
సాక్షిప్రతినిధి, కరీంనగర్: సంక్రాంతి వేళ..కరీంనగర్‌లో ఓ పందెం కోడి వార్త సందడి చేస్తోంది. ఆసక్తి ఉన్నవారు ఈ కోడిని వేలంపాటలో దక్కించుకోవచ్చంటూ ఆర్టీసీ డిపో–2 మేనేజర్ మల్లయ్య గురువారం ఒక ప్రకటన చేయడమే ఇందుకు కారణం. ఇంతకీ ఈ కోడి కథాకమామీషు ఏంటో ఓసారి చూద్దాం!
అసలేం జరిగిందంటే...?
ఈనెల 9వ తేదీన కరీంనగర్ ఆర్టీసీ డిపో–2కు చెందిన ఎక్స్‌ప్రెస్ బస్సు వరంగల్ నుంచి వేములవాడకు వెళ్లింది. అక్కడి నుంచి తిరిగి కరీంనగర్ డిపోకి చేరుకుంది. బస్సు దిగి ఇంటికి వెళదామని బస్సు డ్రైవర్, కండక్టర్ సిద్ధమవుతుండగా, ఇంతలో కోడి కూత వినబడటంతో ఇద్దరూ అవాక్కయ్యారు. సీటు కింద దాన్ని సంచిలో జాగ్రత్తగా కట్టేసిన తీరు చూసి, ఎవరో ప్రయాణికుడు మర్చిపోయాడని గుర్తించారు.
కోడి యజమాని వస్తాడని కొద్దిసేపు చూశారు. కానీ, ఎవరూ రాకపోవడంతో ఏం చేయాలో తోచక కంట్రోలర్‌కు ఆ కోడిని అప్పగించారు. మూడురోజులుగా ఆ కోడిని ఓ ఇనుప బోనులో రక్షణ కల్పిస్తున్నారు. దానికి దాణా, నీళ్లు ఇస్తూ అతిథిలాగే మర్యాదలు చేస్తున్నారు. కోడి యజమానికి తెలియజేసే క్రమంలో మీడియాలోనూ ప్రకటన విడుదల చేశారు.
అయినా కోడి ఆచూకీ కోసం ఎవరూ రాలేదు. దీంతో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు కరీంనగర్ డిపో–2 ఆవరణలో బహిరంగ వేలం వేసేందుకు నిర్ణయించారు. ఆసక్తి ఉన్న వారు వేలం పాటలో పాల్గొనవచ్చునని డిపో మేనేజర్ మల్లయ్య పేర్కొన్నారు. ఇంతకీ సర్కారు వారి పాట ఎంత ఉంటుందో..? ఆ కోడి యజమాని వస్తాడా? రాడా..? ఇంతకీ వేలం పాటలో దేవుని పాట ఎంతకు మొదలవుతుంది? అన్న విషయంపై చర్చ సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment