గతమంతా శాస్త్రీయతే! | Salyudiki, the battle between Lord Krishna ... | Sakshi
Sakshi News home page

గతమంతా శాస్త్రీయతే!

Published Mon, Sep 23 2013 1:22 AM | Last Updated on Fri, Sep 1 2017 10:57 PM

గతమంతా శాస్త్రీయతే!

గతమంతా శాస్త్రీయతే!

ద్వారకానగరాన్ని, శల్యుడికి, కృష్ణుడికి మధ్య జరిగిన యుద్ధాన్ని... మహాభారతం అభివర్ణిస్తుంది. అంతేకాదు, ఆకాశంలో ఎగిరే యంత్రాల నుంచి ఆయుధాలు, క్షిపణుల ప్రయోగం గురించి కూడా ప్రస్తావిస్తుంది. వాటివర్ణన అణ్వాయుధాలను, ఎగిరే పళ్లాలను పోలి ఉంటుంది.
 
ఇటీవలి కాలం వరకు ఆధునిక చరిత్రకారులు ద్వారకను పుక్కిటి పురాణంగా కొట్టిపారేశారు. రామసేతు, మహాభారతం, సరస్వతీ నది... వంటి వాటిని కూడా పుక్కిటి పురాణాలుగా ముద్రవేశారు. గుజరాత్‌లో ద్వారకానగరం, పెద్దకోటలు, భారీ పునాదులు తవ్వకాలలో బయటపడ్డాయి. ‘వీటిని మానవమాత్రులు నిర్మించలేరు’ అంటూ అధికారులు పేర్కొనడాన్ని బట్టి ఆ నగరాన్ని... దేవతలలో ఒకరైన విశ్వకర్మ నిర్మించాడన్న వాదన నిజమేనని సూచిస్తోంది. అలాగే అవాస్తవికమైనదిగా భావించిన సరస్వతీ నది ఉనికి నిజమేనంటూ ‘నాసా’ ధృవీకరించడం... మన పురాణాలలో వర్ణించినట్టుగానే అనేకానేక ప్రదేశాల ఉనికి నిజమేనని రుజువయింది.

ఈ ఆవిష్కరణలలో పాశ్చాత్య మేధావులైన శాస్త్రవేత్తలు, చరిత్రకారులు పాలు పంచుకుంటున్నారు. దేవుళ్లు, గంధర్వులు, యక్ష రాక్షసులు తదితరులంతా వివిధ డైమన్షన్స్ నుంచి వచ్చినవారేనని వైదికగ్రంథాలు పేర్కొంటున్నాయి. మానవజాతి మరొక డైమన్షన్ నుంచి వచ్చిందని, దేవుళ్లు దానిని పర్యవేక్షించారని ఆధునిక శాస్త్రవేత్తలు అంగీకరిస్తున్నారు. అయితే ఈ వాస్తవాన్ని మెజారిటీ ప్రజల మనస్సుల నుంచి తుడిచివేయడం ఆసక్తికరమైన విషయం.

ఆధునిక మానవుడు దేవుడే లేడని విశ్వసిస్తున్నాడు. తాను జీవించవలసిన పర్యావరణాన్ని, ప్రకృతిని స్వార్థం కోసం విధ్వంసం చేస్తూ ఈ భూమిపైన ఉన్న వనరులను దోచుకుంటున్నాడు. ఈ యుగంలో మానవుడు స్వార్థం, నిరీశ్వర వాదంతో తనతో సహా అన్నింటినీ విధ్వంసం చేస్తాడని పెద్దలు ఏనాడో స్పష్టంగా హెచ్చరించారు. ఈ వాస్తవాన్ని చూడగలిగినవారు, మానవ జాతిని కాపాడగలిగినవారు కొందరే వున్నారు. మహాభారతంలోని వనపర్వంలో మార్కండేయ మహర్షి కలియుగంలో జరగబోయే ఘట్టాలను స్పష్టంగా అభివర్ణించారు.
 
వేదాలు మానవులకు ప్రవర్తనా నియమావళినే కాదు, దేవుళ్లతో సంభాషించేందుకు మార్గాలను (హవనాలు, మంత్రాలు) సూచించాయి. మనం ఈ డైమన్షన్‌లో పరిపూర్ణంగా జీవించామని భావించినప్పుడు తిరిగి మన ఇంటికి మనం వెళ్లేందుకు మార్గాన్ని కూడా వేదాలు సూచించాయి.

 వైదిక గురువుల మాటలలోని ప్రామాణికతను, విశ్వసనీయతను ఆధునిక శాస్త్రం నెమ్మదిగా ఆవిష్కరిస్తున్న నేపథ్యంలో, వేల ఏళ్ల కిందటే గ్రంథస్థం చేసిన శాస్త్రీయ వాస్తవాలను కనుగొని, వేదాలు చెప్పింది వాస్తవమే తప్ప పుక్కిటిపురాణం కాదనే అభిప్రాయానికి వస్తున్నారు. ఏది ఏమైనా... మహాప్రళయానికి కారణ భూతమైన విషయం మాత్రం, ఆధునిక మానవుడికి శాశ్వతంగా అంతుచిక్కని ప్రశ్నగానే మిగులుతుంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement