. తన నృత్య జీవిత విశేషాలను, నృత్యం నేర్చుకొనే క్రమంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, నేర్పించిన గురువుల వివరాలతో ‘ఎ ప్యాషన్ ఫర్ డ్యాన్స్’ పేరుతో పుస్తకం రచించారు.
అనేక అవార్డులు ఆమె సొంతం
యామినీ కృష్ణమూర్తి దేశ, విదేశాల్లో కూచిపూడి నృత్యానికి ఎంతో పేరు, ప్రఖ్యాతలు తెచ్చిపెట్టారు. కర్ణాటక సంగీతం నేర్చుకున్న యామిని.. పాటపాడుతూ నృత్య ప్రదర్శనలు ఇచ్చేవారు. భరతనాట్యంలో యామిని ప్రతిభను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆమెను 1968లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్, 2016లో పద్మవిభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. టీటీడీ ఆస్థాన నర్తకిగానూ యామిని కొనసాగారు.
భాగ్యనగరంతో అనుబంధం
సాక్షి, హైదరాబాద్: యామినీ కృష్ణమూర్తికి హైదరాబాద్‌తో అనుబంధం ఉంది. సౌత్ ఇండియా కల్చరల్ అసోసియేషన్, కళాసాగర్ వంటి సంస్థలు ఏర్పాటు చేసిన అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆమె దశావతారం, కృష్ణ శబ్దం తదితర ప్రదర్శనలిచ్చి ప్రేక్షక లోకాన్ని మైమరిపించారు.
ఉస్మానియా విశ్వ విద్యాలయం రవీంద్రనాథ్ ఠాగూర్ ఆడిటోరియంలో జరిగిన ఆమె నృత్య ప్రదర్శన హైదరాబాద్ కళాప్రియులకు సుపరిచితం. తెలుగు విశ్వవిద్యాలయం ఆమెను సిద్ధేంద్రయోగి పురస్కారంతో గౌరవించింది. 2012లో హైదరాబాద్ రవీంద్రభారతిలో సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ కూచిపూడి నృత్యోత్సవాల్లో ప్రదర్శనలిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment