కాళేశ్వరానికి పర్యావరణ క్లియరెన్స్!
షరతులతో పర్యావరణ ప్రభావ మదింపు అనుమతులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట కల్పిస్తూ ‘కాళేశ్వరం’ ఎత్తిపోతల పథకం పర్యావరణ ప్రభావ మదింపు(ఈఐఏ) ప్రక్రియ చేపట్టేందుకు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ అనుమతులిచ్చింది. అయితే పూర్తి స్థాయి పర్యావరణ అనుమతుల నాటికి కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సూత్రప్రాయ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని షరతు పెట్టింది. ఈ మేరకు గత నెల 30, 31వ తేదీల్లో జరిగిన సమావేశపు వివరాలను కేంద్ర పర్యావరణ శాఖ వెబ్‌సైట్‌లో పొందు పరిచింది. ఈ శాఖ పరిధిలోని పర్యావరణ సలహా కమిటీ(ఈఏసీ) చేసిన నిర్ణయాన్ని మినిట్స్ రూపంలో వెల్లడించింది. ప్రాజెక్టు పర్యావరణ నివేదిక తయారీకి అనుసరిం చాల్సిన విధి విధానాలను (టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్–టీఓఆర్) ఖరారు చేస్తూ పలు సూచనలు చేసింది.
షరతులతో అనుమతులు
రాష్ట్రంలో సుమారు 18.25 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందించే లక్ష్యంతో రూ.80,499.71 కోట్ల అంచనాతో కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే. గోదావరి నుంచి 180 టీఎంసీలను మళ్లించేలా 150 టీఎంసీల సామర్థ్యంతో 26 రిజర్వాయర్లను ప్రతిపాదించారు. ప్రాజెక్టు పరిధిలో మొత్తంగా 80 వేల ఎకరాల భూసేకరణ, 2,866 హెక్టార్ల (13,706 ఎకరాల) మేర అటవీ భూమి అవసరం ఉంది. పర్యావరణాన్ని ప్రభావితం చేసే ఈ అంశాలకు.. పరిష్కారాలు చూపుతూ ప్రభుత్వం పర్యావరణ ప్రభావ మదింపు, పర్యావరణ నిర్వహణ ప్రణాళిక (ఈఎంపీ) చేపట్టాల్సి ఉంది.
అయితే కోర్టు కేసులు, ట్రిబ్యునళ్ల తీర్పుల నేపథ్యంలో అప్రమత్తమైన నీటి పారుదల శాఖ ముందుగానే స్పందించి జనవరి 20నే పర్యావరణ మదింపు కోసం ఈఏసీకి వివరణలు ఇచ్చింది. కానీ సీడబ్ల్యూసీ అనుమతులిచ్చే వరకు.. తాము ఓకే చెప్పలేమని అప్పట్లో ఈఏసీ తేల్చిచెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం మరోసారి విజ్ఞప్తి చేయడంతో మంగళవారం సానుకూల నిర్ణయాన్ని వెల్లడించింది. పర్యావరణ అను మతుల నివేదికలు సమర్పించే సమయంలో సీడబ్ల్యూసీ సూత్రప్రాయ క్లియరెన్స్‌లు సైతం అందించాలని సూచించింది. హైడ్రాలజీ డేటా అధ్యయనాలను ఈఐఏ, ఈఎంపీలతో కలిపి సమర్పించాలని, ఏడాదిలో వరుస పది దినాల్లో 90, 75, 50 శాతం డిపెండబెలిటీ నీటి లెక్కలతో ఈఐఏ తయారు చేయాలని తెలిపింది. నిర్వాసితులకు చట్ట ప్రకారం తగిన పరిహారం చెల్లించాలంది.
ప్రాణహిత, తుపాకులగూడెం ప్రాజెక్టులకూ ఓకే
ఆదిలాబాద్ జిల్లాలో 80వేల హెక్టార్లకు నీరందించేందుకు రూ.4,204 కోట్లతో చేపట్టిన ‘ప్రాణహిత (తమ్మిడిహెట్టి)’ ప్రాజెక్టు టీఓఆర్‌కు పర్యావరణ సలహా కమిటీ ఓకే చెప్పింది. ప్రాజెక్టుకు ఇప్పటికే ఏదైనా సమాచారం సేకరించి ఉంటే దాన్ని ఏఐఏకి వాడుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే మూడేళ్ల ముందున్న డేటా మాత్రం ఉండరాదని పేర్కొంది. పర్యావ రణ ప్రభావ మదింపులో భాగంగా ప్రజా భిప్రాయ సేకరణ కచ్చితంగా చేయాలని స్పష్టం చేసింది. ఇక వరంగల్ జిల్లాలో 50 టీఎంసీల సామర్థ్యంతో రూ.2,121 కోట్ల తో నిర్మిస్తున్న తుపాకులగూడెం ప్రాజెక్టు టీఓఆర్‌కు కూడా పర్యావరణ సలహా కమిటీ అంగీకారం తెలిపింది. దీనికి సైతం ఈఐఏ, ఈఎంపీ నివేదికలతో సహా సీడబ్ల్యూసీ సూత్రప్రాయ అంగీకార నివేది కను సమర్పించాలని సూచించింది.